ఏమీ తెలియకుండా పాట రాస్తామా... యండమూరికి చంద్రబోస్ కౌంటర్!

Update: 2022-12-29 17:01 GMT
పాట గురించి తెలియాలీ అంటే రసికత ఉండాలి. ఆ సౌందర్యం తెలుసుకోవాలన్న తపన ఉండాలి. అపుడే పాట అర్థం అవుతుంది అని ప్రముఖ సినీ గీత రచయిత చంద్రబోస్ అన్నారు. తాను తాజాగా మెగాస్టార్ చిరంజీవి  వాల్తేరు వీరయ్య చిత్రానికి రాసిన ఒక పాట విషయంలో ప్రఖ్యాత నవలా రచయిత యండమూరి వీరేంద్రనాధ్ చేసిన కామెంట్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ ని చంద్రబోస్ ఇచ్చారు.

ఆయన ఒక మీడియా చానల్ తో మాట్లాడుతూ తాను సూటిగా యండమూరికే జవాబు చెబుతున్నాను అంటూ గట్టిగా మాట్లాడారు. ఊరకే ఏమీ అవగాహన లేకుండా పాటలు రాస్తారు అనుకుంటే అంతకంటే తిమిరం మరోకటి లేదని అన్నారు. తనకు తిమిరానికి కూడా అర్థం తెలియదని మరో సాటి రచయిత అనుకోవడం కంటే తిమిరం లేదని గట్టిగానే బదులిచ్చారు.

తాను వాల్తేరు వీరయ్యలో హీరో లక్షణాలను ఉద్దేశిస్తూ రాసిన పాట అంత విరోధాభాస అలంకారంలో సాగుతుందని ఆయన చెప్పుకొచ్చారు. పక్కన పక్కనే ఉన్న రెండు పదాలకు విరోధం ఉంటుందని, రెండింటికీ పొసగదు అని కానీ ఆ రెండు పదాల అంతరార్ధం లోతుగా చూస్తేనే పద విన్యాసం అర్ధం అవుతుందని చంద్రబోస్ చెప్పుకొచ్చారు.

తాను రాసిన పాటలో తుపాను అంచున తపస్సు చేసుకునే ప్రశాంతుడు వశిష్టుడు అని ఉంటుందని, బ్రహ్మ మానస పుత్రుడు వశిష్టుడికి సాటి ఎవరూ లేరని, అలాంటి ఆయన అలజడులు ఎన్ని రేగినా ప్రశాంతతో ఉండడమే గొప్పతనం, అదే తత్వం అని రాశాను అన్నారు. యముడు ఎక్కడైనా కవిత్వం రాస్తారా అని ఎవరైనా సెటైర్లు వేయవచ్చు కానీ అది కూడా విరోధాభాసమే అని ఆయన అన్నారు.

యముడు కళాత్మకంగా చంపుతున్నాడు అన్న అర్ధం వచ్చేలా తాను పాటలో హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ రాయడం జరిగింది అని చంద్రబోస్ అన్నారు. ఇక మరో మృత్యు జననం అన్ని రెండు విరోధ పదాలను ఒక చోట పెట్టానని, అది కూడా అద్భుతమైన పద విన్యాసమని ఆయన చెప్పారు. మొత్తం పాట అంతా విరోధాభాస అలంకారంలో సాగుతుందని, తాను ఆ అలంకారాన్ని పూర్తిగా చదివి ఉన్న వాడినని, అందుకే తాను గట్టిగా తన పాటలో ఏదీ తప్పు లేదని చెప్పగలను అని చంద్రబోస్ అన్నారు.

మరో వైపు చూస్తే తిమిర నేత్రుడై ఆవరించిన త్రినేత్రుడు అని రాయడం వెనక అవతల శతృవుకి చీకటి చూపించి అంతా శూన్యంగా చేసి తాను మాత్రం త్రినేత్రుడి మాదిరిగా యుద్ధం చేసే ధీరోధాత్తుడుగా రాశాను అని ఆయన వివరించారు. తనకు అన్ని విధాలుగా అర్ధాలు తెలుసు సంప్రదాయ కవిత్ర తీరులు తెలుసు అని ఆయన చెప్పుకున్నారు.

తన పాటను విమర్శించే వారు లోతైన అసలు అర్ధాలను చూడాలని ఆయన అన్నారు. ఇక తిమిరం అన్న అర్ధం కూడా తెలియనంతగా తాను లేను అంటూ ఆయన యండమూరికి చురకలు అంటించారు. మొత్తానికి తన పాటకు అంతటా ప్రశంసలు లభిస్తున్నాయని, ఇది తాను నచ్చి మెచ్చి కష్టపడి రాసిన పాటగా ఆయన చెప్పుకున్నారు. మరి దీని మీద యండమూరి ఏమంటారో.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Full View

Tags:    

Similar News