ట్రిపుల్ ఆర్ వివాదంలో వైసీపీ ? బ్లాక్ టికెట్ల దందాలో చోటా మోటాలు !

Update: 2022-03-28 02:47 GMT
ఆంధ్రాలో విచిత్రమ‌యిన స్థితి ఉంది. ట్రిపుల్ ఆర్ విడుద‌ల‌య్యాక బ్లాక్ మార్కెట్ దందా విప‌రీతంగా న‌డుస్తుంటే పాపం విప‌క్ష పార్టీ మాట్లాడ‌లేక‌పోతోంది.ఆ విధంగా టీడీపీ సైలెంట్ అయిపోగా, వైసీపీ మాత్రం ఇదే అదునుగా త‌న ప‌ని తాను చేసుకుపోతోంది అన్న ఆరోప‌ణ‌ల‌ను ఎందుక‌నో ఖండించ‌లేక‌పోతోంది. పోనీ వామ‌ప‌క్షాల‌యినా మాట్లాడుతున్నాయా అంటే అదీ లేదు.

దీంతో అభిమాన సంఘాల పేరిట టీడీపీ త‌న‌దైన హ‌వా న‌డుపుతూ వైసీపీకి స‌హ‌క‌రిస్తోంది. అదేవిధంగా బ్లాక్ మార్కెట్లో రెండు పార్టీల చోటామోటాలూ రెచ్చిపోయి రంకెలేస్తూ అందినంత దోచుకుంటూ పండ‌గ చేసుకుంటున్నారు. మ‌రోవైపు అప్పుడే సినిమాకు పైర‌సీ బెడ‌ద కూడా మొద‌ల‌యిపోయింది.

వారాంతంలో సినిమా వ‌సూళ్లు టాక్ తో సంబంధం లేక‌పోయినా బాగుండ‌డం మంచిదే కానీ ఇవి కౌంట‌ర్ కు చేరుతాయా అన్న‌దే పెద్ద సందేహం. ఎందుకంటే బ్లాక్ మార్కెట్లో పైస‌లను పంచుకుంటున్న‌ది ఆ  రెండు పార్టీలే ! కావ‌డం గ‌మ‌నార్హం అని జ‌న‌సేన ఆరోపిస్తోంది.

ఇటీవ‌ల విడుద‌ల‌యి విజ‌య దుందుభి మోగిస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమా మ‌రో వివాదంలో ఇరుక్కుంది. ఈ సినిమాకు సంబంధించి అన్ని చోట్లా బ్లాక్ టిక్కెట్ల దందా నడుస్తోంది. ఈ దందాకు వైసీపీ నాయ‌కుల సాయం ఎంత‌గానో  ఉంది అన్న ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. చాలా చోట్ల రెవెన్యూ అధికారుల త‌నిఖీలు లేవు.

పోలీసు అధికారుల నిఘా లేదు. థియేట‌ర్ల ప్రాంగణాల్లో అస్స‌లు సీసీ కెమెరాల మానిట‌రింగ్ ఉందో లేదో కూడా అర్థం కావ‌డం లేదు. దీంతో గ‌డిచిన మూడు రోజులుగా వైసీపీ చోటామోటాల  ద‌గ్గ‌రే  టిక్కెట్లు అన్నీ ఉండిపోయి త‌రువాత అమ్ముడు పోయాయి. కౌంట‌ర్ సేల్స్ అన్న‌వి అస్స‌లు లేవు. బ్లాక్ మార్కెట్ దందాకు టీడీపీ కూడా ప‌రోక్షంగా స‌హ‌క‌రిస్తుంది అన్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

అభిమాన సంఘాలు కొన్ని టీడీపీ త‌ర‌ఫున ఉండ‌గా, థియేట‌ర్లన్న‌వి వైసీపీ నాయ‌కుల సార‌థ్యంలో ఉన్నాయి.దీంతో ప‌ర‌స్ప‌ర అంగీకారంతో రెండు పార్టీలూ హాయిగా డ‌బ్బులు పంచుకుంటున్నాయి అన్న బ‌లమైన వాద‌న ఒక‌టి జ‌న‌సేన కూడా వినిపిస్తోంది. త‌మ నాయ‌కుడి సినిమా భీమ్లా నాయ‌క్ విడుద‌ల  స‌మ‌యంలో ఇదే అధికారులు కౌంట‌ర్ల ద‌గ్గర రోజంతా నిల‌బ‌డి మ‌రీ! టికెట్ అమ్మ‌కాలు సాగించార‌ని కానీ ఇప్పుడు అదే అధికారులు మొద్దు నిద్ర న‌టిస్తున్నార‌ని పేర్కొంటూ జ‌న‌సేన అభిమానులు మండిప‌డుతున్నారు.

శ్రీ‌కాకుళం జిల్లాలో తొమ్మిది థియేట‌ర్ల‌లో సినిమా నడుస్తోంది. ప‌ట్ట‌ణ వ్యాప్తంగా బ్లాక్ మార్కెట్ హాయిగా న‌డుస్తోంది. ఆన్లైన్ టికెట్ బుకింగ్ అన్న‌ది లేనే లేదు. చూపించినా కూడా కొన్ని సీట్ల‌కే ప‌రిమితం చేసి త‌రువాత క్లోజ్ చేస్తున్నారు.అవి కూడా నిమిషాల్లోనే
క్లోజ్ అయిపోతున్నాయి.  

దీంతో చేసేది లేక ఐదు వంద‌ల నుంచి ఐదు వేల రూపాయ‌ల వ‌ర‌కూ సినిమా టికెట్ ను కొనుగోలు చేసేందుకు సిద్ధ‌ప‌డుతూ జేబుల‌కు చిల్లులు పెట్టుకుంటున్నారు. ఎక్క‌డా పోలీసు అధికారుల త‌నిఖీలు అన్న‌వి లేవు. ఎక్క‌డా రెవెన్యూ అధికారుల త‌నిఖీలు లేవు. కేవ‌లం కుమ్ములాట‌లు, తొక్కిస‌లాటలు జ‌ర‌గ‌కుండా ఉండేందుకు సినిమా విడుద‌లైన రోజు అంటే మార్చి 26 (శుక్ర‌వారం)న మాత్రం పోలీసులు సందడి చేసి, త‌రువాత వెళ్లిపోయారు.
Tags:    

Similar News