ఔను.. వెంకీకి టైమ్‌ ఇచ్చిన ధనుష్‌

Update: 2021-07-04 10:30 GMT
తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ భాషల హద్దులను చెరిపివేసే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఆయన హిందీ మరియు ఇంగ్లీష్‌ సినిమాల్లో నటించాడు. ధనుష్‌ సినిమా ఒకటి స్పానిష్‌ ల్యాంగేజ్‌ లో కూడా విడుదల అయ్యిందంటూ ఆమద్య తమిళ మీడియా కథనాలు రాసింది. హాలీవుడ్ రేంజ్‌ సినిమాలు చేస్తున్న ధనుష్‌ ప్రస్తుతం టాలీవుడ్ పై దృష్టి పెట్టినట్లుగా ఉన్నాడు. ధనుష్ నటించిన పలు సినిమాలు తెలుగులో డబ్బింగ్‌ అయ్యాయి. కాని తెలుగులో ఒక్క సినిమా అయినా కమర్షియల్ గా సూపర్‌ హిట్‌ అవ్వలేదు. రఘువరన్‌ బిటెక్ కాస్త పర్వాలేదు అనిపించినా ఇతర సినిమాల్లో ఏ ఒక్కటి కూడా ఆకట్టుకోలేదు. తెలుగు ప్రేక్షకులు ధనుష్‌ ను లైట్ తీసుకుంటున్నారు. దాంతో తెలుగు మార్కెట్ కోసం ఆయన ఏకంగా తెలుగు సినిమాలనే చేయాలనే నిర్ణయానికి వచ్చాడు.

ఇప్పటికే శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా ఖరారు అయ్యింది. ఆ సినిమా అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. తెలుగు సినిమాలు ముందు ముందు మరిన్ని చేయాలని ధనుష్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ధనుష్‌ సినిమాలకు ఎక్కువ సమయం తీసుకోడు. మూడు నాలుగు నెలల్లోనే పూర్తి చేయాల్సిందిగా దర్శకులకు చెబుతూ ఉంటాడు. అందుకే తమిళంలో రెండు మూడు కమిట్‌ అయ్యి ఉన్నా తెలుగు లో శేఖర్‌ కమ్ముల ప్రాజెక్ట్‌ కన్ఫర్మ్‌ అయినా కూడా మరో తెలుగు సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్‌ గానే ఈ తమిళ హీరో ఉన్నాడని మీడియా సర్కిల్స్ ద్వారా తెలుస్తోంది. ధనుష్‌ హైదరాబాద్ కు షూటింగ్‌ కు వస్తున్న సమయంలో శేఖర్‌ కమ్ముల సినిమా కథా చర్చల్లో పాల్గొనడంతో పాటు వెంకీ అట్లూరి కథను వినేందుకు కూడా ఓకే చెప్పాడంటూ వార్తలు వచ్చాయి.

అన్నట్లుగానే వెంకీ అట్లూరి కథను వినేందుకు ధనుష్‌ టైమ్ ఇచ్చాడట. ఇప్పటి వరకు లవ్‌ స్టోరీలను తెరకెక్కించిన వెంకీ అట్లూరి ఈసారి చాలా విభిన్నమైన కాన్సెప్ట్‌ తో ధనుష్‌ ఇమేజ్ కు తగ్గట్లుగా అన్ని భాషల వారికి కనెక్ట్‌ అయ్యే యూనిక్‌ సబ్జెక్ట్‌ ను వెంకీ అట్లూరి చెప్పాడట. ధనుష్ కు ఆ పాయింట్ నచ్చడంతో స్క్రిప్ట్‌ డెవలప్‌ చేస్తే తప్పకుండా చేద్దామని హామీ ఇచ్చాడని టాక్ వినిపిస్తుంది. కాని ఇప్పటి వరకు మాత్రం అధికారికంగా ఎలాంటి క్లారిటీ రాలేదు. వెంకీ అట్లూరి ఈ ఏడాది రంగ్ దే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా పర్వాలేదు అన్నట్లుగా టాక్ దక్కించుకుంది. అంతకు ముందు సినిమాలు నిరాశ పర్చినా కూడా వెంకీ అట్లూరికి ఈ అద్బుత అవకాశం దక్కింది అంటే ఆయన చెప్పిన స్క్రిప్ట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్‌ గురించిన అధికారిక క్లారిటీ రావడానికి కాస్త సమయం పట్టవచ్చు అంటున్నారు.
Tags:    

Similar News