వైఎస్ సినిమా.. ధనాధన్ ఫటాఫట్

Update: 2018-06-20 10:16 GMT
టాలీవుడ్‌ కు ఉన్నట్లుండి బయోపిక్ ఫీవర్ పట్టుకుంది. ‘మహానటి’ మహా విజయంతో ఈ జానర్ సినిమాలపై ప్రేక్షకుల్లోనూ ఆసక్తి పెరిగింది. తెలుగు రాజకీయాలపై తమదైన ముద్ర వేసిన ఎన్టీఆర్.. వైఎస్సార్ జీవిత కథలతో సినిమాలకు సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. వీటిలో ముందుగా వైఎస్సార్ జీవితంలోని ముఖ్య ఘట్టాల ఆధారంగా తెరకెక్కబోయే ‘యాత్ర’ సెట్స్ మీదికి వెళ్లోబోతోంది. దాదాపు ఏడాది నుంచి ప్రి ప్రొడక్షన్ పనుల్లో ఉన్న దర్శకుడు మహి వి.రాఘవ్.. ఎట్టకేలకు అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసి షూటింగుకి రెడీ అయ్యాడు. బుధవారమే ఈ చిత్ర రెగ్యులర్ షూింగ్ ఆరంభమైంది.

వైఎస్సార్ పాత్రలో మలయాళ లెజెండరీ యాక్టర్ మమ్ముట్టి నటించబోయే ఈ సినిమాలో వివిధ పాత్రలకు తగ్గ నటీనటుల్నే ఎంచుకున్నాడ రాఘవ్. పక్కాగా స్క్రిప్టు రెడీ చేసి స్టోరీ బోర్డ్ కూడా వేసుకున్న మహి.. సినిమా విషయంలో పూర్తి స్పష్టతతో ఉన్నాడట. నిర్మాతలు కూడా షూటింగుకి పక్కాగా ఏర్పాట్లు చేశారు. ఒకే ఒక షెడ్యూల్లో సినిమాను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సెప్టెంబరు వరకు నిర్విరామంగా షూటింగ్ చేస్తారట.

మమ్ముట్టి కూడా మరే సినిమా వైపు చూడకుండా మూడు నెలల పాటు ఈ సినిమాకే అంకితం కాబోతున్నారట. వైఎస్ రాజకీయ ప్రస్థానంలో అత్యంత కీలక ఘట్టం అయిన పాదయాత్రను ప్రధానంగా సినిమాలో ఎలివేట్ చేయనున్నారు. 2003 వేసవిలో మండుటెండల్ని లెక్క చేయకుండా నిర్విరామంగా 1500 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు వైఎస్. అదే తరహా వేగాన్ని సినిమాలోనూ చూపించబోతున్నారట. ఒక యజ్ఞం లాగా సినిమాను పూర్తి చేయనున్నారట. వచ్చే ఏడాది ఎన్నికలకు కొన్ని నెలల ముంగిట ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేనున్నారు.
Tags:    

Similar News