ప్రేక్షకులు అభిమానం అందుకున్న అష్టదిగ్బంధనం: దర్శకుడు బాబా పి.ఆర్

ఎం.కె.ఎ.కె.ఎ ఫిలిం ప్రొడక్షన్‌ సమర్పణలో బాబా పి.ఆర్‌. దర్శకత్వంలో మనోజ్‌కుమార్‌ అగర్వాల్‌ నిర్మించిన చిత్రం 'అష్టదిగ్బంధనం'

Update: 2023-09-27 04:32 GMT

ఎం.కె.ఎ.కె.ఎ ఫిలిం ప్రొడక్షన్‌ సమర్పణలో బాబా పి.ఆర్‌. దర్శకత్వంలో మనోజ్‌కుమార్‌ అగర్వాల్‌ నిర్మించిన చిత్రం ‘అష్టదిగ్బంధనం’. సూర్య, విషిక జంటగా నటించిన ఈ చిత్రం ఈనెల 22న తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 150కి పైగా థియేటర్స్‌లో విడుదలై మంచి టాక్‌తో విజయవంతంగా ప్రదర్శితమౌతోంది. ఈ సందర్భంగా సోమవారం చిత్ర యూనిట్‌ హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో సక్సెస్‌మీట్‌ నిర్వహించింది. ఈ వేదికపై చిత్ర నటీనటులు, టెక్నీషియన్స్‌కు నిర్మాత మనోజ్‌కుమార్‌ అగర్వాల్‌, సురేష్‌ కొండేటిల చేతుల మీదుగా జ్ఞాపికలను బహూకరించారు.

నిర్మాత మనోజ్‌కుమార్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ...

ఈనెల 22న విడుదలైన మా ‘అష్టదిగ్బంధనం’ అన్ని సెంటర్స్‌లోనూ మంచి కలెక్షన్స్‌ రాబడుతోంది. ప్రేక్షకులు తమ అభిమానంతో మమ్మల్ని అష్టదిగ్బంధనం చేస్తున్నారు. దర్శకుడు బాబా పి.ఆర్‌.గారు కథను నేరేట్‌ చేసిన విధానంతోనే నాకు సినిమా ఖచ్చితంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది అనే నమ్మకం కలిగింది. తాను చెప్పినదానికన్నా ఎంతో బాగా తెరకెక్కించడంతో ఈ సక్సెస్‌కు కారణమైంది. సురేష్‌ కొండేటి గారు ప్రమోషన్‌ బాధ్యతలు తీసుకున్న తర్వాతే మా సినిమాకు మంచి బజ్‌ వచ్చింది. అలాగే గీతాఆర్ట్స్‌ వారు మా సినిమాను విడుదల చేయడం ఇంత పెద్ద ఎత్తున మాకు థియేటర్స్‌ దొరకడం ఆయన సహకారం వల్లనే సాధ్యం అయ్యింది. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే మా చిత్రం కోసం ప్రాణంపెట్టి పనిచేసిన యూనిట్‌కు అంకితం చేస్తున్నా అన్నారు.

దర్శకుడు బాబా పి.ఆర్‌. మాట్లాడుతూ...

ముందు నుంచీ మా సినిమా విజయంపట్ల నాకు నమ్మకం ఉంది. ఈ రోజు మా నమ్మకం నిజమైనందుకు సంతోషంగా ఉంది. మా సినిమాకు కోట్ల రూపాయల కలెక్షన్‌లు వస్తున్నందుకు కాదు.. అటు ప్రేక్షకుల నుంచి, ఇటు చిత్ర పరిశ్రమ నుంచి వస్తున్న అభినందనలను సెలబ్రేట్‌ చేసుకోవాలనే ఈ సక్సెస్‌ మీట్‌ను నిర్వహిస్తున్నాం. ఈ సక్సెస్‌ యూనిట్‌లోని ప్రతి ఒక్కరిదీ. ప్రతి ఆర్టిస్ట్‌, టెక్నీషియన్‌ తమ స్వంత చిత్రంగా భావించి పనిచేశారు. మంచి కథ, కథనం, సంగీతం, ఛాయాగ్రహణం, సూటబుల్‌ ఆర్టిస్ట్‌లు సెట్‌ అవ్వడం నా అదృష్టం. అలాగే మా నిర్మాత మనోజ్‌కుమార్‌ గారు కూడా ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. ప్రతి విషయంలోనూ మమ్మల్ని గో ఎహెడ్‌ అంటూ ప్రోత్సహించారు. ఇందుకు ఆయనకు నా కృతజ్ఞతలు. వీటితోపాటు తన పి.ఆర్‌ స్కిల్‌తో చిన్న సినిమాను పెద్ద విజయం వైపు నడిపించారు సురేష్‌ కొండేటి. మా సినిమా వరకూ ఆయన మాకో దిల్‌రాజు, సురేష్‌బాబు. మా సినిమా ప్రమోషన్‌ విషయంలో సురేష్‌ కొండేటి గారే సెంటర్‌ పాయింట్‌. ఈ వేదిక మీద షీల్డ్‌ అందుకున్న దాదాపు అందరూ 20`30 సంవత్సరాలుగా పరిశ్రమలో ఉన్నప్పటికీ ఇదే తమ తొలి షీల్డ్‌ అని చెప్పడం చూస్తేనే అర్ధం అవుతుంది ఈ విజయం ఎంత మంది జీవితాశయాలను నెరవేర్చిందో అన్నారు.

‘సంతోషం’ అధినేత సురేష్‌ కొండేటి మాట్లాడుతూ...

దర్శకుడు బాబా పి.ఆర్ మంచి హార్డ్‌ వర్కర్‌. ఈ సినిమా ప్రమోషన్‌ విషయంలో ముందు నన్ను అప్రోచ్‌ అయినప్పుడు ఇదో చిన్న సినిమా. పైగా పెద్ద ఆర్టిస్ట్‌లు కూడా ఎవరూ లేరు. అనవసరంగా వీళ్ల డబ్బు ఎందుకు ఖర్చు చేయించడం అని నేను అవాయిడ్‌ చేస్తూ వచ్చాను. కానీ బాబా పి.ఆర్ గారు నా వెంటపడుతూనే ఉన్నారు. ఓ రోజు అప్పటి వరకూ తీసిన సినిమా చూపించారు. అప్పుడు అర్ధమైంది సినిమాలో మంచి విషయం ఉందని. అప్పుడు ఈ సినిమా ప్రమోషన్‌ బాధ్యతలు తీసుకోవటానికి అంగీకరించాను. నిర్మాత మనోజ్‌గారు కూడా మంచి కంటెంట్‌ ఉన్న సినిమా ఖచ్చితంగా ఆడుతుంది. మీరు ప్రమోషన్‌ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ కావద్దు అని చెప్పారు. వారి నమ్మకం ఈరోజు సినిమా సక్సెస్‌గా రన్‌ అవుతుండడంతో రుజువైంది. మంచి గ్రిప్పింగ్‌ స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను సీట్లకు అతుక్కుపోయేలా చేస్తోంది. దాదాపు అందరూ కొత్తవారైనా కథలో ఉన్న బలంతో చెలరేగిపోయి నటించారని చెప్పాలి. పి.ఆర్‌.ఓ.గా మరో విజయవంతమైన సినిమాలో నేనూ భాగస్వామి అయినందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు.

హీరో సూర్య మాట్లాడుతూ...

ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ రోజునే నేను చెప్పాను ఖచ్చితంగా సక్సెస్‌ కొట్టి తీరతాం అని. అది ఈరోజు ఈ సక్సెస్‌మీట్‌ రూపంలో మనకు కనపడుతోంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు బాబా పి.ఆర్ గారికి, నిర్మాత మనోజ్‌కుమార్‌ గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. చిన్న సినిమాలు విజయవంతం అయితే ఎంతో మంది ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్‌కు లైఫ్‌ వస్తుంది. అందుకే ప్రేక్షకుల్ని కోరుకునేది ఒక్కటే మా ‘అష్టదిగ్బంధనం’ సినిమాను థియేటర్‌కు వెళ్లి చూడండి.. మమ్మల్ని ఆశీర్వదించండి అన్నారు.

హీరోయిన్‌ విషిక మాట్లాడుతూ...

నేను కూడా తొలిసారిగా షీల్డ్‌ అందుకున్న వేదిక ఇది. ఈ విజయం దర్శక, నిర్మాతలదే. వారు సినిమా కోసం పడిన తపన, కష్టం ఇలా సక్సెస్‌ రూపంగా మన ముందుకు వచ్చింది. ఇలాంటి ఒక హిట్‌ చిత్రం నా ఖాతాలో పడటానికి కారణమైన దర్శక, నిర్మాతలకు, తోటి ఆర్టిస్ట్స్‌, టెక్నీషియన్స్‌కు నా కృతజ్ఞతలు అన్నారు. ఈ సందర్భంగా జ్ఞాపికలు అందుకున్న చిత్రానికి సంబంధించిన ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్‌ తమకు సక్సెస్‌ ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ చిత్రానికి డీఓపీ: బాబు కొల్లాబత్తుల, ఎడిటర్‌: సత్య గిడుతూరి, ఫైట్స్‌: రామ్‌కృష్ణ, బాబా పి.ఆర్‌, శంకర్‌ ఉయ్యాల, లిరిక్స్‌ : పూర్ణాచారి, బాబా పి.ఆర్‌., ఆర్ట్‌ డైరెక్షన్‌ : వెంకట్‌ ఆరె, డాన్స్‌: అనీష్‌, మోయిన్‌, సంగీతం: జాక్సన్‌ విజయన్‌, నిర్మాత:మనోజ్‌కుమార్‌ అగర్వాల్‌, రచన, దర్శకత్వం: బాబా పి.ఆర్‌.

Tags:    

Similar News