టైసన్ నాయుడు.. బెల్లంకొండ మరో యాక్షన్ డోస్
ఈ సినిమాలో డీఎస్పీగా బెల్లంకొండ శ్రీనివాస్ కనిపించనున్నారు. గ్లింప్స్ లో డీఎస్పీ ట్రైనింగ్ పీరియడ్ ను చూపించారు.
టాలీవుడ్ లో యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన హీరో బెల్లంకొండ శ్రీనివాస్. అప్పుడెప్పుడో రాక్షసుడు మూవీతో హిట్ కొట్టిన ఆయన.. గట్టి కమ్ బ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నారు. రకరకాల చిత్రాలు, జానర్లలో సినిమాలు చేస్తున్న హిట్ సాధించలేకపోతున్నారు. బాలీవుడ్ లో ఛత్రపతి రీమేక్ చేసి టైమ్ వేస్ట్ చేసుకున్నారు. ఇప్పుడు సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా ఈ మూవీకి సంబంధించి కీలకమైన షూటింగ్ షెడ్యూల్ పూర్తయిందని తెలియజేశారు మేకర్స్. నేడు(జనవరి 3) బెల్లంకొండ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా BSS 10గా తెరకెక్కుతున్న ఈ మూవీకి సంబంధించి సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీని టైటిల్ ను టైసన్ నాయుడిగా ప్రకటించారు. దీంతోపాటు సినిమా గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు. చివరలో బెల్లంకొండకు బర్త్ డే విషెస్ చెప్పారు.
''సార్... బాగా బలిసిన దున్నపోతు రంకెలు వేస్తూ మీ ముందుకు వచ్చింది. మీరు గాల్లో ఎగురుతూ ఒక బ్లైండ్ క్లిక్ ఇచ్చారు. అప్పుడు ఏం జరుగుతుంది?'' అని ఒకరు ప్రశ్నిస్తే... ''దున్నపోతు చచ్చిపోతుంది'' అని ట్రైనింగ్ ఇస్తున్న వ్యక్తి సమాధానం చెబుతారు. ఆ డైలాగ్ తోనే గ్లింప్స్ స్టార్ట్ అయింది. పంజాబ్, సిక్కుల నేపథ్యంలో సినిమాలో సన్నివేశాలు ఉన్నాయని గ్లింప్స్ చూస్తే అర్థం అవుతోంది.
ఈ సినిమాలో డీఎస్పీగా బెల్లంకొండ శ్రీనివాస్ కనిపించనున్నారు. గ్లింప్స్ లో డీఎస్పీ ట్రైనింగ్ పీరియడ్ ను చూపించారు. పెద్ద గన్ ను అటు తిప్పి ఇటు తిప్పి.. మాస్ యాక్షన్ తో శ్రీనివాస్ అదరగొట్టేశారు. ఫైట్స్ తో దుమ్మురేపారు. ట్రైనర్ తో ఫైట్ అయితే వేరే లెవల్ లో ఉంది. గ్లింప్స్ లో ఈ సినిమా స్టోరీ లైన్ క్లియర్ గా చెప్పకపోయినా ఆకట్టుకుంటోంది.
సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. హీరోగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 10వ చిత్రమిది. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. విజయ్, వెంకట్, రియల్ సతీశ్ మాస్టర్లు యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ ఏడాదే సినిమా విడుదల కానుంది.
టైసన్ నాయుడుతోపాటు బెల్లంకొండ శ్రీనివాస్.. దర్శకుడు మున్నాతో మరో సినిమా చేస్తూన్నారు. సోషియో ఫాంటసీ జోనర్ లో రూపొందుతున్న ఆ సినిమాకు దేవుడే దిగి వచ్చినా టైటిల్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ చిత్రాలైనా బెల్లంకొండకు హిట్లు ఇస్తాయోమో చూడాలి.