పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తలనొప్పులకు బిగ్ రిలీఫ్
దేశ వ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో పలువురు ప్రముఖులు 'ఆదిపురుష్' బృందంపై కేసులు వేశారు. అభిమానులు, ప్రేక్షకుల్లో చాలా మంది ఈ సినిమాపై విమర్శలు గుప్పించారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సినిమాల్లో ఊహించని విధంగా వివాదాలని ఎదుర్కొన్న సినిమా 'ఆదిపురుష్'. రామయణ ఇతిహాసం ఆధారంగా ప్రభాస్‌ని తొలిసారి రాఘవుడిగా చూపిస్తూ గ్రాఫిక్స్ ప్రధానంగా రూపొందించిన ఈ మూవీ రిలీజ్‌కు ముందే అత్యంత వివాదాస్పద చిత్రంగా నిలిచి టాక్ ఆఫ్ ది ఇండియాగా మారింది. ప్రభాస్ ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ దగ్గరి నుంచి ప్రభాస్ లుక్, గ్రాఫిక్స్..రామాయణాన్ని చూపించిన తీరుపై అనేక కేసులు నమోదయ్యాయి.
దేశ వ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో పలువురు ప్రముఖులు 'ఆదిపురుష్' బృందంపై కేసులు వేశారు. అభిమానులు, ప్రేక్షకుల్లో చాలా మంది ఈ సినిమాపై విమర్శలు గుప్పించారు. హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో రామాయణ గాథకు గ్రాఫిక్స్ హంగుల్ని జోడించి శ్రీరాముడిని కాస్తా సూపర్ హీరోగా చూపించే ప్రయత్నం చూశాడు దర్శకుడు ఓం రౌత్. అదే వికటించి అనర్థాలకు దారి తీసింది. జపాన్‌కు చెందిన ఓ కార్టూన్ సినిమా ఆధారంగా చేసుకుని 'ఆదిపురుష్'ని తెరకెక్కించారు. ఇదే ప్రధాన సమస్యగా మారి విమర్శలు వెల్లువెత్తేలా చేసింది.
దీంతో రామాయణ ఇతిహాసన్ని వక్రీకరించి హిందువుల మనోభావాలని కించపరిచారని, అలాగే డైలాగ్ రైటర్ హను మాన్ పాత్రకు కమర్షియల్ సినిమాల స్థాయిలో మాస్ డైలాగ్‌లు రాశారని, రాఘవుడిగా ప్రభాస్‌ని, రావణుడిగా సైఫ్ అలీఖాన్‌ని, హను మంతుడి పాత్రని కూడా పురాణాలకు భిన్నంగా చూపించారని, దీంతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, చరిత్ర కారులు 'ఆదిపురుష్' టీమ్‌పై మండిపడ్డారు. రామాయణం సీరియల్‌లో నటించిన శ్రీరాముడు, లక్షణుడు పాత్ర ధారులు, హనుమాన్ పాత్రకు పెట్టింది పేరుగా నిలిచిన ధారాసింగ్ తనయుడు టీమ్‌పై సంచనల ఆరోపణలు చేయడం, 'శక్తిమాన్' ఫేమ్ కూడా 'ఆదిపురుష్' టీమ్‌పై మండిపడటంతో విషయం కాస్తా సీరియస్ టర్న్ తీసుకుంది.
దేశ వ్యాప్తంగా 'ఆదిపురుష్'పై చర్చ మొదలైంది. సినిమా విడుదలై నెలలు దాడుతున్నా చిత్ర బృందంపై పలు రాష్ట్రాల్లోని కోర్టుల్లో కేసులు కొనసాగుతుండటంతో టీమ్ ఆందోళనకు గురవుతోంది. అయితే తాజాగా ఈ కేసుల నుంచి 'ఆదిపురుష్' టీమ్‌కు బిగ్ రిలీఫ్ లభించింది. వివిధ రాష్ట్రాల్లో ఈ సినిమా టీమ్‌పై నమోదైన కేసుల్ని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కొట్టి వేస్తూ తాజా తీర్పునిచ్చింది. ఒక్కసారి సెన్నార్ పూర్తయ్యాక ఇక ఏ విషయంలోనూ విచారణ అవసరం లేదు. వీటికి ఇప్పటికైనా ముగింపు పలకండి' అంటూ పేర్కొంది. దీంతో 'ఆదిపురుష్' టీమ్ ఊపరిపీల్చుకుంది.