నాగవంశీపై 'పఠాన్', 'కాబిల్' & 'స్కామ్ 1992' డైరెక్టర్స్ ఫైర్..!
'పఠాన్' డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్, 'స్కామ్ 1992' దర్శకుడు హన్సల్ మెహతా, 'కాబిల్' మేకర్ సంజయ్ గుప్తా వంటి పలువురు వంశీ తీరుని తప్పుబడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
''పుష్ప-2 సినిమా హిందీలో ఒక రోజులో ₹86 కోట్లు వసూలు చేసినప్పుడు ముంబైకి నిద్ర పట్టి ఉండదు" అంటూ టాలీవుడ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ చేసిన కామెంట్స్ పై బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ఫైర్ అవుతున్నారు. బోనీ కపూర్ లాంటి ప్రముఖ నిర్మాత పక్కన కూర్చుని అలా మాట్లాడటం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'పఠాన్' డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్, 'స్కామ్ 1992' దర్శకుడు హన్సల్ మెహతా, 'కాబిల్' మేకర్ సంజయ్ గుప్తా వంటి పలువురు వంశీ తీరుని తప్పుబడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
బాలీవుడ్ దర్శక నిర్మాత సంజయ్ గుప్తా ఎక్స్ లో నాగవంశీ మాట్లాడిన వీడియోను షేర్ చేస్తూ.. "బోనీ కపూర్ లాంటి సీనియర్ నిర్మాత పక్కన కూర్చొని తన ఫేక్ వానిటీతో ఆయన్ని ఎగతాళి చేస్తున్న ఈ వ్యక్తి ఎవరు? అతని బాడీ లాంగ్వేజ్, అసహ్యకరమైన యాటిట్యూడ్ చూడండి. నాలుగు లేదా ఐదు హిట్స్ ఇచ్చినంత మాత్రాన అతడు బాలీవుడ్‌కు బాప్ కాలేడు. అల్లు అరవింద్ సర్ లేదా సురేష్ బాబు సర్ వంటి సీనియర్ నిర్మాతల ముందు కూర్చుని వారి ముఖంలోకి వేళ్లు చూపిస్తూ ఈ విధంగా మాట్లాడే దమ్ము ఆయనకు ఉందా?. సక్సెస్ కి ముందు రెస్పెక్ట్ కు విలువ ఇవ్వడం నేర్చుకోండి" అని పేర్కొన్నారు.
అలానే సంజయ్ గుప్తా మరో పోస్ట్ పెడుతూ.. "గ్రేట్ దక్షిణాది చిత్ర నిర్మాతలతో కలిసి పనిచేయడం వల్ల మేము నేర్చుకున్న మొదటి విషయం వినయం, క్రమశిక్షణ. అహంకారాన్ని ప్రదర్శించడం మీరు వారి నుండి ఆశించే చివరి విషయం" అని అన్నారు. "మా ఎగ్జిబిటర్స్ ద్వారా రూ. 86 కోట్లు కలెక్ట్ చేసిందని తెలిసి చాలా ప్రశాంతంగా, సంతోషంగా నిద్రపోయాం. మీ విషయంలో అలా ఉంటుందేమో కానీ, ఇతరుల విజయం మాకు నిద్రలేని రాత్రులు ఇవ్వదు" అని రాసుకొచ్చారు. నాగ వంశీ మీద క్రియేట్ చేసిన ఓ మీమ్ ను కూడా రీపోస్ట్ చేశారు.
అక్కడితో ఆగని సంజయ్ గుప్తా "ప్రతి సంవత్సరం దాదాపు 300 తెలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. అంటే 2020లో 'బాహుబలి' విడుదలైనప్పటి నుంచి 2024 వరకూ 1500 చిత్రాలను విడుదల చేసారు. పదిహేను వందల చిత్రాల్లో బాహుబలి 1&2, RRR, పుష్ప, కల్కి, పుష్ప 2 వంటి 6 సినిమాలు ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. మీరు నిజంగా హిందీ ఆల్ ఇండియా బెల్ట్‌ను టేకోవర్ చేసుకున్నట్లయితే, మిగిలిన 1490కి పైగా చిత్రాలను కూడా ఎందుకు విడుదల చేయకూడదు. మీరు ఎక్కడ ఉన్నారో చూడండి?" అని ప్రశ్నించారు. హన్సల్ మెహతా సైతం నాగవంశీని తప్పుపట్టారు.
"చిల్ డ్యూడ్ మీరు ఎవరైనా సరే... నేను ముంబైలో నివసిస్తున్నాను. నాకు బాగా నిద్ర పట్టింది" అని హన్సల్ మెహతా ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఆ తర్వాత మరో ట్వీట్ చేస్తూ.. "ఈ వ్యక్తి మిస్టర్ నాగ వంశీ చాలా అహంకారంతో ఉన్నాడు. ఇప్పుడు అతను ఎవరో నాకు తెలుసు. నిర్మాతగా అతని లేటెస్ట్ హిట్ 'లక్కీ భాస్కర్' స్కామ్ సిరీస్ నుండి విస్తారంగా అరువు తెచ్చుకున్నాడు. నేను ఇది చెప్పడానికి కారణం ఏమిటంటే, కథలు ఒక భాష నుంచి మరొక భాషలోకి ప్రయాణించడం, మనకు వర్కవుట్ ఒక చిత్రం మరోచోట పునరావృతం చేయడంలో నేను సంతోషంగా ఉన్నాను. అందరూ గెలుస్తారు. ఎవరూ మరొకరి కంటే పెద్దవారు కాదు. ఆ కథనం విధ్వంసకరం. అహంకారం ఇంకా దారుణం. నా టైమ్ లైన్ లో నన్ను ద్వేషిస్తున్న వారందరికీ చెబుతున్నా.. 2025లో కలుద్దాం" అని 'స్కామ్ 1992' డైరెక్టర్ పేర్కొన్నారు.
హన్సల్ మెహతా పోస్టుకి పఠాన్, ఫైటర్ చిత్రాల దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ స్పందిస్తూ.. "ముంబై ఎప్పుడూ నిద్రపోని నగరం. ఇది ఓకే, కొంతమందికి మన రియల్ ముంబై తెలియదని నేను అనుకుంటున్నాను. మరొక విషయం ఏంటంటే నేను బాంద్రా, జుహు రెండింటిలో మాత్రమే నివసించాను. కేవలం మీ సమాచారం కోసం చెబుతున్నాను" అంటూ నాగవంశీ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సంజయ్ గుప్తా ఈ పోస్టులను రీట్వీట్ చేస్తూ వచ్చారు. అయితే టాలీవుడ్ ఆడియెన్స్ వీరికి స్ట్రాంగ్ గా రిప్లై ఇస్తున్నారు. ఎక్స్ లో ఫ్యాన్ వార్స్ చేసుకోకుండా, తెలుగు వాళ్ళకి ధీటుగా సినిమాలు తీయడం మీద దృష్టి పెట్టాలని సెటైర్లు వేస్తున్నారు. ఈ పోస్టులు చూస్తుంటే, నిజంగానే టాలీవుడ్ సక్సెస్ చూసి బాలీవుడ్ కు నిద్ర పట్టడం లేదని అర్థమవుతోందని కామెంట్లు పెడుతున్నారు.
ఇదిలా ఉంటే బోనీ కపూర్ తో నాగవంశీ మాట్లాడిన వీడియోపై వస్తోన్న వ్యతిరేకతపై నాగవంశీ సోషల్ మీడియాలో స్పందించారు. "పెద్దలను ఎలా గౌరవించాలో మీరు మాకు నేర్పాల్సిన అవసరం లేదు. మేము మీ కంటే ఎక్కువగా బోనీ కపూర్‌ను గౌరవిస్తాం. ఆయన్ని అగౌరవపరిచేలా నేను అలా మాట్లాడలేదు. ఇది ఆరోగ్యకరమైన చర్చ. మేమిద్దరం చక్కగా నవ్వుతూ మాట్లాడుకున్నాం. ఇంటర్వ్యూ తర్వాత పరస్పరం ఆలింగనం చేసుకున్నాం. కాబట్టి దయచేసి మీరు చూసిన వీడియోలలో ఒక నిర్ధారణలకు రాకండి" అని పేర్కొన్నారు.