యంగ్ హీరో మరణం వెనక మిస్టరీ తేలే రోజు
బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం వెనక సత్యాల్ని శోధించడంలో ఆలస్యాన్ని అభిమానులు జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది.
బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం వెనక సత్యాల్ని శోధించడంలో ఆలస్యాన్ని అభిమానులు జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. కోర్టుల పరిధిలో సంవత్సరాలుగా దీనిపై విచారణ కొనసాగుతోంది. అయితే ఈ కేసులో ఒక కీలక మలుపు సుశాంత్, అతడి మాజీ మేనేజర్ దిశా సాలియన్ మరణాలపై మరింత సమగ్ర దర్యాప్తు కోరుతూ బాంబే హైకోర్టు ఫిబ్రవరి 19న ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్)ను విచారించనుంది. దాదాపు ఐదేళ్లుగా పెండింగ్ లో ఉన్న ఈ వివాదానికి సంబంధించిన కేసులో శివసేన (యుబిటి) ఎమ్మెల్యే ఆదిత్య థాకరేను అరెస్టు చేసి ప్రశ్నించాలని పిటిషన్ లో ప్రత్యేకంగా డిమాండ్ చేసారు.
సుశాంత్ మరణం, అతడి మేనేజర్ దిశా సాలియన్ మరణం అనుమానాస్పదమని, నిజాల్ని కప్పిపుచ్చే అవకాశం ఉందని పిల్‌లో పేర్కొన్నారు. సుశాంత్ సింగ్ 14 జూన్ 2020న తన ముంబై నివాసంలో చనిపోగా, దిశా సాలియన్ 8 జూన్ 2020న ఒక ఎత్తైన భవనంపై నుండి పడిపోయి మరణించారని మీడియాలో కథనాలొచ్చాయి. ఈ కేసుల్లో ఆదిత్య థాకరే పేరు హైలైట్ అయింది. అతడిని విచారించాలని పిటిషనర్ వాదిస్తున్నారు. అయితే థాకరే ఈ వాదనలను పదేపదే తిరస్కరించారు. ఇవన్నీ రాజకీయ ఆరోపణలు మాత్రమేనని, నిరాధారమైనవని ఆయన అభివర్ణించారు.
సుశాంత్ బాంద్రాలోని తన నివాసంలో ఉరికి వేలాడుతూ మృతి చెందాక ఈ కేసులో రాజకీయ ప్రమేయం గురించి చర్చ సాగింది. ముంబైలోని కూపర్ హాస్పిటల్‌లో నిర్వహించిన పోస్ట్‌మార్టం పరీక్షలో సుశాంత్ మరణానికి కారణం ఊపిరాడకపోవడమేనని తేలింది. ఏళ్ల తరబడి కోర్టు విచారణ సాగినా.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై రకరకాల కుట్ర ఆరోపణలు, సిద్ధాంతాలు ఉన్నాయి. ఈ కేసును ముంబై పోలీసులతో పాటు, సీబీఐ, ఎన్‌సీబీ, ఈడీ సహా పలు ఏజెన్సీలు దర్యాప్తు చేయడం ఒక సంచలనం. దాదాపు ఐదేళ్లకు ఈ కేసును మరింత పరిశీలించాలని కోరుతూ సుప్రీంకోర్టు & హైకోర్టు లిటిగెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు రషీద్ ఖాన్ పఠాన్ దాఖలు చేసిన పిల్‌ను బాంబే హైకోర్టు విచారించనుంది.
సుశాంత్ సింగ్ ఆరంభం టెలివిజన్ పరిశ్రమలో పాపులర్. అతడు `పవిత్ర రిష్ట` సీరియల్‌తో నటుడిగా గొప్ప గుర్తింపు పొందాడు. కై పో చే, చిచోరే, ఎం.ఎస్. ధోని - ది అన్‌టోల్డ్ స్టోరీ, రాబ్తా వంటి హిట్ చిత్రాలలో నటించాడు. అతడికి దేశవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. సుశాంత్ సింగ్ ఆకస్మిక మరణాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయారు.