కొత్త సీఎం ప్ర‌మాణ స్వీకారం.. బాధ్య‌త ఈ డైరెక్ట‌ర్‌కి!

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ‌కు వ‌రుస విజ‌యాల్ని అందించ‌డంలో బోయ‌పాటి శ్రీ‌నుకు ఉన్న రికార్డ్ గురించి తెలిసిందే

Update: 2024-06-04 16:16 GMT

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ‌కు వ‌రుస విజ‌యాల్ని అందించ‌డంలో బోయ‌పాటి శ్రీ‌నుకు ఉన్న రికార్డ్ గురించి తెలిసిందే. ఆయ‌న నంద‌మూరి బాల‌కృష్ణ‌తో పాటు, తేదేపా అధినేత నారా చంద్ర‌బాబు నాయుడుకు అత్యంత స‌న్నిహితుడు. తెలుగు దేశం పార్టీ ఎన్నిక‌ల ప్ర‌చార చిత్రాల‌ను రూపొందించిన అనుభ‌వం బోయ‌పాటి సొంతం. అలాగే బాబు సీఎంగా ఉన్న‌ప్పుడు అమరావతి రాజధాని ప్రారంభోత్సవ సమయంలో కృష్ణా పుష్కరాలకు రూపకల్పన చేసిన అనుభ‌వం ఉంది. ఏదైనా ప్రాజెక్టును అప్పజెబితే బోయ‌పాటి స‌క్సెస్ చేయ‌గ‌ల‌డ‌న్న గురి సీఎన్‌బికి ఉంది.

ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తెలుగుదేశం -జ‌న‌సేన‌- భాజ‌పా కూట‌మి అఖండ విజ‌యం సాధించింది. రాష్ట్రాన్ని కూట‌మి క్లీన్ స్వీప్ చేసింది. ఈ విజ‌యంతో చంద్ర‌బాబు అండ్ కో ఆనంద డోలిక‌ళ్లో మునిగి తేల్తున్నారు. ఈ నెల 9వ తేదీన చంద్ర‌బాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని ఘ‌నంగా డిజైన్ చేయాలని బోయపాటిని సీబీఎన్ కోరినట్లు మీడియాలో క‌థ‌నాలొస్తున్నాయి. ఈ త‌ర‌హా ప్రాజెక్టుల‌ను ఎలాంటి త‌ప్పిదాలు లేకుండా స‌క్సెస్ చేసిన అనుభ‌వం బోయ‌పాటికి గ‌తంలో ఉంది. అందువ‌ల్ల ఇప్పుడు కూడా అత‌డే బ‌రిలో దిగే ఛాన్సుంది.

గ‌త ప్ర‌భుత్వం తెలుగు చిత్ర‌సీమ‌ను చాలా ఇబ్బందుల‌కు గురి చేసింది. కానీ ఇప్పుడు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం సినీప‌రిశ్ర‌మ అభివృద్ధికి కృషి చేస్తుంద‌న్న నమ్మ‌కం ఉంది. ప‌రిశ్ర‌మ ప్ర‌ముఖులు కూడా చంద్ర‌బాబుకు స‌న్నిహితులుగా ఉన్నారు కాబ‌ట్టి ఇక‌పై సినీప్ర‌పంచంలోను హుషారు క‌నిపిస్తుంద‌ని భావిస్తున్నారు. ఇక‌పై బాబు హ‌యాంలో నంది అవార్డుల‌ను క్ర‌మం త‌ప్ప‌కుండా ఇచ్చేందుకు ఆస్కారం ఉంది. ప‌రిశ్ర‌మ‌కు ఏ స‌మ‌స్య వ‌చ్చినా విన్న‌వించుకునేందుక సినీప్ర‌ముఖుల‌కు వెసులుబాటు ఇక‌పై పెరగ‌నుంది.

Tags:    

Similar News