బుజ్జితల్లి వీడియో సాంగ్ వచ్చేసింది
ఫిబ్రవరి 7న రిలీజ్ అయిన తండేల్ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ను అందుకుని చైతూ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.;
అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ప్రేమ కథా చిత్రం తండేల్. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందింది. ఫిబ్రవరి 7న రిలీజ్ అయిన తండేల్ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ను అందుకుని చైతూ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.
ఈ సినిమాలోని బుజ్జితల్లి అనే పాట ఎంత వైరల్ అయిందో అందరికీ తెలుసు. తండేల్ ప్రమోషన్స్ ను మొదలుపెట్టింది ఈ పాటతోనే. రిలీజైన కాసేపటికే ఇన్‌స్టంట్ చార్ట్‌బస్టర్ గా నిలిచిన ఈ పాట అందరినీ మెప్పించింది. ఇంకా చెప్పాలంటే తండేల్ కు మంచి బజ్ క్రియేట్ చేయడంలో ఈ పాట ఎంతో కీలక పాత్ర పోషించిందని చెప్పొచ్చు.
ప్రియురాలికి దూరమైనప్పుడు ప్రియుడు పడే విరహవేదన, ఆమెను బుజ్జగించేలా ఉండే బుజ్జితల్లి సాంగ్ మ్యూజిక్ లవర్స్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటకు శ్రీమణి లిరిక్స్ రాయగా, ప్రముఖ సింగర్ జావేద్ అలీ ఈ పాటను ఆలపించాడు. తాజాగా బుజ్జితల్లి ఫుల్ వీడియో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
థియేటర్లలో తండేల్ మంచి కలెక్షన్లతో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సినిమా రిలీజై దాదాపు నెల రోజులవుతున్నప్పటికీ తండేల్ కు కొన్ని చోట్ల ఇప్పటికీ మంచి ఆక్యుపెన్సీలు దక్కుతున్నాయి. థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ లవ్ స్టోరీ ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు రెడీ అయింది. మార్చి 7 నుంచి తండేల్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రానుంది.