ఫేమ‌స్ న‌టుడి బ్యాగులో బుల్లెట్లు!

త‌నిఖీలో భాగంగా ఆయన బ్యాగును స్కానర్ పై ఉంచగా, పేలుడు పదార్థాలు ఉన్నట్టు అలర్ట్ వచ్చింది.

Update: 2024-06-03 06:10 GMT

నాలుగు కాదు..ఎనిమిది కాదు..ప‌ది కాదు..ప‌న్నెండు కాదు. ఏకంగా 40 బుల్లెట్ల‌తో న‌టుడు ఎయిర్ పోర్ట్ అధికారుల‌కు చిక్క‌డం షాకింగ్ గా మారింది. అన్ని బుల్లెట్ల‌తో అత‌డు ఎక్క‌డికి ప్ర‌యాణమ‌య్యాడు? అన్ని బుల్లెట్లు బ్యాగ్ లో ఉంచాల్సిన అవ‌స‌రం ఏముంది? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇంత‌కీ ఎవ‌రా న‌టుడు? అంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే. కోలీవుడ్ సీనియర్ న‌టుడు, మాజీ ఎమ్మెల్యే కరుణాస్‌ను తిరుచ్చి వెళ్లేందుకు నేడు ఉద‌యం చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నాడు.

త‌నిఖీలో భాగంగా ఆయన బ్యాగును స్కానర్ పై ఉంచగా, పేలుడు పదార్థాలు ఉన్నట్టు అలర్ట్ వచ్చింది. వెంటనే ఆ బ్యాగును తనిఖీ చేయగా పెద్ద సంఖ్యలో బుల్లెట్లు ఉన్నట్టు గుర్తించారు. ఈ బుల్లెట్లు అన్నీ హ్యాండ్‌బ్యాగ్‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీంతో క‌రుణాస్ ని అదుపులోకి తీసుకున్నారు. అధికారులు 40 బుల్లెట్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు క‌రుణాస్ ప్రయాణాన్ని తాత్కాలికంగా రద్దు చేశారు. 40 బుల్లెట్ల‌తో ఎక్క‌డికి ప్ర‌యాణం చేస్తున్నాడు? అన్న వివ‌రాలు అడిగి తెలుసుకుంటున్నారు.

అయితే క‌రుణాస్ తన వద్ద లైసెన్స్ డ్ తుపాకీ ఉందని, ఈ బుల్లెట్లు దానికి సంబంధించినవేనని, తన వద్ద తగిన పత్రాలు ఉన్నాయని కరుణాస్ స్పష్టం చేశారు. తాను ఇంటి నుంచి ఎయిర్ పోర్టుకు బయల్దేరే హడావిడిలో బ్యాగులో ఏమున్నాయో సరిగా చూసుకోలేదని అధికారులకు వివరణ ఇచ్చారు. అయితే ఆ పత్రాలు తనిఖీ చేసిన అధికారులు కరుణాస్ ను విమానం ఎక్కేందుకు అంగీకరించలేదు. ఎయిర్ పోర్టు నుంచి తిరిగి వెనక్కి వెళ్లిపోయేందుకు అనుమతించారు.

దీనిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని విమానాశ్రయ పోలీసులు వెల్లడించారు. కరుణాస్ గతంలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేగానూ ఉన్నారు. తిరువాడనై నియోజకవర్గంలో 2016 నుంచి 2021 వరకు శాసనసభ్యుడిగా కొనసాగారు. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నిక‌ల హ‌డావుడి నెల‌కొన్న సంగ‌తి తెలిజిందే. జూన్ 4న ఫ‌లితాలు కూడా వెలువ‌డుతున్నాయి. ఈ నేప‌థ్యంలో 40 బుల్లెట్లు దొర‌క‌డం క‌ల‌క‌లంగా మారింది.

Tags:    

Similar News