బన్నీ- శిల్పా రవి.. అసలు ఆ స్నేహం ఎలా?
వాస్తవానికి.. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి భార్య శిల్పా నాగిని రెడ్డి, అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి బెస్ట్ ఫ్రెండ్స్.
మాములుగానే హీట్ పుట్టించే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు.. ఈసారి సినీ ప్రముఖుల ఎంట్రీతో మరింత వేడెక్కాయి. ప్రచారం చివరి రోజైన నిన్న ఎక్కడ చూసినా ఏపీ ఎన్నికల కోసమే చర్చ జరిగింది. అటు పవన్ కళ్యాణ్ ను పిఠాపురంలో రామ్ చరణ్, సురేఖ, అల్లు అరవింద్ కలవగా.. ఇటు నంద్యాలలో వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని అల్లు అర్జున్ కలిశారు. తన స్నేహితుడికి బన్నీ బెస్ట్ విషెస్ తెలిపారు.
ఇప్పటికే శిల్పా రవి తొలిసారి పోటీ చేసినప్పుడు బన్నీ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈసారి అది సరిపోదనిపించిందని అల్లు అర్జున్ తెలిపారు. శిల్పా రవి ఆరేళ్ల నుంచి ఎంత కష్టపడుతున్నారో చూస్తానని, అందుకే వ్యక్తిగతంగా విషెస్ తెలపడానికి నంద్యాల వచ్చానని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గెలవాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అసలు వీళ్లద్దరి మధ్యలో స్నేహం ఎలా మొదలైందనే డౌట్ అందరికీ వస్తుంది. మరి వీరిద్దరు ఎలా ఫ్రెండ్స్ అయ్యారంటే?
వాస్తవానికి.. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి భార్య శిల్పా నాగిని రెడ్డి, అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి బెస్ట్ ఫ్రెండ్స్. వారిద్దరూ క్లాస్ మేట్స్ కూడా. దీంతో వారిద్దరి ద్వారా తరచూ బన్నీ, రవి చంద్ర కలుసుకునే వారు. అలా భార్యల మధ్య స్నేహంతో రవిచంద్ర, అల్లు అర్జున్ మంచి స్నేహితులు అయ్యారు. అప్పుడప్పుడు కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఇద్దరూ కలుస్తుంటారు. అంతా కలిపి ఫారిన్ ట్రిప్స్ కూడా వెళ్తుంటామని ఓ ఇంటర్వ్యూలో రవిచంద్ర తెలిపారు.
అదే ఇంటర్వ్యూలో.. "అల్లు అర్జున్ సోషల్ ఎవేర్ నెస్ ఉన్న వ్యక్తి. ఈ విషయం పెద్దగా ఎవరికీ తెలియదు. సినిమాల్లో ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు.. బన్నీ డొనేషన్ ఇవ్వడంలో ముందు వరుసలో ఉంటారు. రాజకీయాలపై కూడా ఆయనకు మంచి ఇంట్రెస్ట్ ఉంది. పాలిటిక్స్ లో రావాలని ఆయనకు లేదు. కానీ ప్రజలకు అలా చేయాలి.. ఇలా చేయాలని ఎప్పుడు చెబుతుంటారు" అని చెప్పారు.
తన పొలిటికల్ ఎంట్రీ గురించి బన్నీ ట్వీట్ చేయడంపై కూడా స్పందించారు శిల్పా రవి. "అది నిజంగా అల్లు అర్జున్ గొప్పతనం. నేను అలా ఊహించలేదు. జనసేన పోటీ చేస్తున్నా.. ఆయన నాకు సపోర్ట్ చేస్తున్నారని తెలుసు. మేం కలిసినప్పుడు రాజకీయాల గురించి మాట్లాడుతుంటారు. ప్రజల కోసం అది చేయాలి.. ఇది చేయాలని అంటుంటారు. నేను పోటీ చేస్తే ప్రచారం చేస్తాను అనేవారు" అని గుర్తు చేసుకున్నారు.
"కానీ జనసేన పోటీ చేస్తుండటంతో నేను ఆయనకు ఇబ్బంది పెట్టలేదు. ప్రచారానికి, మద్దతు ఇవ్వడానికి ఆహ్వానించాలని అనుకోలేదు. కానీ నా గురించి ఒక్క ట్వీట్ చేసి.. మా మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్ కు ఆయన ఎంతటి విలువ ఇచ్చారో అర్థమైంది. స్నేహం కోసం బన్నీ .. తనకు మద్దతు తెలపడం సంతోషంగా ఉంది. తన నియోజకవర్గంలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాల్సిన అవసరం వస్తే బన్నీని అడుగుతా" అని ఇంటర్వ్యూలో తెలిపారు.
అయితే ఈ ఇంటర్వ్యూ.. పాతదైనప్పటికీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్నేహానికి ఇచ్చే విలువ ఏంటనది బన్నీ మరోసారి సాటి చెప్పారని ఆయన ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఎన్నికల సమయంలో తన మిత్రుడి విజయం కోసం స్నేహబంధాన్ని పాటించారని కొనియాడుతున్నారు. మొత్తానికి.. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగిన శిల్పా రవి విజయం సాధించాలని పార్టీలకు అతీతంగా బన్నీ కోరుకుంటున్నారు.