పిచ్చి నిర్ణయం.. చంద్రముఖి-2 వాయిదా?

కానీ 15 నుంచి 28కి వాయిదా వేసేట్లయితే అంతకంటే పిచ్చి నిర్ణయం మరొకటి ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Update: 2023-09-08 10:55 GMT

సెప్టెంబరు 28న రావాల్సిన భారీ చిత్రం 'సలార్' వాయిదా పడటం.. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన ఫిలిం ఇండస్ట్రీలనూ షేక్ చేసేసింది. ఈ సినిమా వాయిదా పడటం వల్ల ఎన్ని చిత్రాల రిలీజ్ డేట్లు తారు మారు అవుతున్నాయో అంచనా వేయడం కూడా కష్టంగా ఉంది. కనీసం ఒక 20 సినిమాల మీద అయినా ఆ ప్రభావం ఉందంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికే ఏవేవో డేట్లకు అనుకున్న నాలుగైదు సినిమాలు సెప్టెంబరు చివరి వారం మీద పడిపోయాయి. దీంతో 28, 29 తేదీల్లో మ్యాడ్ రష్ కనిపిస్తోంది.

ఆ వీకెండ్లో ఉన్న సినిమాలు చాలవని ఇప్పుడు వాటికి ఇంకో చిత్రం తోడవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సెప్టెంబరు 15న రావాల్సిన 'చంద్రముఖి-2'ను కూడా రెండు వారాలు వాయిదా వేసి 28న రిలీజ్ చేయబోతున్నట్లుగా ఇప్పుడు జోరుగా ప్రచారం జరుగుతోంది.

'చంద్రముఖి-2' వాయిదాకు కారణం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం అని అంటున్నారు. కానీ సెప్టెంబరు 28 క్రేజీ డేట్ అన్న ఉద్దేశంతోనే వాయిదా వేయాలని చూస్తుండొచ్చనే చర్చా జరుగుతోంది. కానీ 15 నుంచి 28కి వాయిదా వేసేట్లయితే అంతకంటే పిచ్చి నిర్ణయం మరొకటి ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఎందుకంటే ఆల్రెడీ 28కి మ్యాడ్ రష్ కనిపిస్తోంది. 'చంద్రముఖి-2' ఆ రోజు రిలీజయ్యేట్లయితే తెలుగు కలెక్షన్ల మీద ఆశలు వదులుకోవాల్సిందే. ఆల్రెడీ ట్రైలర్ పేలవంగా ఉండటంతో సినిమాకు ఇక్కడ బజ్ క్రియేట్ కాలేదు.

అలాంటిది 'స్కంద'తో పాటు మరో మూణ్నాలుగు సినిమాలతో పోటీ అంటే ఆ సినిమాను పట్టించుకునేవాళ్లు ఉండరు. దానికి థియేటర్ల సమస్య కూడా తప్పదు. అయినా సెప్టెంబరు 15న రావాల్సిన 'స్కంద' వాయిదా పడ్డందుకు సంతోషించి ఆ రోజు హుషారుగా సినిమాను రిలీజ్ చేసుకోవాలి.

ఆ రోజు మరో డబ్బింగ్ మూవీ 'మార్క్ ఆంటోనీ' మినహా తెలుగు నుంచి 'చంద్రముఖి-2'కు పోటీయే లేదు. ఇంత మంచి అవకాశాన్ని వదులుకుని తీవ్రమైన పోటీ ఉన్న 28న రావాలనుకోవడం తెలివి తక్కువ నిర్ణయమే అవుతుంది.

Tags:    

Similar News