ట్రైలర్ టాక్: 'చందు చాంపియన్'గా కార్తీక్‌లో కొత్త కోణం!
నిజ జీవిత కథలతో తెరకెక్కే సినిమాలు ఆసక్తిని పెంచుతున్నాయి. ఇదే కేటగిరీలో వస్తున్న మరో సినిమా 'చందు చాంపియన్'
నిజ జీవిత కథలతో తెరకెక్కే సినిమాలు ఆసక్తిని పెంచుతున్నాయి. ఇదే కేటగిరీలో వస్తున్న మరో సినిమా `చందు చాంపియన్`. భారతదేశపు తొలి పారాలింపిక్ క్రీడాకారుడు మురళీకాంత్ పేట్కర్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. తాజాగా ట్రైలర్ విడుదలైంది. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ స్పోర్ట్స్ డ్రామాలో రెజ్లర్ కం బాక్సర్‌గా కార్తీక్ నటించాడు. ఆర్మీ సైనికుడిగాను కనిపించాడు. గత కొన్ని రోజులుగా మేకర్స్ కథానాయకుడి పోస్టర్‌లను విడుదల చేయగా అద్భుత స్పందన వచ్చింది. కార్తీక్ తన పాత్ర లోకి పరకాయం చేయడానికి శారీరకంగా జిమ్ లో ఎంతగా శ్రమించాడో పోస్టర్లను చూస్తే అర్థమైంది.
1967లో చందు (కార్తీక్ ఆర్యన్) ఒక భారతీయ సైనికుడిగా మిషన్‌లో తీవ్రంగా గాయపడిన తర్వాత కోమా నుండి మేల్కొనడాన్ని ట్రైలర్ ఆరంభంలో చూపించారు. చందు తిరిగి పోరాడటాన్ని విశ్వసిస్తున్నాడని.. పోరాటాన్ని ఎప్పటికీ వదలడనేది నేపథ్యంలో డైలాగ్ - చిన్నప్పటి నుండి అతడు ఎలా ఉండేవాడు? ఎలా చాంపియన్ గా ఎదిగాడు? అన్నది ట్రైలర్ లో చూపించారు. నత్తి నత్తిగా అమాయకంగా మాట్లాడే చందు తన స్కూల్ టీచర్‌కి తాను రెజ్లర్ అవ్వాలనుకుంటున్నానని చెప్పినప్పుడు అతడి క్లాస్‌మేట్స్ ఎగతాళి చేస్తారు. `చందు ఛాంపియన్` అంటూ వెకిలిగా ఆటపట్టిస్తారు. కానీ చందు ఒక రియల్ ఛాలెంజర్. పట్టువదలని విక్రమార్కుడు.
బెదిరించే వారికోసం తన ఆత్మను చంపకూడదని చందు నిర్ణయించుకుంటాడు. తన కలను నెరవేర్చుకోవడానికి సవాళ్లకు ఎదురెళతాడు. మ్యాచ్ లలో పోరాడుతాడు. బాక్సర్ గా తన పాత్ర కోసం కార్తీక్ ఆర్యన్ మేకోవర్ ఆశ్చర్యపరుస్తుంది. అతడి పాత్ర ఆద్యంతం ఎమోషనల్ గా సాగుతుంది. ఇంతకాలం రొమాంటిక్ కామెడీలతో అలరించిన చాక్లెట్ బోయ్ కార్తీక్ ఆర్యన్‌లో దర్శకుడు కబీర్ ఖాన్ సీరియస్ సైడ్ తీసుకురాగలిగాడు. కార్తీక్ పాత్ర ఆద్యంతం ఎనర్జిటిక్ గా యాక్షన్ మోడ్ లో కనిపించింది. ఇందులో ఎమోషనల్ మూవ్ మెంట్స్ కి కొదవేమీ లేదని ట్రైలర్ చెబుతోంది. `తు హై ఛాంపియన్..` పాట ఎనర్జీతో నిండి ఉంది.. స్పోర్ట్స్ డ్రామాకి సరిపడే థీమ్ సాంగ్. ప్రీతమ్ సంగీతం సమకూర్చారు. సాజిద్ నడియాడ్‌వాలా - కబీర్ ఖాన్ నిర్మించారు. చందు ఛాంపియన్ 14 జూన్ 2024న థియేటర్లలోకి రానుంది.