చైనా వెబ్ సైట్స్ లో మెగాస్టార్ చిరంజీవి రికార్డులు!

ఇటీవ‌లే మెగాస్టార్ చిరంజీవి గిన్నీస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డులో కూడా స్థానం సంపాదించిన సంగ‌తి తెలిసిందే.

Update: 2024-09-24 05:15 GMT

ఇటీవ‌లే మెగాస్టార్ చిరంజీవి గిన్నీస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డులో కూడా స్థానం సంపాదించిన సంగ‌తి తెలిసిందే. గిన్నీస్ రికార్డే ఆయ‌న కోసం హైద‌రాబాద్ వ‌ర‌కూ వ‌చ్చింది. మెగాస్టార్ ఏమాత్రం ఊహించ లేదు. గిన్నీస్ రికార్డు మ‌న‌కెందుకు వ‌స్తుందేలే? అనుకున్నారు త‌ప్ప‌! ఆయ‌న్నే వెతుక్కుంటూ వ‌స్తుంద‌ని ఏనాడు గెస్ చేయ‌లేదు. ఆయ‌న చేసిన చిత్రాల‌కు...డాన్స్ మూవ్ మెంట్ల‌ను గుర్తించి ఈ రికార్డు ప‌దిలం చేసారు. ఇదంతా ప‌క్క‌న బెడితే?

కింగ్ ఆఫ్ పాప్ మైఖెల్ జాక్స‌న్ గురించి తెలిసిందే. ప్ర‌పంచాన్నే త‌న పాప్ మాయా జాలంతో ఊపేసిన ఘ‌నుడు. జాక్స‌న్ తెలియ‌ని వారంటూ ఎవ‌రూ ఉండ‌రు. జాక్స‌న్ పేరును ఓ ట్యాగ్ గా త‌గిలించుకోవాల‌ని ఎంతో మంది ఆశ‌ప‌డ‌తారు. ఆ ర‌కంగా ఇండియ‌న్ మైఖెల్ జాక్స‌న్ గా ప్ర‌భుదేవాకి ఆ గుర్తింపు ఉంది. అత‌డి డాన్సుల‌ను గుర్తించి చిత్ర‌ప‌రిశ్ర‌మ అలా పిలుచుకుంటుంది. అయితే చైనా ప్రేక్ష‌కుల దృష్టిలో ఇండియ‌న్ మైఖెల్ జాక్స‌న్ ప్ర‌భుదేవా కాదు...మెగాస్టార్ చిరంజీవి అన్న సంగ‌తి వెలుగులోకి వ‌చ్చింది.

చాలా చైనా వెబ్ సైట్లు చిరంజీవిని ఇండియ‌న్ మైఖెల్ జాక్స‌న్ గా అభివ‌ర్ణించాయి. ఈ విష‌యాన్ని గిన్సీస్ బుక్ ఆఫ్ రికార్డు ప్ర‌తినిధి రిచ‌ర్స్డ్ రివీల్ చేసారు. చిరంజీవి డాన్స్ మూవ్ మెంట్ల‌ను చైనా అభిమానులు ఎంతో క్లోజ్ గా స్ట‌డీ చేసి ఆ స్థానం ఆయ‌న‌కు క‌ట్ట‌బెట్టిన‌ట్లు చెప్పారు. ఇది చిరంజీవి సాధించిన మ‌రో అరుదైన ఘ‌న‌త అనే చెప్పాలి. చైనా వాళ్లు అంటేనే మ‌హా ట్యాలెంటెడ్. ఒళ్లును విల్లులా ఎలాగైనా వంచ‌గ‌ల‌రు.

యాక్ష‌న్ చిత్రాల్లో చైనా వాళ్ల ప్ర‌తిభ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ప్ర‌పంచ‌మే మెచ్చిన ఎంతో మంది లెజెండ్ లు చైనాలో ఉన్నారు. అలాంటి చైనా ప్రేక్ష‌కుల నుంచే మెగాస్టార్ ప్ర‌శంస‌లు అందుకున్నారంటే చిన్న విష‌యం కాదు. ద‌టీజ్ మెగాస్టార్.

Tags:    

Similar News