ఏడాది పాటు బెడ్ పైనే విక్రమ్..23 ఆపరేషన్లు!
తాజాగా విక్రమ్ ఓ ఇంటర్వ్యూలో తన కాలేజ్ రోజుల్ని, నటనకు బీజం పడిన నాటి సంగతుల్ని గుర్తు చేసుకున్నాడు.
చియాన్ విక్రమ్ యాక్టింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. దేశంలోనే గ్రేట్ యాక్టర్స్ లో ఒకరు. విశ్వనటుడు కమల్ హాసన్ తర్వాత స్థానం విక్రమ్ దే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంకా చెప్పాలంటే? అంతకు మించే అనడంలో అతిశయోక్తి లేదు. నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కి పైకొచ్చిన నటుడు. ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగల నటుడు. అందుకే అనతి కాలంలో గొప్ప నటుడిగా పేరు సంపాదించాడు.
తాజాగా విక్రమ్ ఓ ఇంటర్వ్యూలో తన కాలేజ్ రోజుల్ని, నటనకు బీజం పడిన నాటి సంగతుల్ని గుర్తు చేసుకున్నాడు. 'చిన్నతనం నుంచే నటుడు అవ్వాలనే కోరిక ఉండేది. ఎనిమిదవ తరగతి వారకూ బాగానే చదివాను. నటన మనసులోకి వచ్చిన తర్వాత సరిగ్గా చదవలేదు. లక్కీ గా పాస్ అయి కాలేజీకి వచ్చేసాను. అక్కడ నాటకంలో నటిస్తున్నప్పుడే ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది. కానీ ఆ రోజు నాకు కాలు విరిగింది.
దీంతో ఏడాది పాటు మంచంపైనే ఉన్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకూ 23 ఆపరేషన్లు జరిగాయి. నేను నడుస్తున్నాని డాక్టర్లు చెప్పినప్పుడు అమ్మ ఏడ్చేసింది. సుమారు పదేళ్ల పాటు ఆ సమయంలో కష్టపడ్డాను. నా కుటుంబానికి అండగా ఉండేదుకు 750 జీతానికి ఉద్యోగం చేసాను. అలాంటి సమయంలో కూడా నాకు సినిమాల్లో నటించాలనే ఆశ చచ్చిపోలేదు. దీంతో కొన్ని అవకాశాలు వచ్చాయి.
అలా నా పోరాటం మొదలైంది. అందుకే ఈరోజు ఇక్కడ ఉండగలిగాను. ఒకవేళ అప్పుడు సక్సెస్ కాకపోతే ఇప్పటికీ సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తుండేవాడిని. అనుకున్నది సాధించలంటే కష్టం తప్పదు. అన్ని రకాలుగా సిద్దపడి ముందుకెళ్లాలి' అని అన్నారు. ఈనెలలో 'తంగలాన్' సినిమాతో ప్రేక్షకుల ముందు కొస్తున్నసంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య ఈ సినిమా రిలీజ్ అవుతుంది.