సి.కళ్యాణ్ వ్యాఖ్యల పై థియేటర్ యజమానుల ఆగ్రహం
ఎగ్జిబిటర్లు అమ్ముడు పోయారని అందుకే దిల్ రాజు గెలిచాడని కళ్యాణ్ ఆరోపించారు. అయితే ఈ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని ఎగ్జిబిటర్లు సి.కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు.
సాధారణ ఎన్నికల్లో కలరింగ్ ఇప్పుడు మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నికలు సహా ఫిలించాంబర్ ఎన్నికల కు ఆపాదించడం టాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. మునుపటితో పోలిస్తే సినిమావాళ్లలో రాజకీయాలు శ్రుతిమించుతున్నాయన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. అసలు కళాకారుల కు ఇలాంటివి ఎందుకు? అన్నవాళ్లకు కొదవేమీ లేదు.
ఇటీవలే ఫిలించాంబర్ కొత్త అధ్యక్షుడిగా దిల్ రాజు తన ప్రత్యర్థి అయిన సి.కళ్యాణ్ పై నెగ్గారు. 2023-25 సీజన్ కి దిల్ రాజు సహా కొత్త కార్యవర్గం కొలువు దీరింది. నేడు ప్రమాణ స్వీకారం కూడా జరిగింది. దిల్ రాజు అధ్యక్షుడిగా ఓత్ తీసుకుని సంతకాలు చేస్తున్న వీడియోలు అంతర్జాలం లో వైరల్ గా మారాయి.
అదంతా అటుంచితే.. ఇంతకుముందు దిల్ రాజు గెలుపునుద్ధేశించి సి.కళ్యాణ్ చేసిన కామెంట్ హాట్ టాపిక్ అయింది. ఎగ్జిబిటర్లు అమ్ముడు పోయారని అందుకే దిల్ రాజు గెలిచాడని కళ్యాణ్ ఆరోపించారు. అయితే ఈ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని ఎగ్జిబిటర్లు సి.కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఎన్నికల్లో మెజారిటీ ఉన్న వ్యక్తికే తాము మద్ధతు తెలిపామని ఎగ్జిబిటర్లు వివరణ ఇచ్చారు. ఏది ఏమైనా కానీ ఎన్నికల్లో ఇలాంటివి చాలా సహజం. ఒకరితో ఒకరు బాహాబాహీ.. పోటాపోటీ వ్యాఖ్యలు షరామామూలే. ఇప్పుడు దిల్ రాజు గెలిచి పదవి చేపట్టారు. సి.కళ్యాణ్ ఆయన కు శుభాకాంక్షలు చెబుతూ ఒక హగ్ కూడా ఇచ్చారు.
ఆ ఇరువురూ ఏకమై మునుముందు పరిశ్రమ అభివృద్ధికి ఏం చేయాలో కలిసికట్టుగా ఆలోచిస్తే బావుంటుందని కీలకమైన నాలుగు సెక్టార్ల సభ్యులు కోరుకుంటున్నారు. చాంబర్ సభ్యుల సంక్షేమం ఆరోగ్యం సహా ఇతర అంశాల పై హామీల్ని కొత్త అధ్యక్ష కార్యవర్గం నెరవేర్చాల్సి ఉంటుంది. రెండేళ్లలో కొత్త కార్యవర్గానికి మ్యాజిక్ చేసేందుకు చాలా స్కోప్ ఉందని విశ్లేషిస్తున్నారు.
ముఖ్యంగా టాలీవుడ్ పాన్ ఇండియా రేంజుకు ఎదిగింది. అసలు ఎవరూ టచ్ చేయలేని రేంజు కు తెలుగు చిత్రసీమను చేర్చేందుకు ఏం చేయాలో ఎవరు నడుం కడతారో వేచి చూడాలి. దిల్ రాజు హామీల్లో ఇది అత్యంత కీలకమైనది గనుక సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. టాలీవుడ్ పాన్ వరల్డ్ ని టచ్ చేస్తుందేమో చూడాలి.