మూవీ రివ్యూ : కోర్ట్
'కోర్ట్' మూవీ రివ్యూ
నటీనటులు: ప్రియదర్శి- హర్ష రోషన్- శ్రీదేవి- శివాజీ- సాయి కుమార్- హర్షవర్ధన్- రోహిణి-సురభి ప్రభావతి- శుభలేఖ సుధాకర్ తదితరులు..
సంగీతం: విజయ్ బుల్గానిన్
ఛాయాగ్రహణం: దినేష్ పురుషోత్తమన్
నిర్మాత: ప్రశాంతి త్రిపిర్నేని
రచన-దర్శకత్వం: రామ్ జగదీశ్
కమెడియన్.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పించిన ప్రియదర్శి ఇటీవల లీడ్ రోల్స్ లో సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. మంచి అభిరుచితో సినిమాలు నిర్మిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్న స్టార్ హీరో నాని.. ప్రియదర్శి ప్రధాన పాత్రలో ప్రొడ్యూస్ చేసిన సినిమా.. కోర్ట్. చక్కటి ప్రోమోలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిందీ చిత్రం. మరి సినిమా ఎంతమేర మెప్పించిందో చూద్దాం పదండి.
కథ :
వైజాగ్ లో ఇంటర్ చదివి పార్ట్ టైం జాబ్స్ చేసుకునే చందు (హర్ష రోషన్).. ఇంటర్ సెకండియర్ చదువుతున్న జాబిలి (శ్రీదేవి) ప్రేమలో పడతారు. శ్రీదేవి మామయ్య మంగాపతి(శివాజీ) పరువు కోసం ప్రాణం ఇచ్చే మనిషి. చందు - జాబిలి విషయం మంగాపతికి తెలియడంతో జాబిలి చందు ఇంట్లో ఉన్నప్పుడు శ్రీదేవి ఫ్యామిలీతో పాటు పోలీసులని తీసుకొచ్చి అతన్ని అరెస్ట్ చేయిస్తాడు. అతనిపై రకరకాల కేసులు పెట్టిస్తాడు. శ్రీదేవికి ఇంకా 18 ఏళ్ళు రాకపోవడంతో పోక్సో కేసు కూడా పెట్టిస్తాడు. చందు ఈ కేసులో పూర్తిగా ఇరుక్కుపోతాడు. చుట్టూ ఉన్న వ్యవస్థలన్నీ అతడికి వ్యతిరేకంగా పనిచేస్తాయి. ఈ స్థితిలో అప్పటిదాకా కేసే వాదించని తేజ (ప్రియదర్శి) ఈ కేసును తీసుకుంటాడు. మరి తేజ.. చందును ఈ కేసు నుంచి బయటపడేయగలిగాడా? అతడి వాదన ఎలా సాగింది? చివరికి తీర్పు ఏం వచ్చింది? ఈ ప్రశ్నలన్నింటికీ తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.
కథనం - విశ్లేషణ:
హీరో నాని నిర్మాతగా సినిమా అంటే అందులో ఏదో ఒక కొత్తదనం ఉంటుందని.. ఒక అభిరుచి కనిపిస్తుందనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. తన ప్రొడక్షన్లో తెరకెక్కిన కొత్త చిత్రం 'కోర్ట్' ట్రైలర్ చూస్తే నిర్మాత నాని మరోసారి తన మార్కు చూపించబోతున్నట్లే కనిపించింది. 'అ!'.. 'హిట్' ఫ్రాంఛైజీ సినిమాలతో తెలుగు తెరకు సరి కొత్త కథలను పరిచయం చేసిన నాని.. ఇప్పుడు 'కోర్ట్' రూపంలో తెలుగులో అంతగా పాపులర్ కాని జానర్ సినిమాను అందించాడు. హిందీ.. మలయాళం లాంటి భాషల్లో ఆరంభం నుంచి చివరి దాకా ఒక బిగితో సాగే కోర్ట్ రూం డ్రామాలు చూస్తుంటాం. మన దగ్గర కోర్టు రూం డ్రామాలు రావని కాదు కానీ.. వాటిలో అంత ఇంటెన్సిటీ కనిపించదు. కోర్టు సన్నివేశాల్లో కూడా పాత్రలతో అల్లరి చేయించి కామెడీ పండించడం.. హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడం లాంటివి మన సినిమాల్లో మామూలే కానీ.. ఆసక్తికర వాదనలతో.. ఆలోచింపజేసే సన్నివేశాలతో.. ఉత్కంఠ రేపే ఒరిజినల్ కోర్ట్ రూం డ్రామాలు మాత్రం అరుదే. 'కోర్ట్' ఆ లోటును తీర్చి.. మనకూ చెప్పుకోవడానికి ఒక ఇంటెన్స్ కోర్ట్ రూం డ్రామా ఉందని చాటుతుంది. తెలుగులో ఈ .జానర్లో ఒక రెఫరెన్స్ లాగా నిలిచే చిత్రం.. కోర్టు.
'కోర్ట్' కథేంటన్నది ట్రైలర్ చూస్తేనే అర్థమైపోయింది. టీనేజీలో ఉన్న అబ్బాయి-అమ్మాయి ఒకరికొకరు ఆకర్షితులవడం.. ప్రేమ మైకంలో విహరిస్తున్న ఆ జంట పెద్ద షాక్ తగలడం.. అబ్బాయి మీద అనేక కేసులు పెట్టిన అమ్మాయి మావయ్య ఏకంగా పోక్సో కేసులోనూ ఇరికించడం.. అబ్బాయి జీవితం సర్వనాశనం అవుతున్న దశలో ఒక యంగ్ లాయర్ తన కేసును టేకప్ చేసి వాదించి గెలవడం.. ఇలా ట్రైలర్లనోనే కథ మొత్తం విప్పేశాడు దర్శకుడు. ఇలా ముందే కథ చెప్పేసి.. రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను ఎంగేజ్ చేసి మెప్పంచడం అంత తేలిక కాదు. కానీ కొత్త దర్శకుడైనప్పటికీ రామ్ జగదీష్ ఈ పనిని విజయవంతంగా పూర్తి చేశాడు. ముఖ్యంగా కోర్ట్ రూం డ్రామాను అతను నడిపిన తీరు ఈ సినిమాకు అతి పెద్ద బలం. పోక్సో చట్టం ఎంత ప్రమాదకరమో తెలియజేస్తూ అది దుర్వినియోగం అవుతున్న తీరును ఉత్కంఠభరిత.. ఆలోచన రేకెత్తించే సన్నివేశాలను తీర్చిదిద్దాడు. శివాజీ పోషించిన మంగపతి పాత్రతో సినిమాకు కావాల్సినంత ఇంటెన్సిటీ తీసుకురాగలిగాడు దర్శకుడు. కథలో కీలక మలుపు వచ్చే దగ్గర్నుంచి సినిమాను ఆ పాత్రే డ్రైవ్ చేస్తుందంటే అతిశయోక్తి కాదు.
ఆరంభ సన్నివేశాల నుంచే నేరుగా కథలోకి వెళ్లిపోవడంతో ప్రేక్షకులు త్వరగానే సినిమాలో ఇన్వాల్వ్ అయిపోతారు. ఐతే టీనేజీ జంట మధ్య ప్రేమకథ కాస్త స్పీడ్ బ్రేకర్ లా మారుతుంది. టీనేజీ ప్రేమకథలు మామూలుగానే కొంచెం చికాకు పెడతాయి. ఇందులో సిల్లీ సీన్లు లేకపోయినా.. లవ్ స్టోరీ సాధారణంగా అనిపిస్తుందంతే. ఆ వ్యవహారం త్వరగా ముగిసిపోయి కథలో ఎప్పుడు మలుపు వస్తుందా అని ఎదురు చూస్తాం. శివాజీ పాత్ర రూపంలో ఆ మలుపు వచ్చేస్తుంది. అబ్బాయి అరెస్ట్ అయ్యే సీన్ ఉత్కంఠ రేకెత్తించేలా తీర్చిదిద్దారు. తన చుట్టూ ఉచ్చు బిగుసుకునే సీన్లు కూడా బాగానే సాగాయి. హీరో ఈ కేసును టేకప్ చేశాక 'కోర్ట్' నెక్స్ట్ లెవెల్ కు వెళ్తుంది. కోర్టులో వాదోపవాదాలకు సంబంధించిన సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా అనిపిస్తాయి. సినిమాకు ఆ సీన్లే మేజర్ హైలైట్. చివరి వరకు అదే టెంపోను కొనసాగించాడు దర్శకుడు. క్లైమాక్సులో డైలాగులు కూడా బాగా పేలాయి. ప్రియదర్శి పాత్రతో చివర్లో ఇంకా ఇంపాక్ట్ ఇచ్చి ఉండొచ్చు కానీ.. ఎందుకో అక్కడ కొంచెం బ్యాలెన్స్ తప్పినట్లు అనిపిస్తుంది. ఆఖర్లో ఇచ్చిన సందేశం బాగుంది. ప్రేక్షకుల్లో కచ్చితంగా 'కోర్ట్' ఒక ఆలోచన రేకెత్తిస్తుంది. ఓవరాల్ గా కోర్ట్ రూం డ్రామాలను ఇష్టపడేవారు 'కోర్ట్'ను నిరభ్యంతరంగా చూడొచ్చు. తెలుగులో వచ్చిన బెస్ట్ కోర్ట్ రూం డ్రామాల్లో ఈ చిత్రం కచ్చితంగా ఒకటిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.
నటీనటులు :
ప్రియదర్శి లాయర్ పాత్రలో చక్కగా నటించాడు. ఒక స్టార్ హీరో చేయదగ్గ పాత్రలో అతను బలమైన ఇంపాక్టే చూపించాడు. ఐతే పతాక సన్నివేశాల్లో మాత్రం ఇంకా పవర్ ఫుల్ నటనను ఆశిస్తాం. సినిమాలో పెర్ఫామెన్స్ పరంగా ది బెస్ట్ అంటే మాత్రం శివాజీనే. 'నైంటీస్' వెబ్ సిరీస్ తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడానికి శివాజీ సరైన పాత్రనే ఎంచుకున్నాడు. తెరపై శివాజీ కనబడగానే ఒక రకమైన భయం కలిగేలా తన పాత్రను భలేగా పెర్ఫామ్ చేశాడు శివాజీ. తనను సరిగ్గా వాడుకుంటే బిజీ విలన్ అయిపోయే ఛాన్సుంది. హర్ష రోషన్ - శ్రీదేవి ఇద్దరూ టీనేజ్ ప్రేమ జంటగా ఆకట్టుకున్నారు. వయసుకు తగ్గ పాత్రల్లో ఇద్దరూ బాగా కుదిరారు. లవ్ సీన్లలో క్యూట్ గా కనిపిస్తూనే ఎమోషనల్ సీన్లలో కూడా పరిణతితో నటించారు హర్ష-శ్రీదేవి. రోహిణి తనకు అలవాటైన తల్లి పాత్రలో ఓకే అనిపించింది. సాయికుమార్ తన అనుభవాన్ని చూపించాడు. హర్షవర్ధన్ నటన మాత్రం కొంచెం అతిగా అనిపిస్తుంది. సహాయ పాత్రల్లో సురభి ప్రభావతి.. శుభలేఖ సుధాకర్.. రాజశేఖర్ అనింగి.. వీళ్లంతా బాగానే చేశారు.
సాంకేతిక వర్గం:
'కోర్ట్'కు సాంకేతిక హంగులు బాగానే సమకూరాయి. నిర్మాణ విలువలు సినిమాకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. క్వాలిటీ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇలాంటి కథకు మద్దతుగా నిలవడం ద్వారా నాని నిర్మాతగా మరోసారి తన అభిరుచిని చాటాడు.
సంగీత దర్శకుడు విజయ్ బుల్గానన్ స్వరపరిచిన లవ్ సాంగ్ ఆకట్టుకుంది. నేపథ్య సంగీతం కూడా ఓకే. కొన్ని సన్నివేశాల్లో ఆర్ఆర్ ఇంపాక్ట్ ఇంకా బలంగా ఉండాల్సందనిపిస్తుంది. సినిమాటోగ్రాఫర్ దినేష్ పురుషోత్తమన్ విజువల్స్ బాగున్నాయి. రామ్ జగదీష్ రచయితగా.. దర్శకుడిగా తన ముద్రను చూపించాడు. తొలి చిత్రమే అయినా.. కోర్ట్ రూమ్ డ్రామాను నడపడంలో పనితనం చాటాడు. తెలుగులో ఇలాంటి కథలు తెరకెక్కడం అరుదు. లవ్ స్టోరీ వరకు మామూలుగా అనిపించినా.. వ్యవహారం సీరియస్ గా మారి సెటప్ కోర్టుకు మారాక రైటింగ్.. టేకింగ్ లో ప్రత్యేకత కనిపిస్తాయి.
చివరగా: కోర్ట్.. కేసు నిలబడింది
రేటింగ్- 3.25/5