డాకు మహారాజ్‌... రెండో వారంలో ఎక్కువ!

బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందిన 'డాకు మహారాజ్‌' సినిమా 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.;

Update: 2025-03-05 08:03 GMT

బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందిన 'డాకు మహారాజ్‌' సినిమా 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా దాదాపు రూ.150 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. సినిమాలో బాలయ్య నటనకు, తమన్ సంగీతం కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దర్శకుడు బాబీ డాకు మహారాజ్ సినిమాను రూపొందించిన విధానంకు ఫ్యాన్స్‌ ఫిదా అవుతారు అంటూ రివ్యూలు వచ్చాయి. బాలయ్య ఫ్యాన్స్ కోసం అంటూ బాలయ్య ను హైలైట్‌ చేసి చూపించి బాబీ తీసిన విధానం ఆకట్టుకుంది అంటూ విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు.

డాకు మహారాజ్ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేదు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా కారణంగా డాకు మహారాజ్‌కి కాస్త డ్యామేజ్‌ జరిగింది అనేది కొందరి అభిప్రాయం. బాక్సాఫీస్ లెక్కలు పక్కన పెడితే ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో తెగ సందడి చేస్తుంది. రెండు వారాల క్రితం నెట్‌ ఫ్లిక్స్ ద్వారా డిజిటల్‌ ప్రపంచంలోకి డాకు మహారాజ్ ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుంచి ఓటీటీ ప్రేక్షకులు సినిమాను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మొదటి వారంలో నెట్‌ఫ్లిక్స్‌లో 2.4 మిలియన్ల మంది చూశారని అధికారికంగా ప్రకటన వచ్చింది. ఒక తెలుగు సినిమాకు ఆ స్థాయిలో వ్యూస్ రావడం సాధారణమైన విషయం కాదు.

నాన్‌ ఇంగ్లీష్ కేటగిరీలో డాకు మహారాజ్‌ రెండు వారాలుగా నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండ్‌ అవుతూనే ఉంది. కేవలం ఇండియాలోనే కాకుండా దాదాపు 15 దేశాల్లో సినిమా ట్రెండ్ అయింది. చివరకు పాకిస్తాన్‌లో సైతం డాకు మహారాజ్‌ను అధికంగా చూశారని నెట్‌ఫ్లిక్స్ లెక్కలు చెప్పాయి. డాకు మహారాజ్‌ సినిమాను మొదటి వారంతో పోల్చితే రెండో వారంలో ఓటీటీ ప్రేక్షకులు ఎక్కువగా చూశారు. నెట్‌ఫ్లిక్స్ అధికారిక లెక్కల ప్రకారం డాకు మహారాజ్ సినిమాను రెండో వారంలో 2.6 మిలియన్‌ల మంది చూశారు. ఇప్పటి వరకు దాదాపుగా అయిదు మిలియన్‌ల మంది సినిమాను స్ట్రీమింగ్‌ చేసినట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది.

బాలకృష్ణ వరుసగా అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్‌ కేసరి సినిమాలతో విజయాలను సొంతం చేసుకుని హ్యాట్రిక్ సాధించాడు. డాకు మహారాజ్‌ సినిమాతో డబుల్‌ హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. థియేట్రికల్‌ రిలీజ్‌తో పాటు ఓటీటీ స్ట్రీమింగ్‌లోనూ భగవంత్‌ కేసరి సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. బాలకృష్ణకు జోడీగా ప్రగ్యా జైస్వాల్‌ నటించగా కీలక పాత్రల్లో ఊర్వశి రౌతేలా, శ్రద్దా శ్రీనాథ్‌లు నటించారు. బాలీవుడ్‌ స్టార్‌ బాబీ డియోల్‌ స్టైలిష్‌ విలన్‌ గా నటించి మెప్పించారు. తమన్‌ నాల్గవ సారి బాలయ్య సినిమాకు అదిరిపోయే మ్యూజిక్‌ను ఇచ్చి ఫ్యాన్స్‌కి ఫుల్‌ కిక్‌ ఇచ్చాడు. దబిడిదిబిడి సాంగ్‌ అంతర్జాతీయ స్థాయిలో ట్రెండ్‌ అవుతూ, పాటకి ఎంతో మంది రీల్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News