భారతదేశంలో అత్యధిక ఆదాయపు పన్ను చెల్లించే నటి?
అయితే ప్రముఖ హిందీ మీడియా కథనం ప్రకారం.. పన్నులు చెల్లించడంలో ఆదర్శంగా నిలిచే నటీమణిగా దీపిక పేరు మార్మోగుతోంది
భారతదేశంలో అత్యధిక ఆదాయపు పన్ను చెల్లిస్తున్న నటీమణి ఎవరు? ఈ ప్రశ్నకు తాజాగా సమాధానం లభించింది. పాపులర్ హిందీ మీడియా కథనాల ప్రకారం.. దేశంలో భారీ ఆదాయం ఆర్జించడంతో పాటు భారీగా పన్ను చెల్లించే నటీమణిగా దీపిక పదుకొనే పేరు రికార్డులకెక్కింది. ఆదాయపన్ను చెల్లింపులకు సెలబ్రిటీలు సామాన్య ఉద్యోగులు అనే విభేధం లేదు. ఆదాయాన్ని బట్టి పన్ను ప్రతియేటా చెల్లించాలి. అలా నిజాయితీగా చెల్లింపులు చేస్తున్న నటీమణుల్లో దీపిక పదుకొనే నంబర్ వన్ ట్యాక్స్ పేయర్ గా రికార్డులకెక్కారు.
నిజానికి స్టార్లు సహా వివిధ రంగాల్లో సెలబ్రిటీలు భారీ ఆదాయాన్ని ఆర్జించేవారిగా అధిక పన్ను పరిధిలోకి వస్తారు. సెలబ్రిటీల ఆదాయ ఆర్జన ప్రకారం.. తమ ఆదాయంపై భారీ మొత్తంలో పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ముఖ్యంగా భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని హీరోలకు ధీటుగా నటీనటులు కోట్లాది రూపాయల పారితోషికాలు అందుకుంటూ సంచలనంగా మారుతున్నారు. వీరంతా తరచూ సినిమాలకు భారీ పారితోషికాలతో పాటు బ్రాండ్ ఎండార్స్ మెంట్ లు.. ఇతర వ్యాపారాల రూపంలో కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారని కథనాలొస్తున్నాయి. ఇలాంటి బహుళ ఆదాయ వనరులు వేర్వేరు పన్ను రేట్లు నిబంధనలకు లోబడి ఉండే అవకాశం ఉందని ఐటీ ఎక్స్ పర్ట్స్ విశ్లేషిస్తున్నారు.
అయితే ప్రముఖ హిందీ మీడియా కథనం ప్రకారం.. పన్నులు చెల్లించడంలో ఆదర్శంగా నిలిచే నటీమణిగా దీపిక పేరు మార్మోగుతోంది. దీపికా పదుకొనే 2016 -2017 ఆర్థిక సంవత్సరంలో రూ. 10 కోట్ల పన్నులు చెల్లించిన నటిగా రికార్డులకెక్కంది. అప్పటి నుంచి పెరిగిన ఆదాయానికి తగ్గట్టు పెరిగిన మొత్తంలో పన్నులు చెల్లిస్తూనే ఉన్నందున దీపికా పదుకొణే భారతదేశంలో అత్యధికంగా పన్ను చెల్లించే నటిగా గుర్తింపు పొందింది. బాలీవుడ్ లో అతిపెద్ద పన్ను చెల్లించే నటిగా ఆదాయపన్ను శాఖ దృష్టిలో ఈ బ్యూటీ ఉంది.
సినిమాలతో పాటు ఎండార్స్‌మెంట్ల ద్వారా అత్యధికంగా డబ్బు సంపాదించే సెలబ్రిటీ దీపిక పదుకొనే అని ఫోర్బ్స్ ఇండియా ఇదివరకూ పేర్కొంది. హిందీ మీడియా కథనాల ప్రకారం.. దీపిక నికర ఆస్తుల విలువ దాదాపు రూ. 500 కోట్లు. భారతదేశంలో రెండవ అత్యంత సంపన్న మహిళా సెలబ్రిటీగా ర్యాంక్ దక్కించుకుంది. 620 కోట్ల రూపాయల నికర విలువతో ప్రియాంక చోప్రా అగ్రస్థానంలో నిలవగా ఆ తర్వాతి స్థానంలో దీపికా పదుకొణె రికార్డులకెక్కింది. ఇప్పటి వరకు దాదాపు 10 కోట్ల రూపాయల వరకు పన్నులు చెల్లించిన దీపిక క్రమం తప్పకుండా పన్ను చెల్లింపులు చేసే నటీమణిగా పేరు పొందింది.
ఏటా రూ.5-6 కోట్ల మేర పన్నులు చెల్లిస్తున్న నటిగా అలియా భట్ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. స్టాక్ గ్రో గణాంకాల ప్రకారం... దీపికా సినిమా- బ్రాండ్ ఎండార్స్ మెంట్ ల కోసం భారీ మొత్తాలను వసూలు చేసింది. దీపికా పదుకొణె సుమారు రూ. 500 కోట్ల నికర విలువను కలిగి ఉండగా సంవత్సరానికి రూ. 40 కోట్లు సంపాదిస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాలకు రూ. 15-20 కోట్ల మధ్య పారితోషికం అందుకుంటోంది. అలాగే బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల కోసం రూ.8 కోట్లకు పైగా వసూలు చేస్తోంది. పన్ను చెల్లింపుల్లో ఉత్తమ నటిగా దీపికా పదుకొనే అగ్రస్థానంలో ఉన్నప్పటికీ బాలీవుడ్ లో అత్యధికంగా పన్ను చెల్లించే కథానాయకుడిగా అక్షయ్ కుమార్ పేరు జాబితాలో టాప్ 1గా నిలిచింది. అక్షయ్ కుమార్ ఏడాదికి రూ. 25 కోట్లకు పైగా పన్నులు చెల్లిస్తున్నట్లు సమాచారం.
దీపిక ప్రస్తుత కెరీర్ మ్యాటర్ కి వస్తే.. 'ప్రాజెక్ట్ కె' చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమా కోసం దీపిక దాదాపు రూ. 15 కోట్లు వసూలు చేసిందని కథనాలొచ్చాయి. దీపిక సహనటుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రూ. 150 కోట్ల పారితోషికాన్ని అందుకుంటున్నారని కూడా గుసగుసలు వినిపించాయి. హృతిక్ రోషన్ 'ఫైటర్'లో దీపిక నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం దీపిక రూ.20 కోట్లు అందుకుంటున్నట్టు కథనాలొచ్చాయి. అలాగే షారూఖ్ 'జవాన్'లో తన అతిథి పాత్ర కోసం దీపిక 6-8 కోట్ల మధ్య వసూలు చేసిందని టాక్ వినిపిస్తోంది. 'సింగం 3' .. 'ది ఇంటర్న్' చిత్రాల్లోను దీపిక నటిస్తోంది.