దేవర ప్రీరిలీజ్ ఈవెంట్.. ఫెయిల్ అయ్యిందెవరు? పాట్లు పడిందెవరు?

అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలెన్నో. అభిమానులు కత్తికి రెండు వైపు పదును ఉన్నోళ్లు. వారి విషయంలో ఎంతో కేర్ ఫుల్ గా ఉండాలి.

Update: 2024-09-23 03:39 GMT

అభిమాన నటుడ్ని చూడాలని.. అతడితో ఫోటో దిగాలని అనుకోని అభిమాని ఎవరైనా ఉంటారా? ఉరకలెత్తే ఉత్సాహంతో ఉండే అభిమానిని కంట్రోల్ చేయటం అంత తేలికైన విషయం కాదు. అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలెన్నో. అభిమానులు కత్తికి రెండు వైపు పదును ఉన్నోళ్లు. వారి విషయంలో ఎంతో కేర్ ఫుల్ గా ఉండాలి. అందునా.. అగ్రహీరోలుగా చెలామణీ అయ్యే వారు మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తూ.. ప్రతి మూడు.. నాలుగు నెలలకు ఒకసారి జనాల మధ్యకు వస్తే అదో పద్దతి.

చుక్కల్లో చంద్రుడి మాదిరి.. ఎప్పుడో పుష్కరానికి అన్నట్లుగా ఆచితూచి అన్నట్లు అడుగులు వేస్తున్న అగ్ర హీరోల పుణ్యమా అని.. ఒక సినిమాకు ఒక సినిమాకు మధ్య దూరం ఏడాది నుంచి రెండేళ్లకు పైనే పెరిగిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ చివరి చిత్రం ఆర్ఆర్ఆర్. ఇది విడుదలైంది 2022 మార్చి 24. అంటే.. ఇప్పటికి దాదాపు 30 నెలలు అన్న మాట. ఆర్ఆర్ఆర్ కు ముందు ఆయన మూవీ 2018లో ‘అరవింద సమేత వీర రాఘవ’ విడుదలైంది. అంటే.. అరవింద సమేత తర్వాత నాలుగేళ్లకు కానీ తారక్ మూవీ థియేటర్ లో విడుదల కాలేదు.

దాంతో పోలిస్తే.. ఈ రెండున్నరేళ్లు తక్కువ. ఇలా అప్పుడో సినిమా.. అప్పుడో సినిమా అన్నట్లుగా తీస్తున్న వారి కారణంగా అభిమానులు ముఖం వాచిపోయి ఉన్నారు. వారానికోసారి చికెన్ పెడితేనే వారానికి ఒకసారా? అనే పరిస్థితి. అలాంటిది ఏడాది పాటు ఆపేసి.. ఒక్కసారిగా చికెన్ పెడుతున్నామంటూ భారీ ఎత్తున ప్రకటనలు ఇచ్చి.. ఆ తర్వాత కూసింత ఇచ్చి సర్దుకోమంటే ఎలా ఉంటుంది?

దేవర ప్రీరిలీజ్ ఫంక్షన్ కూడా అదే మాదిరి తయారైంది. సాధారణంగా జూనియర్ ఎన్టీఆర్ సినిమా.. అది కూడా ఆర్ఆర్ఆర్ సూపర్ హిట్ తర్వాత వస్తున్న సినిమా అన్నప్పుడు దాని మీద అంచనాలు ఎంత భారీగా ఉంటాయో తెలిసిందే. అలాంటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కదా? దేవర ప్రీరిలీజ్ ఫంక్షన్ ను నోవాటెల్ లో నిర్వహించారు. అది కూడా లిమిటెడ్ గానే పాస్ లు జారీ చేశారు. వేలాది మంది పాల్గొనాల్సిన ఫంక్షన్ ను ఆచితూచి అన్నట్లుగా అనుమతులు ఇస్తే.. మిగిలిన వారి సంగతేంటి?

ఇలాంటి పరిస్థితుల్లో అనుమతించే కొద్దిమంది విషయంలోనూ కేర్ ఫుల్ గా ఉండాలి. భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయాలి. అరకిలోమీటర్ ముందే పాసులు ఉన్న వారిని మాత్రమే అనుమతించే పని చేస్తే అదో పద్దతిగా ఉండేది. అందుకు భిన్నంగా.. వచ్చే ప్రతి ఒక్కరు వేదిక గేటు వద్దకు వచ్చే అవకాశం ఇస్తే.. జనాలు పెరిగే కొద్దీ.. ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ చిన్న లాజిక్ ను ప్రీరిలీజ్ ఫంక్షన్ నిర్వాహకులు ఎలా మిస్ అయ్యారు. వేలాది మంది అభిమానుల్ని యాబై మంది పోలీసులు.. గుప్పెడంత మంది ప్రైవేటు సెక్యురిటీ ఏ మాత్రం కంట్రోల్ చేయగలదు.

అదే..ప్రీరిలీజ్ ఫంక్షన్ రచ్చ రచ్చగా మారటానికి కారణం. భారీగా వచ్చిన అభిమానుల్ని కంట్రోల్ చేయలేకపోవటం.. చేతులెత్తేయటంతో ఒక్కసారిగా అభిమానులు లోపలకుదూసుకెళ్లారు. అక్కడ వారికి ఇబ్బంది ఎదురు కావటంతో సీన్ మొత్తం రచ్చ రచ్చగా మారింది. కట్ చేస్తే.. ప్రవేశ ద్వారాల అద్దాలు పగిలిపోవటం మొదలు.. వేడక జరగాల్సిన వేదిక వద్ద చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలతో ఫంక్షన్ మొత్తం క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. అభిమానుల రద్దీని అంచనా వేసే విషయంలో దొర్లిన నిర్లక్ష్యం అందరికి శాపంగా మారింది. ఎన్నో ఆశలతో.. వ్యయప్రయాసలతో వచ్చిన వారంతా తీవ్ర నిరాశతో వెనక్కి తిరగాల్సి వచ్చింది. ఎప్పటిలానే అభిమానికి శిక్ష పడితే.. ఫెయిల్ అయిన నిర్వాహకులు క్షమాపణలు చెప్పేసి ఎంచక్కా జారుకున్నారు.

Tags:    

Similar News