దేవర.. కొంపతీసి అలా జరగదుగా!
బ్లాక్ బస్టర్ మూవీ ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చిన్న గ్యాప్ తీసుకుని ఇప్పుడు దేవర సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
బ్లాక్ బస్టర్ మూవీ ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చిన్న గ్యాప్ తీసుకుని ఇప్పుడు దేవర సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈపాటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను పలు కారణాల వల్ల అక్టోబర్ 10వ తేదీకి వాయిదా వేశారు మేకర్స్. అందుకు అనుగుణంగానే షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా లెవెల్ గ్రాండ్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని నార్త్ లో బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడానీ భారీగా రిలీజ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తారక్ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిపోయేలా అత్యధిక సెంటర్లలో దేవర విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. కాగా, ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఒక విషయం భయపెడుతోంది. అదేంటంటే?
టాలీవుడ్ లో ఎప్పటి నుంచో ఒక సెంటిమెంట్ కంటిన్యూ అవుతోంది. స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేసిన తర్వాత తీసే కొత్త మూవీ ఫ్లాప్ అవుతుంది! ఇప్పటికే ప్రభాస్, నాని విషయంలో ఇదే జరిగింది. ఎందుకంటే జక్కన్న తన చిత్రంలో హీరోను ఓ రేంజ్ లో చూపిస్తారు. ఆ తర్వాత ఆయా నటుల చిత్రాలపై భారీ అంచనాలు నెలకొంటాయి. వాటిని అందుకోలేక ఆ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి.
ఇక రామ్ చరణ్.. ఆర్ఆర్ఆర్ తర్వాత తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఆచార్య సినిమా చేశారు. కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలింది. దీంతో ఆ సెంటిమెంట్ కు మరింత బలం చేకూరింది. ప్రస్తుతం చరణ్.. గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్నారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ దేవర సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆయన ఫ్యాన్స్ ఆ సెంటిమెంట్ విషయంలో కాస్త ఆందోళనకు గురవుతున్నారు.
అలా జరగకుండా చూడాలని కొరటాల శివకు రిక్వెస్ట్ చేస్తున్నారు. సినిమా విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇక ఆచార్యతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కొరటాల శివ.. దేవరతో గట్టి హిట్ కొట్టాలని ట్రై చేస్తున్నారు. మరి దేవర సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి హిట్ కొడుతుందో, రాజమౌళి సెంటిమెంట్ ను తారక్ బ్రేక్ చేస్తారో లేదో తెలియాలంటే అక్టోబర్ 10వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.