ఏపీ డిప్యూటీ సాబ్ తో దిల్ రాజు.. విషయమేమిటంటే?

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. కొద్దిరోజులుగా బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.

Update: 2024-12-30 07:33 GMT

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. కొద్దిరోజులుగా బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ ఛైర్మన్ గా తన బర్త్ డే నాడు బాధ్యతలు స్వీకరించిన దిల్ రాజు.. ఆ తర్వాత తాను నిర్మిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ కోసం అమెరికా వెళ్లి వచ్చారు.


ఇటీవల దాదాపు 50 మంది సినీ ప్రముఖులతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు దిల్ రాజు. అదే సమయంలో గేమ్ ఛేంజర్ రిలీజ్ ఏర్పాట్లను కూడా చూసుకుంటున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన స్టార్ హీరో రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ విడుదల కానున్న విషయం తెలిసిందే.


ఇప్పుడు విజయవాడలో ఉన్న దిల్ రాజు.. వజ్రా మైదానంలో 256 అడుగుల రామ్‌ చరణ్‌ భారీ కటౌట్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో గేమ్ ఛేంజర్ కోసం మాట్లాడారు. జనవరి 4 లేదా 5 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ లో గేమ్ ఛేంజర్ ఈవెంట్ ను నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.


అందుకోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలుస్తానని, ఆయన ఇచ్చిన డేట్ ప్రకారం నిర్వహిస్తామని చెప్పారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం పవన్‌ తో భేటీ అయ్యారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్‌ ను దిల్ రాజు కలిశారు. పలు విషయాలపై ఇద్దరూ కాసేపు చర్చించుకున్నారు.

ఏపీలో నిర్వహించనున్న గేమ్ ఛేంజర్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా పవన్ ను ఆహ్వానించారు దిల్ రాజు. దానికి పవన్ ను కూడా ఓకే చెప్పారు. తప్పక హాజరవుతానని తెలిపారు. ఈ మేరకు గేమ్ ఛేంజర్ మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. పవన్ కళ్యాణ్ కు స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. ఫోటో కూడా పోస్ట్ చేశారు.

ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెగా ఫ్యాన్స్ ఓ రేంజ్ లో హ్యాపీగా ఫీలవుతున్నారు. బాబాయ్- అబ్బాయ్ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నట్లు చెబుతున్నారు. అదే ఈవెంట్ కు మెగాస్టార్ హాజరవ్వనున్నారని, ఆ ఫ్యామిలీ వారసులు కూడా రానున్నట్లు ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. అదే కనుక నిజమైతే ఫ్యాన్స్ కు పెద్ద పండగే.. మరేం జరుగుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News