డైరెక్టర్స్ డే వేడుకల వాయిదా వెనక మతలబు?
దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏడాది మే 4 న డైరెక్టర్స్ డే గా జరుపుకుంటున్నారు.
మే 4న తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎల్.బి స్టేడియంలో ఘనంగా నిర్వహించతలబెట్టిన `డైరెక్టర్స్ డే` సెలెబ్రేషన్స్ వాయిదా పడ్డాయి. ప్రముఖ నాయకులకు సంబంధించిన ఇతర కార్యక్రమాలు, షెడ్యూళ్ల కారణంగా తమ వేడుకలకు పోలీసులు అనుమతులు రద్దు చేసారని తాజాగా దర్శకసంఘం ఒక ప్రకటనలో వెల్లడించింది.
దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏడాది మే 4 న డైరెక్టర్స్ డే గా జరుపుకుంటున్నారు. గత 5 సంవత్సరాలుగా ఈ వేడుకల్ని నిర్వహిస్తున్న విషయం విదితమే . మరో రెండు రోజులలో ఈ కార్యక్రమం జరగాల్సి ఉండగా వాయిదా తప్పలేదని, కొత్త తేదీని తెలియచేస్తామని తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వీరశంకర్, జనరల్ సెక్రటరీ సి.హెచ్. సుబ్బారెడ్డి సంయుక్త ప్రకటనలో తెలియజేసారు.
దర్శకరత్న డా.దాసరి నారాయణరావు జ్ఞాపకార్థం.. మే 4 ఆయన జయంతి సందర్భంగా ఈసారి దర్శకసంఘం గట్టి ప్రణాళికతో ముందుకు వచ్చింది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో భారీగా జరిగే జయంతి ఉత్సవాల్లో దాసరి పేరుతో నిధిని సేకరించి ప్రతిభావంతులైన ఔత్సాహిక దర్శకులను కష్టాల్లో ఆదుకునేందుకు ప్లాన్ చేసిన సంగతి విధితమే . జయంతి రోజున నిర్వహించే భారీ వేడుకకు ఇండస్ట్రీ దిగ్గజ దర్శకులు సహా ప్రముఖులంతా హాజరుకానున్నారు. కె.రాఘవేంద్రరావు, పూరి జగన్నాథ్, రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ వంటి ప్రముఖ దర్శకులంతా ఈ వేడుకను పరిపుష్టం చేయనున్నారు. అలాగే ఇదే వేదికపై భారీగా విరాళాల సేకరణ ఉంటుంది.
ఈసారి దాసరి బర్త్ డేని రొటీన్ గా కాకుండా డైరెక్టర్స్ డేని స్పెషల్ గా ప్లాన్ చేయడం వెనక ఇలాంటి సముచితమైన ఆలోచన ఉంది. ఇప్పటికే డార్లింగ్ ప్రభాస్ దర్శకసంఘం కోసం 35లక్షల విరాళం ప్రకటించారు. అతడి స్ఫూర్తితో ఇతర స్టార్లు కూడా భారీగా విరాళాలు ప్రకటించే వీలుందని అంచనా.