దుల్కర్.. సడన్ యూటర్న్?
దిగ్గజ దర్శకుడు మణిరత్నంతో ఒకప్పుడు సౌత్ స్టార్ హీరోలందరూ కచ్చితంగా సినిమా చేయాలని అనుకునేవారు
దిగ్గజ దర్శకుడు మణిరత్నంతో ఒకప్పుడు సౌత్ స్టార్ హీరోలందరూ కచ్చితంగా సినిమా చేయాలని అనుకునేవారు. బాలీవుడ్ నటులు కూడా ఆయనతో మూవీ అంటే ఇంట్రెస్ట్ చూపించేవారు. కానీ ఇప్పుడు సీన్ మారినట్లు వార్తలు వస్తున్నాయి. మణిరత్నం లేటెస్ట్ ప్రాజెక్ట్ థగ్ లైఫ్ నుంచి యంగ్ హీరోలంతా తప్పుకున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కమల్ హాసన్ హీరోగా నటిస్తుండగా.. సీనియర్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది.
పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కమల్ తో పాటు యంగ్ హీరోలు జయం రవి, దుల్కర్ సల్మాన్ కీలక పాత్రలు పోషిస్తున్నట్లు కొన్ని నెలల క్రితం మూవీ యూనిట్ ప్రకటించింది. డేట్స్ ఇష్యూతో పాటు పలు కారణాల వల్ల వారిద్దరూ ఒకరి తర్వాత మరొకరు తప్పుకున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. దీంతో వారి రోల్స్ కోసం కార్తి, శింబు, విజయ్ సేతుపతితో పాటు చాలా మంది పేర్లను మేకర్స్ పరిశీలించినట్లు తెలుస్తోంది.
తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి కొత్త అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దుల్కర్ సల్మాన్, జయం రవి ఈ ప్రాజెక్టుకు మళ్లీ తిరిగి వచ్చారని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్. శింబు కూడా ఈ సినిమాలో నటిస్తారని, డ్యుయెల్ రోల్ లో కనిపించనున్నారని టాక్. దాదాపు 200 కోట్ల బడ్జెట్తో థగ్ లైఫ్ మూవీ తెరకెక్కుతున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి, గౌతమ్ కార్తీక్, నాజర్ తో పాటు పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ఈ మూవీ కోసం 35 ఏళ్ల తర్వాత కమల్ హాసన్, మణిరత్నం చేతులు కలిపారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన నాయకుడు.. కోలీవుడ్ కల్ట్ క్లాసిక్ మూవీగా నిలిచింది.
నాయకుడు తర్వాత కమల్ హాసన్ తో మళ్లీ మణిరత్నం సినిమాలు చేయలేకపోయారు. ఇప్పుడు థగ్ లైఫ్ లో కమల్ ను నెగిటివ్ షేడ్స్ లో మణిరత్నం చూపించనున్నారని అంటున్నారు. కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు కూడా చెబుతున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన కమల్ లుక్, గ్లింప్స్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో వేచి చూడాలి.