హ‌వాలా కేసు: ప్ర‌ముఖ న‌టిపై ED విచార‌ణ‌

ఇమెయిల్ లేదా ప్రతినిధి ద్వారా స్పందించాలని ఈడీ వారిని కోరింది.

Update: 2024-12-19 07:09 GMT

ఇటీవ‌ల సెల‌బ్రిటీల పేర్లు మ‌నీలాండ‌రింగ్ కేసుల్లో తెర‌పైకొస్తున్నాయి. బాలీవుడ్ నిర్మాత‌, బిజినెస్‌మేన్ రాజ్ కుంద్రా మ‌నీలాండ‌రింగ్‌కు పాల్ప‌డ్డార‌ని ఈడీ(ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్) ఫిర్యాదు చేసింది. ఈ కేసు విచార‌ణ‌లో ఉంది. ఇప్పుడు ఇదే త‌ర‌హాలో మ‌నీలాండ‌రింగ్ కేసుతో సంబంధాలున్నాయంటూ బాలీవుడ్ న‌టి మ‌ల్లికా శెరావ‌త్, పూజా బెన‌ర్జీ పేర్లు వినిపిస్తున్నాయి. ఓ బెట్టింగ్ వెబ్‌సైట్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈ ఇద్ద‌రినీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రశ్నించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇమెయిల్ లేదా ప్రతినిధి ద్వారా స్పందించాలని ఈడీ వారిని కోరింది.


పురుషుల టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లను ఎలాంటి హ‌క్కులు లేకుండానే అక్రమంగా ప్రసారం చేసిన పాకిస్థానీ బెట్టింగ్ వెబ్‌సైట్‌(మ్యాజిక్‌విన్ పోర్టల్‌)తో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో వారి నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వాంగ్మూలాలను నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ దర్యాప్తులో భాగంగా ఢిల్లీ, ముంబై, పూణేలలో పోలీసులు ఆధారాల్ని సేక‌రిస్తున్నారు.

తాజాగా అందిన స‌మాచారం మేర‌కు మ‌ల్లిక‌ అహ్మదాబాద్ కార్యాలయానికి ప్రతినిధిని పంపారు. అలాగే ఇమెయిల్ ద్వారా స‌మాధానం పంపారు. బెనర్జీ వ్యక్తిగతంగా హాజరై మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) కింద ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. మ‌ల్లిక బాలీవుడ్ స‌హా సౌత్ ప‌రిశ్ర‌మ‌ల్లో న‌టించింది. హాలీవుడ్ లోను హిస్ అనే చిత్రంలో నటించింది. పూజా బెనర్జీ టీవీ షో `కసౌతి జిందగీ కే`లో నటించింది. ఈ ఇద్ద‌రూ మ్యాజిక్‌విన్‌ను ప్రమోట్ చేశారని సోర్సెస్ సూచిస్తున్నాయి. విచారణలో భాగంగా మరికొంతమంది ప్రముఖులను ప్రశ్నించేందుకు ఈడీ సిద్ధ‌మవుతోంది. `మ్యాజిక్ విన్ లాంచ్ పార్టీ` పేరుతో ప‌లువురు బాలీవుడ్ ప్రముఖులు వీడియోషూట్ లు, ఫోటో షూట్‌లు కూడా చేసి సోషల్ మీడియాల‌లో ప్రమోషన్స్ చేసారు. మ‌హారాష్ట్ర, గుజరాత్ లాంటి చోట‌ హోర్డింగ్‌లపైనా ప్ర‌క‌ట‌న‌లు ప్రదర్శించారు. వీట‌న్నిటిపైనా అన్ని కోణాల్లో విచార‌ణ సాగుతోంది.

అహ్మదాబాద్ పోలీస్ సైబర్ క్రైమ్ బ్రాంచీ లో వారిపై ఎఫ్ఐఆర్ న‌మోదైంది. గేమింగ్ పోర్టల్‌గా మారువేషంలో ఉన్న మ్యాజిక్‌విన్ అనే బెట్టింగ్ వెబ్‌సైట్ పాకిస్థాన్ జాతీయుల యాజమాన్యంలో ఉందని, దుబాయ్‌లో భారతీయులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఈడీ పేర్కొంది. బెట్టింగ్ ఆట‌గాళ్లు డిపాజిట్ చేసిన డబ్బును షెల్ ఖాతాల ద్వారా జమ చేసినట్లు విచారణలో తేలింది. హవాలా ద్వారా దుబాయ్‌కి డ‌బ్బు చేరుకుంది. క్రిప్ట్ క‌రెన్సీలోను పెట్టుబ‌డి పెట్టారు. ఈ బెట్టింగ్ వెబ్‌సైట్‌లు మొత్తం ఆటగాళ్ల‌ డిపాజిట్‌లలో 50శాతం పైగా లాభంగా ఆర్జిస్తున్నాయని ఈడీ విచార‌ణ‌లో తేలింది.

Tags:    

Similar News