ఆస్పత్రిలో షూటింగ్.. చిక్కుల్లో ఫహాద్!
ఇప్పుడు సీక్వెల్ లో ఆయన పాత్ర కీలకంగా ఉండబోతోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప మూవీతో మాలీవుడ్ నటుడు ఫహాద్ ఫాజిల్ టాలీవుడ్ సినీ ప్రియులకు దగ్గరైన విషయం తెలిసిందే. ఆ సినిమాలో ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ గా కనిపించిన ఫహాద్.. తన యాక్టింగ్ తో అలరించారు. కొద్దిసేపే ఆయన రోల్ ఉన్నా.. మంచి క్రేజ్ దక్కించుకున్నారు. ఇప్పుడు సీక్వెల్ లో ఆయన పాత్ర కీలకంగా ఉండబోతోంది. రీసెంట్ గా ఆయన షూటింగ్ పార్ట్ కూడా కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది.
ఇటీవల ఆవేశం మూవీతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు ఫహాద్. అయితే ఓవైపు నటిస్తూనే.. మరోవైపు మూవీలు నిర్మిస్తున్నారు. చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న ఫహాద్.. ప్రస్తుతం పింకేలీ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. కేరళ మానవ హక్కుల సంఘం కూడా ఆగ్రహం వ్యక్తం చేసి.. సుమోటోగా కేసు నమోదు చేసింది. అసలేం జరిగిందంటే?
పింకేలీ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అందులో భాగంగా అంగమలైలోని ఎర్నాకులం గవర్నమెంట్ హాస్పిటల్ లో షూట్ చేశారు మేకర్స్. గురువారం రాత్రంతా ఆస్పత్రిలో షూటింగ్ జరిగింది. దీంతో అక్కడ ఉన్న పేషెంట్లు ఇబ్బందులు పడినట్లు తెలుస్తోంది. ఎమర్జెన్సీ రూమ్ లో కూడా షూట్ చేశారట మేకర్స్. ఆ సమయంలో ఎవరినీ కూడా లోపలికి అనుమతించలేదని వార్తలు వస్తున్నాయి.
పేషెంట్ కు ఆపరేషన్ జరుగుతుండగా.. సినిమా షూట్ చేశారని కూడా ఆరోపణలు వస్తున్నాయి. దీని వల్ల రోగులు చాలా ఇబ్బంది పడ్డారని టాక్ వినిపిస్తోంది. ఎమర్జెన్సీ వార్డులోకి తమను పంపకుండా అడ్డుకున్నారని కొందరు చెబుతున్నారు. అయితే అసలు ఆసుపత్రి అత్యవసర విభాగంలో సినిమా షూటింగ్ కు పర్మిషన్ ఎలా ఇచ్చారని జిల్లా వైద్యాధికారి బీనా కుమారి ఫుల్ సీరియస్ అయ్యారు. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇప్పుడు కేరళ మానవ హక్కుల సంఘం.. ఈ విషయాన్ని సుమోటోగా తీసుకుంది. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మేకర్స్ పై కేసు పెట్టింది. ఫహాద్ ఫాజిల్ పేరును కూడా యాడ్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన త్వరలోనే వారికి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే షూటింగ్ కోసం రూ.10000 ఇచ్చామని మేకర్స్ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. మరి వీటన్నింటిపై ఫహాద్ ఫాజిల్ ఇప్పటి వరకు స్పందించలేదు. మరేం జరుగుతుందో చూడాలి.