అనుష్క ఘాటీ.. సౌండ్ చేసేదెప్పుడు?
ఇప్పుడు అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న ఘాటీ మూవీ కూడా ప్రేక్షకుల్లో మంచి హైప్ క్రియేట్ చేసుకుంది.;
అనుష్క శెట్టి చేసిన ప్రతి సినిమాకి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. నటనలో ఉండే నేచురల్ ఫీలింగ్, స్టోరీ సెలెక్షన్ చూసిన అభిమానులు అమ్మడి సినిమా కోసం ఎప్పుడూ ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న ఘాటీ మూవీ కూడా ప్రేక్షకుల్లో మంచి హైప్ క్రియేట్ చేసుకుంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ విడుదలైనప్పుడే ఆసక్తిని పెంచింది. కానీ ఇప్పుడు సినిమా రిలీజ్ దగ్గర పడుతున్నా ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ మౌనంగా ఉండటం హాట్ టాపిక్ గా మారింది.
సాధారణంగా అనుష్క లాంటి స్టార్ హీరోయిన్ ఒక సినిమా చేస్తే, దాని ప్రమోషన్స్ మామూలుగా ఉండవు. బాహుబలి తర్వాత అనుష్క చేసిన ప్రతి సినిమాకీ ఓ ప్రత్యేకమైన ప్రచారం ఉండేది. కానీ ఘాటీ విషయంలో ఇప్పటివరకు పెద్దగా ప్రచారం జరగకపోవడం అభిమానులను కాస్త అసహనానికి గురిచేస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం ఈ సినిమా కథలో అనుష్క చాలా పవర్ఫుల్ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. నేరస్తురాలిగా మారిన ఓ బాధితురాలి కథను స్పష్టంగా చూపించనున్నట్లు టాక్.
ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా పూర్తయింది. క్రిష్ తన స్పీడ్ వర్క్‌తో మంచి గుర్తింపు అందుకున్నాడు. గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి హిస్టారికల్ మూవీని తక్కువ సమయంలోనే ఫినిష్ చేసిన క్రిష్, ఇప్పుడు ఘాటీ ని కూడా అదే స్పీడులో కంప్లీట్ చేశాడు. మధ్యలో హరిహర వీరమల్లు చేసినా పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ కారణంగా ఆలస్యం అవుతూ వచ్చింది. ఇక ఆ సినిమా నుంచి సైలెంట్ గా బయటకు వచ్చి అనుష్కతో ఘాటీ సినిమాను సెట్స్ పైకి తెచ్చాడు క్రిష్.
కానీ షూటింగ్ ఫినిష్ అయినప్పటి నుంచి ప్రమోషన్లపై మేకర్స్ నుంచి స్పందన లేకపోవడంతో రకరకాల గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి. ఇక మేకర్స్ లేటెస్ట్ ప్లాన్ ప్రకారం, అనుష్క మార్చి మిడ్ నుండి లేదా ఏప్రిల్ ప్రారంభంలో ప్రమోషన్స్ మొదలుపెట్టనున్నట్లు సమాచారం. ఆమె సినిమా ప్రమోషన్‌లో భాగంగా పలు ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్స్‌లో పాల్గొనవచ్చని తెలుస్తోంది.
అయితే ఇప్పటివరకు అధికారిక అప్డేట్ మాత్రం లేదు. ఇప్పటికే ఘాటీ ఓటీటీ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసిందని వార్తలు వచ్చాయి. థియేట్రికల్ బిజినెస్ లో కూడా మంచి డీల్స్ దక్కినట్లు తెలుస్తోంది. ఇక సినిమాను ఏప్రిల్ 18న రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఈక్రమంలో ప్రమోషన్ డోస్ పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి ఈసారి అనుష్క తన నటనతో ఎలాంటి థ్రిల్ ను ఇస్తుందో చూడాలి.