APలో ఫిలిం స్టూడియోలు నైపుణ్య శిక్ష‌ణ‌కు ప‌వ‌న్ పిలుపు

ఏపీలో సినీప‌రిశ్ర‌మ అభివృద్ధికి ప్ర‌భుత్వం సానుకూలంగా ఉంద‌ని ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ సంకేతాలిచ్చారు.

Update: 2025-01-05 07:46 GMT

ఏపీలో సినీప‌రిశ్ర‌మ అభివృద్ధికి ప్ర‌భుత్వం సానుకూలంగా ఉంద‌ని ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ సంకేతాలిచ్చారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌తిభను చిన్న చూపు చూడొద్ద‌ని ఆయ‌న‌ అన్నారు. ఆదివారం సాయంత్రం రాజ‌మండ్రిలో జ‌రిగిన 'గేమ్ ఛేంజ‌ర్' ప్రీరిలీజ్ వేదిక‌పైనా ఆయ‌న మాట్లాడుతూ- ఆంధ్రప్రదేశ్ లో స్టూడియోలు నిర్మించాల‌ని, ప్ర‌తిభ‌ను ప్రోత్స‌హించేందుకు నిపుణులు ముందుకు రావాల‌''ని అన్నారు. 24 క్రాఫ్ట్స్ లో ఏపీ యువ‌త‌కు శిక్ష‌ణ ఇవ్వాల‌ని కూడా సూచించారు. త్రివిక్రమ్, రాజమౌళి, తమన్ లాంటి అనుభ‌వ‌జ్ఞుల‌ స‌హ‌కారం ప‌రిశ్ర‌మ‌కు అవ‌స‌ర‌మ‌ని కూడా ప‌వ‌న్ అన్నారు.

గేమ్ ఛేంజ‌ర్ వేదిక‌పై ఉన్న‌ తెలంగాణ ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ప్రెసిడెంట్‌ అయిన దిల్‌రాజుకు ప‌వ‌న్ ఒక సూచ‌న కూడా ఇచ్చారు. యువ‌త‌రంలో శ‌క్తిని వెలికి తీసేలా 24 శాఖ‌ల‌కు సంబంధించి త‌గిన శిక్ష‌ణ ఇవ్వాల‌ని ప్రీరిలీజ్ వేదిక‌పై సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ను చిన్నచూపు చూడకండి. తెలుగు చిత్ర పరిశ్రమ అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో అద్భుతంగా ఉండాలని ప‌వ‌న్ ఆకాంక్షించారు.

యువతలో శక్తిని స‌ద్వినియోగం చేయాల‌ని, రాష్ట్రంలో పలు చోట్ల స్టంట్‌ స్కూల్స్ పెట్టాల‌ని కూడా ప‌వ‌న్ అన్నారు. సినీ పరిశ్రమలోని అనుభ‌వ‌జ్హులు ప్ర‌తిభావంతుల సాయంతో యువతలో నైపుణ్యాభివృద్ధిని పెంచాల‌ని సూచించారు. దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్‌లాంటి వ్యక్తులను తీసుకొచ్చి స్క్రిప్ట్, స్క్రీన్‌ప్లే తదితర విషయాలపై క్లాస్‌లు తీసుకోమనాల‌ని సూచించారు. కీరవాణి, తమన్‌లాంటి వాళ్ల ద్వారా సంగీతంపై అవగాహన పెంచండని కోరారు.

స్టూడియోలు నిర్మించండి:

ఇదే వేదిక‌పై ప‌రిశ్ర‌మ వ్య‌క్తుల‌ను కోరుతూ స్టూడియోలు పెట్టండని ప‌వ‌న్ కోరారు. 24 క్రాఫ్ట్‌లకు సంబంధించిన విషయాలు నేర్పండి. ప్రొడక్షన్‌ డిజైన్‌కు సంబంధించిన స్కూల్స్‌ పెట్టండి. నేను టీవీ ప‌రిశ్ర‌మ‌ను కూడా ఎప్పుడూ చిన్న చూపులేదని కూడా ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. ఏపీలో సినీటూరిజం అభివృద్ధి చెందాల‌ని కూడా అన్నారు.

ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ సూచించిన‌వి అన్నీ జ‌ర‌గాలంటే మెగా కుటుంబ‌మే పూనుకోవాల‌ని కొంద‌రు విశ్లేషిస్తున్నారు. ఏపీలో యూత్ కి 24 శాఖ‌ల శిక్ష‌ణ ఇవ్వాలి అంటే క‌చ్ఛితంగా పూణే త‌ర‌హా ఫిలింఇనిస్టిట్యూట్ ని ఏపీ ప్ర‌భుత్వ‌మే భారీగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీనికి డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ స్వయంగా పూనుకోవాల్సి ఉంటుందని కూడా సూచిస్తున్నారు.

Tags:    

Similar News