జర్నలిస్టుకు మెగా కేరింగ్.. ఫిలింక్రిటిక్స్ అభినందన!
కరోనా క్రైసిస్ కష్టకాలంలో అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం మెగాస్టార్ చిరంజీవి ఏ విధంగా సహాయం చేసారో చూశాం
కరోనా క్రైసిస్ కష్టకాలంలో అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం మెగాస్టార్ చిరంజీవి ఏ విధంగా సహాయం చేసారో చూశాం. ఆయన అందరివాడుగా అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్నారు. ఆస్పత్రుల బెడ్స్ నుంచి ఆక్సిజన్ ఏర్పాట్ల వరకూ ప్రతి అవసరంలో సహాయపడ్డారు. పరిశ్రమ కార్మికుల కోసం నిత్యవాసర సరుకులను అందించారు. వారితో పాటు సినీజర్నలిస్టుల కుటుంబాలను కష్టంలో ఆదుకున్నారు. వారికి నిత్యావసరాలు అందించడమే గాక, కరోనా సమస్యలు ఉన్నాయంటే ఆస్పత్రి వర్గాలతో మాట్లాడి సహకరించారు. చాలామందికి నేరుగా ఆర్థిక సహాయం కూడా చేసారు.
మెగా సేవలు అక్కడితో ఆగిపోలేదు. నిరంతరాయంగా కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ప్రముఖ సీనియర్ సినీజర్నలిస్టుకు గుండె సంబంధిత సమస్య ఉందని, దీనికి యాంజియో గ్రామ్ చేసి బైపాస్ సర్జరీ చేయాలని వైద్యులు సూచించారు. సెకండ్ ఒపీనియన్ కోసం చిరంజీవి గారిని సంప్రదించగా.. ఆయన వెంటనే స్టార్ హాస్పటల్ డాక్టర్స్ ని సంప్రదించి అడ్మిషన్ సహా అన్ని విషయాల్లో కేర్ తీసుకున్నారు. డాక్టర్స్ కు ఎప్పటికప్పుడు ఫోన్ చేసి ఆరా తీస్తూ అన్నివిధాలా కేర్ తీసుకున్నారని జర్నలిస్ట్ కుటుంబీకులు వెల్లడించారు.
స్టార్ హాస్పిటల్స్ డా.రమేష్ అండ్ టీమ్ క్షుణ్ణంగా పరిశీలించి బైపాస్ సర్జరీ చేయాల్సిన పని లేకుండా స్టెంట్స్‌తో సమస్యను పరిష్కరించారు. ఈ సోమవారం నాడు డిశ్చార్జ్ చేస్తున్నారు. ఆస్పత్రిలో చేర్చడం నుంచి పూర్తిగా కోలుకుని ఇంటికి చేరుకునే వరకూ అవసరమైన అన్నిరకాల జాగ్రత్తలను మెగాస్టార్ స్వయంగా పర్యవేక్షించి కేర్ తీసుకున్నారని జర్నలిస్ట్ కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ సందర్భంగా కుటుంబీకులతో పాటు సినీజర్నలిస్టు కుటుంబ సభ్యులు చిరుకు కృతఙ్ఞతలు తెలియజేసారు. ముఖ్యంగా ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ వాట్సాప్ గ్రూప్ లో మెగాస్టార్ కి కృతజ్ఞతాభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కష్టంలో నేనున్నాను అంటూ ఆదుకునే మెగాస్టార్ మంచితనానికి ధన్యవాదాలు చెప్పడానికి జర్నలిస్టులంతా ఒకరికొకరు పోటీపడ్డారు. సీనియర్ జర్నలిస్ట్ రెగ్యులర్ టెస్టుల్లో భాగంగా ముందే టెస్ట్ ల ద్వారా సమస్యను కనుగొని పెద్ద ప్రమాదం నుండి బయట పడ్డారు. వారం విశ్రాంతి తరువాత మళ్లీ వారు విధుల్లో యథాతథంగా కొనసాగుతారని తెలుస్తోంది. ఈ సందర్భంగా ఫిలింక్రిటిక్స్ లో హెల్త్ ఇన్సూరెన్స్ తక్షణ ఆవశ్యకత గురించి విస్త్రతంగా చర్చ జరుగుతోంది.