గేమ్ ఛేంజర్ చెన్నై ఈవెంట్ రద్దైందా? అదే కారణమా?
తమిళ సినీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ కు , శంకర్ కు మధ్య ఉన్న చిన్నపాటి వివాదం కారణంగా ఈవెంట్ ను మేకర్స్ రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోలోగా నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్ సంక్రాంతి కానుకగా మరో నాలుగు రోజుల్లో విడుదల కానున్న విషయం తెలిసిందే. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఆ సినిమా.. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండనున్నట్లు ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ ద్వారా క్లారిటీ వచ్చేసింది.
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందిన గేమ్ ఛేంజర్.. జనవరి 10వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కానుంది. శంకర్ కోలీవుడ్ డైరెక్టర్ అవ్వడం.. ఆర్ఆర్ఆర్ తో చరణ్ మంచి క్రేజ్ సంపాదించుకోవడంతో తమిళనాడులో సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. మంచి వసూళ్లు కూడా వస్తాయని ఆశిస్తున్నారు.
అయితే ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే మేకర్స్.. తెలుగు రాష్ట్రాల్లో ఈవెంట్స్ ను నిర్వహించారు. నార్త్ లో సందడి చేశారు. అదే సమయంలో తమిళనాడులో రేపు భారీ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. చెన్నై వేదికగా ఏర్పాటు చేసిన ఆ కార్యక్రమానికి పలువురు కోలీవుడ్ సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా వస్తారని టాక్ వినిపించింది.
కానీ ఇప్పుడు చెన్నై ఈవెంట్ రద్దు అయినట్లు వార్తలు వస్తున్నాయి. అన్ని ఏర్పాట్లు పూర్తయినప్పటికీ మేకర్స్ నిలిపివేశారని సమాచారం. తమిళ సినీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ కు , శంకర్ కు మధ్య ఉన్న చిన్నపాటి వివాదం కారణంగా ఈవెంట్ ను మేకర్స్ రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అసలేం జరిగిందంటే?
కోలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ లైకా ప్రొడక్షన్స్ సంస్థ.. తమిళనాడులో గేమ్ ఛేంజర్ ను రిలీజ్ కాకుండా చర్యలు తీసుకోవాలని తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ను రీసెంట్ గా ఆశ్రయించింది. తన చేతిలో ఉన్న ఇండియన్ 3 చిత్రాన్ని డైరెక్టర్ శంకర్ పూర్తి చేసే వరకు.. గేమ్ ఛేంజర్ ను రిలీజ్ చేయడానికి వీలు లేదని డిమాండ్ చేసింది.
అయితే ఇండియన్-3 షూటింగ్ పూరైనట్లు ఇప్పటికే హీరో కమల్ హాసన్ తెలిపారు. కేవలం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ ఉందన్నారు. గేమ్ ఛేంజర్ కోసం ఆ సినిమాను శంకర్ జస్ట్ పక్కన పెట్టారు. ఇప్పుడు ఆ మూవీని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ కొత్త డిమాండ్ ను తెరపైకి తీసుకొచ్చింది. అయితే వారి వాదన లీగల్ గా నిలిచే ఛాన్స్ లేదని సమాచారం. దీంతో మూవీ అనుకున్న తేదీకి రిలీజ్ కానుందని తెలుస్తోంది. కానీ ఎందుకో మేకర్స్ ఈవెంట్ ను మాత్రం రద్దు చేశారని వినికిడి.