'గేమ్ చేంజర్' పై పైరసీ కుట్ర.. ఏం జరిగిందంటే?
సంక్రాంతి కానుకగా విడుదలైన రామ్ చరణ్, శంకర్ గేమ్ చేంజర్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే.
సంక్రాంతి కానుకగా విడుదలైన రామ్ చరణ్, శంకర్ గేమ్ చేంజర్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. కానీ సినిమా విడుదల రోజే ఈ చిత్రానికి సంబంధించిన HD పైరసీ ప్రింట్ లీక్ కావడం కలకలం రేపింది. చిత్ర బృందానికి ఇది గట్టి ఎదురుదెబ్బగా మారింది. కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నష్టపరిచేలా పైరసీ ముఠా వ్యవహరించడం తీవ్ర చర్చనీయాంశమైంది.
చిత్ర బృందం సమాచారం ప్రకారం, గేమ్ చేంజర్ విడుదలకు ముందు నుండి కొన్ని బెదిరింపులు వచ్చాయట. ఓ ముఠా సభ్యులు తమ డిమాండ్లు నెరవేర్చకపోతే సినిమా పైరసీ ప్రింట్ విడుదల చేస్తామంటూ హెచ్చరించారు. మొదటగా కొన్ని కీలక సన్నివేశాలు సోషల్ మీడియాలో లీక్ చేయడం, తరువాత సినిమా విడుదలైన రోజే హై క్వాలిటీ ప్రింట్‌ను ఆన్‌లైన్‌లో షేర్ చేయడం జరిగింది. ఈ లీక్ కారణంగా చిత్రం బాక్సాఫీస్ వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపుతుందనే భయం నిర్మాతలను ఆందోళనకు గురిచేస్తోంది.
సినిమా విడుదల రోజు తెల్లవారుజామునే టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపుల్లో ఈ పైరసీ ప్రింట్ విస్తరించడంతో చిత్ర బృందం వెంటనే స్పందించింది. సోషల్ మీడియాలో ‘గేమ్ చేంజర్’పై ప్రతికూలతలు పెరుగుతుండటంతో, వీటిని నియంత్రించేందుకు టీమ్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. పైరసీ వెనుక సుమారు 45 మంది ఉన్నట్లు ఆధారాలు లభించాయని, వారి మీద కేసు నమోదు చేసినట్లు సైబర్ క్రైమ్ అధికారులు వెల్లడించారు.
ఈ ముఠా సభ్యులు మాత్రమే పైరసీకి కారణమా, లేక వీరి వెనుక మరెవరైనా ఉన్నారా అనేది సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తక్కువ సమయంలోనే ఆన్‌లైన్‌లో వీడియోలు, కీలకమైన సన్నివేశాలు లీక్ కావడం వల్ల సినిమా ప్రతిష్ట దెబ్బతినే ప్రమాదం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. సోషల్ మీడియాలో సినిమాపై విస్తృతంగా నెగెటివిటీ స్ప్రెడ్ చేసిన పేజీలను కూడా పోలీసులు నిర్బంధంలోకి తీసుకోనున్నట్లు సమాచారం.
గేమ్ చేంజర్ పై జరిగిన ఈ చర్యలు టాలీవుడ్ పరిశ్రమలో పెద్ద సంచలనం సృష్టించాయి. బడ్జెట్ పరంగా భారీగానే ఉంటూ, ప్రతిష్టాత్మక దర్శకుడు శంకర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమాకు ఇలాంటి ఇబ్బందులు ఎదురుకావడం బాధాకరమని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. పైరసీతో చిత్ర బృందానికి జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు వారు చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది.