మాస్టర్ మెగా ఫోన్ పడితే..!
టాలెంట్ ఎవడి సొత్తు కాదు.. ముఖ్యంగా సినీ పరిశ్రమలో ప్రతిభ ఎంత అన్నది చెప్పడానికి కొలమానం లేదు
టాలెంట్ ఎవడి సొత్తు కాదు.. ముఖ్యంగా సినీ పరిశ్రమలో ప్రతిభ ఎంత అన్నది చెప్పడానికి కొలమానం లేదు. కొందరు ఒక పని కోసం వచ్చి మరో పనిచేస్తుంటారు. కొందరు తమకు వచ్చిన పనితో పాటు మరో పనిలో కూడా ఇన్వాల్వ్ అవుతుంటారు. మూవీ ఇండస్ట్రీలో ఎవరు ఏదైనా చేసేయొచ్చు కానీ తాము ఇది చేయగలమని సమర్ధవంతంగా నమ్మినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. అందుకే హీరోగా చేస్తూ డైరెక్షన్ చేస్తారు.. డైరెక్షన్ చేసే వారు యాక్టింగ్ చేస్తారు. యాక్షన్ కొరియోగ్రాఫర్స్ మెగా ఫోన్ పట్టుకుంటారు. డాన్స్ మాస్టర్స్ హీరోలు అవుతుంటారు, డైరెక్టర్స్ గా మారుతుంటారు.
అలాంటి వారిలో ఇప్పుడు తను కూడా చేరిపోయాడు ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ గణేష్. ఆయన డాన్స్ కంపోజిషన్ అంటే పవర్ స్టార్ ఫ్యాన్స్ కి స్పెషల్ క్రేజ్. జానీ కన్నా ముందు పవన్ కళ్యాణ్ కి పర్ఫెక్ట్ కంపోజింగ్ చేసింది ఆయనే. గణేష్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకోగా ఇప్పుడు సడెన్ గా ఆయన మెగా ఫోన్ పట్టుకుని డైరెక్షన్ చేస్తా అంటున్నాడు. ఆయన డైరెక్షన్ లో వస్తున్న సినిమా ముహూర్త కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.
ప్రభాస్ కజిన్ విరాట్ రాజ్ హీరోగా గణేష్ మాస్టర్ డైరెక్షన్ లో గౌడ్ సాబ్ సినిమా వస్తుంది. ఈ సినిమా పూజకు సుకుమార్ అటెండ్ అయ్యారు. ఎన్నో ఏళ్లుగా డాన్స్ కంపోజ్ చేస్తూ మాస్టర్ గా తన ముద్ర వేసుకున్న గణేష్ మాస్టర్ కి సడెన్ గా ఈ డైరెక్షన్ చేయాలన్న ఆలోచన ఎందుకొచ్చిందో కానీ గౌడ్ సాబ్ అంటూ గణేష్ మాస్టర్ తన డైరెక్షన్ లో మొదటి అటెంప్ట్ చేస్తున్నాడు.
ఆల్రెడీ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ ఈ ఇయర్ సంక్రాంతికి నా సామిరంగ అంటూ వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు. అతని దారిలోనే గణేష్ మాస్టర్ కూడా వస్తున్నాడు. ఇక జానీ మాస్టర్ అయితే ఏకంగా హీరోగా మారి సినిమా మొదలు పెట్టాడు. శేఖర్ మాస్టర్ మాత్రం సినిమాలు, ఢీ షోతో బిజీ బిజీగా ఉన్నాడు. మొత్తానికి కొరియోగ్రాఫర్స్ కూడా కేవలం డాన్స్ కంపోజింగ్ మాత్రమే కాదు మాలో ఇంకా చాలా టాలెంట్ ఉందని ప్రూవ్ చేసుకుంటున్నారు.