పూజా హెగ్డే రీప్లేస్‌మెంట్ వెనక గుట్టు తెలిసింది
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న 'గుంటూరు కారం' మహేష్ కెరీర్ లో ఒక క్లాసీ ఎంటర్ టైనర్ గా నిలుస్తుందని సమాచారం
మహేష్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ 'గుంటూరు కారం'పై ఇటీవల రకరకాల పుకార్లు షికార్ చేసాయి. ఈ సినిమా కథానాయిక మార్పు వ్యవహారంతో పాటు సంగీత దర్శకుడు మారారని కూడా ప్రచారమైంది. పూజా హెగ్డే స్థానంలో మీనాక్షి చౌదరి ఎంపికైనా బోలెడంత ప్రచారం ఉంది. అయితే పూజా వైదొలగడంపై మీడియాలో ఎందుకంత రచ్చ జరిగిందో తనకు అర్థం కాలేదని నిర్మాత నాగవంశీ తాజా ఇంటర్వ్యూలో అన్నారు.
పూజాకి కాల్షీట్లు సర్ధుబాటు కాకపోవడం వల్లనే ఈ సినిమా నుంచి వైదొలగిందని వెల్లడించారు. అనుకున్న షెడ్యూల్ ప్రకారం మేం సెట్స్ లోకి వెళ్లలేకపోయాం. తాపీగా చిత్రీకరణ చేయాలనుకున్నాం. కానీ అప్పటికే పూజాకు హిందీలో వేరే సినిమా కమిట్ మెంట్ ఉంది. దానివల్ల కాల్షీట్లు సర్ధుబాటు చేయలేకపోయింది.. అని నాగ వంశీ సవివరంగా తెలిపారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న 'గుంటూరు కారం' మహేష్ కెరీర్ లో ఒక క్లాసీ ఎంటర్ టైనర్ గా నిలుస్తుందని సమాచారం. ఈ యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌లో శ్రీలీల ఒక కథానాయిక. శ్రీలీల- మీనాక్షిలతో మహేష్ రొమాన్స్ మరో లెవల్లో ఉంటుందని కూడా తెలుస్తోంది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 12 జనవరి 2024న థియేటర్లలోకి రానుంది. తాజా ఇంటర్వ్యూలో నిర్మాత నాగ వంశీ మాట్లాడుతూ.. మొత్తం టాకీ భాగం అక్టోబర్ 20 నాటికి పూర్తవుతుందని, మిగిలిన 4 పాటల షూటింగ్ సంవత్సరం చివరి నాటికి ముగుస్తుందని ధృవీకరించారు. తొలి సింగిల్ త్వరలో విడదల చేస్తాం. ఇప్పటికి రెండు పాటల చిత్రీకరణ పూర్తయిందని కూడా తెలిపారు.
శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రంలో జగపతిబాబు, రమ్యకృష్ణ వంటి ప్రముఖ నటీనటులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. 2023-24 సీజన్ లో మోస్ట్ అవైటెడ్ చిత్రంగా పాపులరైన ఈ ప్రాజెక్ట్‌కి తమన్ స్వరాల్ని అందిస్తున్నారు.