గుంటూరు కారం.. ప్లాన్ మొత్తం వృధా?
సోషల్ మీడియాలో మహేశ్ మ్యానరిజానికి సంబంధించి చిన్న వీడియోలు పోస్ట్ చేసి సందడి చేస్తున్నారు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ.. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన థియేటర్లలో వచ్చింది. చాలా ఏళ్ల తర్వాత.. మహేశ్ ను ఫుల్ మాస్ యాక్షన్ రోల్ లో చూసి.. థియేటర్లలో ఫ్యాన్స్ చేసిన సందడి మామూలుగా లేదు. ఈలలు వేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు.
ఇదే తమకు అసలైన సంక్రాంతి పండుగ అంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మహేశ్ వన్ మ్యాన్ షో చూసేందుకు రిపీట్ మోడ్ లో థియేటర్లకు వెళ్తున్నారు. సోషల్ మీడియాలో మహేశ్ మ్యానరిజానికి సంబంధించి చిన్న వీడియోలు పోస్ట్ చేసి సందడి చేస్తున్నారు. ఈ మూవీకి కొందరు మిక్స్ డ్ టాక్ అందిస్తుండగా.. మరికొందరు పాజిటావ్ టాక్ అందిస్తున్నారు.
అయితే ఈ సినిమా రిలీజ్ కోసం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి ప్రత్యేక పర్మిషన్లను తీసుకున్నారు మేకర్స్. సినిమా టికెట్ రేట్ల పెంపు, అదనపు షోల కోసం మేకర్స్ రిక్వెస్ట్ లకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఆమోదం తెలిపాయి. ప్రత్యేక జీవోలను కూడా జారీ చేశాయి. అయితే ఈ పర్మిషన్ లన్నీ వృథా అయ్యాయని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
తెలంగాణ విషయానికొస్తే.. రోజుకు ఆరు షోలు వేసుకునేందుకు, టికెట్ రేట్ల పెంపునకు ఈ నెల 18వ తేదీ వరకు ప్రత్యేక అనుమతులు ఇచ్చింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. అయితే సినిమాకు ఆడియెన్స్ తగ్గుతుండడంతో హైదరాబాద్ సహ అనేక ప్రాంతాల్లో తెల్లవారుజామున నాలుగు గంటల షోలు రద్దయ్యాయి. కొన్ని థియేటర్లు మాత్రమే 7.30 AM షోలను ప్రదర్శిస్తున్నాయి.
రాష్ట్రంలో 90 శాతం కన్నా ఎక్కువ స్క్రీన్లలో.. రోజుకు నాలుగు షోలే వేస్తున్నారు. ఆన్ లైన్ బుకింగ్స్ కూడా బాగా తగ్గిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఫెస్టివల్ సమయంలో వీకెండ్ లో థియేటర్ల ఆక్యుపెన్సీ బాగుంటుంది. కానీ గుంటూరు కారం విషయం అలా జరగడం లేదట. దీంతో టికెట్ రేట్లను తగ్గించాలని మేకర్స్ యోచిస్తున్నారట.
మరోవైపు, ఆంధ్రలో కూడా పరిస్థితి ఇలానే ఉందట. రిలీజైన రోజు నుంచి పది రోజుల వరకు పర్మిషన్లు తీసుకున్నా.. వాటిని పక్కనపెట్టేశారట మేకర్స్. మంగళవారం నుంచి టికెట్ రేట్లను తగ్గించాలని నిర్ణయించుకున్నారట. సోమవారం ఈ విషయంపై నిర్ణయం తీసుకోనున్నారట.
అయితే ఈ సినిమాకు మేకర్స్ కష్టపడి తెచ్చుకున్న అనుమతులు వేస్ట్ అయ్యాయని సినీ వర్గాల్లో వినిపిస్తోంది. కేవలం బెనిఫిట్ షోలే.. భారీ ఆదాయం తెచ్చిపెట్టాయని, ఆ తర్వాత వసూళ్లు తగ్గాయని సమాచారం. కానీ మేకర్స్ మాత్రం సినిమాపై పాజిటివ్ టాక్ ఉందని చెబుతున్నారు. ఫ్యామిలీతో వెళ్లి చూడాలని కోరుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.