స్టార్ హీరోయిన్ మామ గారు 232కోట్ల డీల్
పాపులర్ హీరోయిన్ మామ గారు 232 కోట్ల విలువైన డీల్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు.
పాపులర్ హీరోయిన్ మామ గారు 232 కోట్ల విలువైన డీల్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ఏడాదిలో ఇది మెగా డీల్ అని చెప్పాలి. ఇప్పటివరకూ బాలీవుడ్ దిగ్గజాల్లో ఇంత పెద్ద మొత్తంతో లండన్ లో సొంత భవంతిని కలిగి లేరు. ఇంతకీ ఎవరా పాపులర్ పర్సనాలిటీ అంటే.. ది గ్రేట్ సోనమ్ కపూర్ గురించే ఇదంతా. ఆమె మామగారు హరీష్ అహుజా రూ. 231.47 కోట్లకు లండన్ లోని నాటింగ్ హిల్ ప్రాపర్టీని కొనుగోలు చేశారు. అతడి నికర ఆస్తుల విలువ, రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియోపై వివరాలు తెలిసాయి.
సోనమ్ కపూర్- ఆనంద్ అహూజా జంట లగ్జరీ లివింగ్ స్టైల్ తో ఇప్పటికే పాపులరయ్యారు. ఆనంద్ అహూజా తండ్రి హరీష్ అహూజా అంతకుమించిన లగ్జరీని ఆస్వాధిస్తారు. ఆయన ఇప్పుడు ఓ బిగ్ డీల్ ని విజయవంతంగా ముగించారు. లండన్ లోని ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్ నుంచి ఖరీదైన విల్లాను కొనుగోలు చేసారు. హరీష్ అహుజా ఇటీవల లండన్‌లోని ప్రతిష్టాత్మకమైన నాటింగ్ హిల్‌లో అద్భుతమైన ఆస్తిని కొనుగోలు చేయడానికి భారీ మొత్తాన్ని వెచ్చించడం చర్చనీయాంశంగా మారింది. ఇది 2024లో UKలో అత్యంత ముఖ్యమైన లివింగ్ స్పేస్ లావాదేవీలలో ఒకటిగా గుర్తింపు అందుకుంది. ఈ హై ప్రొఫైల్ కొనుగోలు గురించి తెలుసుకోవలసినది చాలా ఉంది. హరీష్ అహుజా నికర ఆస్తులు, అతడి భారీ రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియో గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది.
జాతీయ మీడియా కథనం ప్రకారం... హరీష్ అహుజా నాటింగ్ హిల్‌లో అద్భుతమైన ఎనిమిది అంతస్తుల రెసిడెన్షియల్ కాన్వెంట్‌ను 21 మిలియన్ల పౌండ్ల (సుమారు రూ. 231.47 కోట్లు)కు కొనుగోలు చేశారు. ఈ కొనుగోలు ఈ సంవత్సరం UKలో అతిపెద్ద నివాస ఒప్పందాలలో ఒకటి. దాదాపు 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇల్లు గతంలో UK-నమోదిత స్వచ్ఛంద సంస్థ మతపరమైన సంఘానికి చెందినది. ఇది కెన్సింగ్టన్ గార్డెన్స్ సమీపంలో ఉంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, ఆనంద్ అహుజా- సోనమ్ కపూర్ ఈ ఆస్తిలో కొంత భాగాన్ని పునరాభివృద్ధి చేసిన తర్వాత వారి ప్రైవేట్ నివాసంగా ఉపయోగించుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఇతర భాగంలో ఉన్నత స్థాయి అపార్ట్‌మెంట్‌లుగా మలిచి సేల్ కి పెడతారట. అహూజాలకు ముంబై దిల్లీ సహా పలుచోట్ల భారీగా ఆస్తులు ఉన్నాయి.