హద్దులు దాటిన బడ్జెట్‌తో చిక్కులు!

కానీ మీడియం రేంజ్‌ హీరోల విషయంలో నిర్మాతలు ఆచితూచి ఉండాలని ఎంతమంది చెబుతూ ఉన్నా కొన్ని సార్లు పొరపాట్లు జరుగుతూనే ఉన్నాయి.

Update: 2024-12-04 18:30 GMT

హీరోల మార్కెట్‌ను బట్టి సినిమాలను నిర్మిస్తే పర్వాలేదు కానీ కథ డిమాండ్‌ చేస్తుంది, ఇంకేదో అని భారీగా ఖర్చు చేసుకుంటూ పోతే మీడియం రేంజ్‌ హీరోలతో సినిమాలు చేసే నిర్మాతలు దివాళా తీయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికే కొందరు హీరోలతో భారీ బడ్జెట్‌ సినిమాలను నిర్మించిన నిర్మాతలు కనిపించకుండా పోయారు. స్టార్‌ హీరోలతో భారీ బడ్జెట్‌ సినిమాలు తీసినా ఏదో విధంగా బడ్జెట్ అయినా రికవరీ అవుతుంది. కానీ మీడియం రేంజ్‌ హీరోల విషయంలో నిర్మాతలు ఆచితూచి ఉండాలని ఎంతమంది చెబుతూ ఉన్నా కొన్ని సార్లు పొరపాట్లు జరుగుతూనే ఉన్నాయి.

తమిళ్‌లో స్టార్‌ హీరో అయిన సూర్య అంతకు ముందు వంద కోట్ల వసూళ్లు సాధించడం గొప్ప విషయం. రజనీకాంత్‌, విజయ్‌, అజిత్‌ల స్థాయిలో ఆ సినిమాలు ఆడింది లేదు, వసూళ్లు రాబట్టింది లేదు. అయినా కంగువా సినిమాను కంటెంట్‌పై నమ్మకంతో వందల కోట్లు పెట్టి నిర్మించారు. వెయ్యి కోట్ల వసూళ్లు ఖాయం అని అంతా అనుకున్నారు. కానీ ఆ సినిమా ఫలితం ఏంటో తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద దాదాపుగా రూ.130 కోట్ల లాస్ వెంచర్‌గా కంగువా ఫైనల్‌ రన్‌ ముగిసింది. సూర్య ఇమేజ్‌కి తగ్గట్లుగా రూ.100 కోట్ల బడ్జెట్‌తో సినిమా తీసి ఆ స్థాయిలోనే ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి ఉంటే సినిమా కచ్చితంగా లాభాలు తెచ్చి పెట్టేది.

ఇప్పుడు టాలీవుడ్‌లో కొందరు యంగ్‌ హీరోల సినిమాలు షూటింగ్‌ మధ్యలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వాటిల్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమా ఒకటి ఉంది. ప్రస్తుతం ఈయన మూడు సినిమాలను చేస్తూ ఉన్నాడు. మరోటి చర్చల దశలో ఉంది. మూడు సినిమాల్లో ఒక సినిమా బడ్జెట్‌ హద్దులు దాటింది. దాంతో నిర్మాతలు ముందుకు వెళ్లలేక, వెనక్కి తగ్గలేక ఆందోళన చెందుతున్నారనే టాక్‌ వినిపిస్తుంది. ఆ సినిమా ఏంటి, ఆ సినిమా ముగిస్తారా లేదా అనేది త్వరలో క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

శర్వానంద్‌ సినిమాకి సైతం ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. సినిమా మీడియం బడ్జెట్‌తో చేసినా వందల కోట్ల వసూళ్లు నమోదు కావడం మనం చూస్తున్నాం. సినిమాను సింపుల్‌గా, కంటెంట్‌ను సరిగ్గా ప్రేక్షకులకు చేరే విధంగా తీస్తే సరిపోతుంది. అంతే తప్ప ఆడంబరాలకు పోయి సినిమాను తీస్తే కచ్చితంగా బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడే అవకాశాలు ఉన్నాయి. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా సినిమాలు చేయాల్సిన అవసరం ఉంది అంటూ నిర్మాతలకు విశ్లేషకులు సలహా ఇస్తున్నారు.

Tags:    

Similar News