వీడియో: చంద్రమండలంపైనా చిచ్చు పెట్టారు!
ఈ అరుదైన సందర్భంలో బోయ్స్ హాస్టల్ ప్రమోషన్ రక్తి కట్టించింది. నిజానికి ఇస్రో కేవలం ల్యాండ్ రోవర్ ని మాత్రమే చంద్రుని ఉపరితలంపైకి పంపింది
రిషబ్ శెట్టి, తరుణ్ భాస్కర్ దాస్యం, పవన్ కుమార్, షైన్ శెట్టి నటించిన అనువాద చిత్రం 'బాయ్స్ హాస్టల్' ట్రైలర్ ఇప్పటికే విడుదలై అద్భుత స్పందనను అందుకుంది. ఈ చిత్రానికి నితిన్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించారు. ప్రజ్వల్ బి పి, వరుణ్ కుమార్ గౌడ, నితిన్ కృష్ణమూర్తి, అరవింద్ ఎస్ కశ్యప్ నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్-చాయ్ బిస్కెట్ ఫిలింస్ మొదటిసారి చేతులు కలిపి కన్నడలో సూపర్ హిట్ అయిన 'హాస్టల్ హుడుగారు బేకగిద్దరే' చిత్రాన్ని తెలుగులో బాయ్స్ హాస్టల్ పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో ఈ నెల 26న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇది డబ్బింగ్ సినిమా అయినా ప్రచారవైవిధ్యంతో టీమ్ ఆకట్టుకుంటోంది. దూకుడైన ప్రచారం ఈ సినిమాకి పెద్ద ప్లస్ అని చెప్పాలి. తరుణ్ భాస్కర్, రష్మీ గౌతమ్ లాంటి తెలుగు నటీనటులతో కూడిన కొన్ని సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. ఈ చిత్రంలో హాస్టల్ బోయ్స్ ప్రపంచాన్ని, వారి ప్రియమైన హాస్టల్ ప్రాంగణాన్ని.. అల్లరి చిల్లర ఆకతాయి వేషాలను తెరపై ఆవిష్కరిస్తున్నారు. అయితే అనూహ్యంగా హాస్టల్ వార్డెన్ మరణం ఊహించని ట్విస్ట్. హాస్టల్ ఆద్యంతం కోలాహలం వినోదంతో రంజింపజేస్తుందని ట్రైలర్ రివీల్ చేసింది. ఈ డార్క్ కామెడీ మూవీని వరుణ్ గౌడ, ప్రజ్వల్ బిపి, అరవింద్ ఎస్ కాశ్యతో కలిసి నిర్మించారు. బి. అజనీష్ లోక్‌నాథ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రధాన అస్సెట్.
అదంతా అటుంచితే నేటి సాయంత్రం చందమామపై విక్రమ్ ల్యాండర్ సురక్షితంగా ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. చంద్రయాన్ 3 మిషన్ ని విజయవంతం చేయడంలో ఇస్రో పెద్ద సక్సెస్ సాధించింది. ఈ అరుదైన సందర్భంలో బోయ్స్ హాస్టల్ ప్రమోషన్ రక్తి కట్టించింది. నిజానికి ఇస్రో కేవలం ల్యాండ్ రోవర్ ని మాత్రమే చంద్రుని ఉపరితలంపైకి పంపింది.. కానీ అప్పటికే అక్కడ బోయ్స్ నివశిస్తున్నారు.
చంద్రునిపై బోలెడంత సీన్ క్రియేట్ చేస్తున్నారు. ఇస్రో ల్యాండర్ అక్కడ దిగగానే ఇది పరాకాష్ఠకు చేరుకుంది. చంద్రయాన్ 3 విజయం సాధించినందుకు ఇస్రోకు శుభాకాంక్షలు చెబుతూ ఈ ఫన్నీ వీడియోని రిలీజ్ చేసారు. అయితే దీనిపై చంద్రయాన్ అభిమానుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. ఇలాంటి అరుదైన సందర్భంలో సినిమాల ప్రచారం తగదని కొందరు సూచిస్తున్నారు. ఇది సాధారణమైన మిషన్ కాదు. దేశ ప్రతిష్ఠకు సంబంధించినది. దీనిపై మీమ్ లు చేయడం లేదా స్ఫూఫ్ లు క్రియేట్ చేయడం నిషిద్ధమని ఒక సెక్షన్ అభిమానులు వాదిస్తున్నారు. సందర్భాన్ని బట్టి ప్రవర్తించడం కూడా ఇక్కడ చాలా కీలకమని సూచిస్తున్నారు.