ఇండియన్ సినిమాల గ్లోబల్ హవా!

ఇండియన్ సినిమాలు గత దశాబ్ద కాలంగా ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపిస్తున్నాయి.

Update: 2025-02-16 10:30 GMT

ఇండియన్ సినిమాలు గత దశాబ్ద కాలంగా ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపిస్తున్నాయి. ఒక్క భారత్‌లోనే కాదు, విదేశాల్లో కూడా మన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. హాలీవుడ్ మార్కెట్‌ను మించిపోయేలా కొన్ని చిత్రాలు ఊహించని రీతిలో వసూళ్లు సాధించాయి. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాల బిజినెస్ తీరుతెన్నులు మారిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో కొన్ని ఇండియన్ సినిమాలు రికార్డులను తిరగరాసాయి.

అమెరికా, కెనడాలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రం బాహుబలి 2. రాజమౌళి విజన్, ప్రభాస్ మాస్ అప్పీల్ ఈ చిత్రాన్ని విదేశీ మార్కెట్‌లో భారీ విజయానికి దారితీసాయి. చైనాలో మాత్రం దంగల్ అసాధారణమైన హిట్‌గా నిలిచింది. ఆమిర్ ఖాన్ నటన, సినిమాలోని స్ఫూర్తిదాయకమైన అంశాలు చైనా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక యూఏఈలో షారుఖ్ ఖాన్ జవాన్ ఫస్ట్ స్పాట్‌లో నిలిచింది.

ఇంగ్లాండ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రం పఠాన్, అదే విధంగా న్యూజిలాండ్, జర్మనీ, సౌదీ అరేబియాలో కూడా ఇదే సినిమా అగ్రస్థానంలో ఉంది. యానిమల్ మాత్రం ఆస్ర్టేలియాలో రికార్డు వసూళ్లు సాధించింది. బాలీవుడ్ హవా అక్కడ బాగా పెరిగినట్లు చెప్పొచ్చు. సింగపూర్‌లో మళ్లీ జవాన్ తన సత్తా చాటింది.

తెలుగు సినిమాలు కూడా ఈ గ్లోబల్ రేసులో ఏమాత్రం వెనుకబడలేదు. పుష్ప ది రైజ్ రష్యాలో ఇండియన్ మూవీస్‌లో టాప్‌గా నిలిచింది. అల్లు అర్జున్ నటన, డబ్బింగ్ కంటెంట్, అక్కడి ప్రమోషన్స్ ఈ చిత్రాన్ని రష్యన్ మార్కెట్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా మార్చాయి. ఇక జపాన్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన RRR సెన్సేషనల్ విజయాన్ని సాధించింది.

ప్రపంచవ్యాప్తంగా మన ఇండియన్ సినిమాల హవా స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు హాలీవుడ్ డామినేట్ చేసిన మార్కెట్లలోనూ ఇప్పుడు ఇండియన్ మూవీస్ రికార్డులు సృష్టిస్తున్నాయి. భవిష్యత్తులో మరిన్ని పాన్ ఇండియా సినిమాలు ఈ రికార్డులను చెరిపివేసేలా ఉన్నాయన్నది మాత్రం ఖాయం.

Tags:    

Similar News