తొలిప్రేమ దర్శకుడు మళ్ళీ ఇన్నాళ్ళకు
పవర్ స్టార్ పవన్ కెరియర్ బెస్ట్ సినిమాలలో ఒకటైన 'తొలిప్రేమ' తో కరుణాకరన్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు.
ఒకప్పుడు బిగ్గెస్ట్ హిట్స్ అందుకున్న కొందరు టాలెంటెడ్ డైరెక్టర్స్ ఒక్కసారిగా మాయమైన విషయం తెలిసిందే. ఎవర్ గ్రీన్ హిట్స్ అందించిన దర్శకులు తరువాత చెప్పుకోదగ్గ సక్సెస్ లు అందుకోలేకపోయారు. ఫామ్ కోల్పోయి మెల్లగా అవకాశాలకి దూరమయ్యారు. అలాంటి వారిలో కరుణాకరన్ ఒకరు. పవర్ స్టార్ పవన్ కెరియర్ బెస్ట్ సినిమాలలో ఒకటైన ‘తొలిప్రేమ’ తో కరుణాకరన్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు.
కంప్లీట్ లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా 1998లో ఒక ఊపు ఊపింది. కుర్రాళ్ళు అయితే ఈ చిత్రానికి విపరీతంగా కనెక్ట్ అయిపోయారు. ఆ సినిమాలో హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్ అయితే ఆల్ టైం బెస్ట్ సీక్వెన్స్ లలో ఒకటిగా నిలిచింది. చాలా సినిమాలలో అదే థీమ్ లో హీరోయిన్ క్యారెక్టర్స్ ని దర్శకులు పరిచయం చేశారు. అమ్మాయిలకి కూడా ‘తొలిప్రేమ’ ఫేవరేట్ చిత్రంగా మారిపోయింది. ఇప్పటికి పవన్ కళ్యాణ్ ‘తొలిప్రేమ’ సినిమా చూస్తే ఫ్రెష్ ఫీలింగ్ అందిస్తుంది.
దీని తర్వాత కరుణాకరన్ ‘వాసు’, ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’, ‘డార్లింగ్’ లాంటి సినిమాలతో సక్సెస్ లు అందుకున్నాడు. కరుణాకరన్ చివరిగా సాయి ధరమ్ తేజ్ తో ‘తేజ్ ఐలవ్ యు’ అనే సినిమాని 2018లో చేశారు. ఇది కూడా ప్రేమకథతోనే తెరకెక్కిన ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఈ చిత్రం తరువాత కరుణాకరన్ నుంచి మూవీస్ రాలేదు. ఆరేళ్ళ గ్యాప్ తీసుకున్న కరుణాకరన్ ప్రస్తుతం కొత్త సినిమాకి రెడీ అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. దిల్ రాజు అతనికి మళ్ళీ అవకాశం ఇచ్చారంట.
రీసెంట్ గా తన స్టైల్ లో ఓ ప్రేమ కథని కరుణాకరన్ దిల్ రాజుకి నేరేట్ చేశారని తెలుస్తోంది. ఈ కథ దిల్ రాజుకి కూడా బాగా నచ్చడంతో అతనికి ఛాన్స్ ఇచ్చారంట. దిల్ రాజు తన ఫ్యామిలీ హీరో ఆశీష్ తో ఈ చిత్రాన్ని చేయాలని ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. త్వరలో ఈ సినిమాకి సంబందించిన అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలలో ప్రచారం జరుగుతోంది.
కరుణాకరన్ చివరిగా ‘డార్లింగ్’ సినిమాతో ప్రభాస్ కి హిట్ ఇచ్చాడు. ఆ తరువాత అతని నుంచి వచ్చిన మూడు సినిమాలు ఫెయిల్ అయ్యాయి. దీంతో లాంగ్ గ్యాప్ తీసుకొని ఓ మంచి కథని సిద్ధం చేసుకొని మరల గ్రాండ్ సక్సెస్ కొట్టాలని కరుణాకరన్ అనుకుంటున్నారంట. మరి దిల్ రాజు బ్యానర్ లో దొరికిన ఈ ఛాన్స్ ని కరుణాకరన్ ఏ విధంగా యూజ్ చేసుకుంటాడో చూడాలి.