'జై హనుమాన్' మామూలుగా ఉండదు!
టాలీవుడ్ దర్శకుల్లో ప్రశాంత్ వర్మ విభిన్నమైన శైలితో సినిమాలు చేస్తూ వస్తున్నాడు.
టాలీవుడ్ దర్శకుల్లో ప్రశాంత్ వర్మ విభిన్నమైన శైలితో సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో సంక్రాంతి కానుకగా వచ్చిన 'హనుమాన్' సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ప్రశాంత్ వర్మ పేరు నార్త్ లోనూ మారుమ్రోగింది. బాలీవుడ్ స్టార్స్ సైతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమాలకు ఆసక్తి చూపిస్తున్నారు. రికార్డ్ స్థాయి వసూళ్లు సాధించిన హనుమాన్ కి సీక్వెల్ గా 'జై హనుమాన్' రాబోతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే సీక్వెల్ కోసం స్క్రిప్ట్ వర్క్ ను ప్రారంభించినట్లుగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇటీవల ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
ఆ ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ... హనుమాన్ సినిమా రూ.100 కోట్లు మాత్రమే సాధించి ఉంటే ఇప్పటి వరకు 'జై హనుమాన్' సినిమా ను పూర్తి చేసి విడుదల చేసేవాళ్లం. ఆ సినిమా అంచనాలను మించి వసూళ్లు చేయడంతో పాటు పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్ అయిన కారణంగా మా బాధ్యత పెరిగింది. అందుకే కథ విషయంలో ఎక్కువ వర్క్ చేస్తున్నాం. అంతే కాకుండా ప్రతి ఒక్కరు జై హనుమాన్ లో ఏం ఉండాలని కోరుకుంటున్నారో... ఎలా ఉండాలని కోరుకుంటున్నారో అలా రూపొందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం.
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ కోసం ఎంతో మంది బాలీవుడ్ స్టార్స్ ను కలిశాను. జై హనుమాన్ లో బాలీవుడ్ కు చెందిన పలువురిని మీరు చూస్తారు. ముందు ముందు బాలీవుడ్ స్టార్స్ నా సినిమాలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం జై హనుమాన్ సినిమా స్క్రిప్ట్ కోసం ఎంతో మంది వర్క్ చేస్తున్నారు. నటీనటుల ఎంపిక మొదలుకుని ప్రతి పని జరుగుతోంది. ఇప్పటికే నటీనటుల ఎంపిక విషయంలో నిర్ణయం జరిగిపోయింది. త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చాడు.
హనుమాన్ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసిన తర్వాత వీఎఫ్‌ఎక్స్ వర్క్ చేశాం. కానీ జై హనుమాన్ కి మాత్రం షూటింగ్ ప్రారంభంకు ముందు నుంచే వీఎఫ్‌ఎక్స్ వర్క్ ను చేయబోతున్నట్లుగా ప్రశాంత్ వర్మ ప్రకటించాడు. ఎక్కువ సమయం తీసుకోకుండా తప్పకుండా ప్రేక్షకులు కోరుకున్నట్లుగా స్పీడ్ గా జై హనుమాన్ ను తీసుకు వస్తామని అన్నాడు. జై హనుమాన్ కంటే ముందుగా అధీరా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామంటూ ప్రశాంత్ వర్మ ప్రకటించాడు. ఇటీవలే మోక్షజ్ఞ హీరోగా ఒక సినిమాను ప్రశాంత్ వర్మ మొదలు పెట్టాడు. వరుసగా సినిమాలు తన నుంచి వస్తాయని, ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలు విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లుగా ప్రశాంత్ వర్మ తెలియజేశాడు.