పెళ్లి తర్వాత క్షమాపణలు చెప్పిన జాలి రెడ్డి
పుష్ప సినిమాలో జాలి రెడ్డిగా బాగా పాపులరైన డాలీ ధనంజయ ఇటీవలే తన ప్రేయసి ధన్యతను పెళ్లాడి వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు.
కన్నడ నటుడు డాలీ ధనంజయ పలు సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. పుష్ప సినిమాలో జాలి రెడ్డిగా బాగా పాపులరైన డాలీ ధనంజయ ఇటీవలే తన ప్రేయసి ధన్యతను పెళ్లాడి వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. వీరి పెళ్లి మైసూరులో జరిగింది. మైసూరుతో డాలీకి చాలా స్పెషల్ బాండింగ్ ఉంది.
డాలీ తన స్కూలింగ్, లైఫ్, ఇండస్ట్రీ ఎంట్రీ అన్నీ అక్కడి నుంచే జరిగాయి. అందుకే ఆయన కావాలని మైసూరులోనే పెళ్లి చేసుకున్నాడు. మైసూరులో బాగా పాపులరైన చాముండేశ్వరి దేవి ఆశీర్వాదం తమ జంటపై ఉండాలని చాముండేశ్వరి గుడి సెట్ వేసి అందులో పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
పెళ్లి మైసూరులోనే జరుగుతుందని తెలుసుకున్న ఆయన అభిమానులు ఎక్కువ సంఖ్యలో అక్కడకు వెళ్లారు. సుమారు 30 వేల మందికి పైగా అక్కడకు వెళ్లడం ఎవరూ ఊహించలేదు. పోలీస్ సెక్యూరిటీ తో వారిని కంట్రోల్ చేసి ఎలాంటి దుర్ఘటనలు జరక్కుండా చేసిన డాలీ, అక్కడికి వచ్చిన అందరి ఆశీర్వాదాలు పొందలేకపోయాడు.
ఎక్కువ మంది రావడం వల్ల కొందరు సెలబ్రిటీలు సైతం బయటి నుంచి బయటికే వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విషయమై ధనుంజయ్, సోషల్ మీడియా వేదికగా అందరికీ క్షమాపణలు తెలిపాడు. తమ జంటను నిండు మనసుతో ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతీ ఒక్కరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నామని డాలీ తెలిపాడు.
మా పెళ్లి కోసం మీరంతా ఎంతో దూరం నుంచి వచ్చారు, కానీ కొంతమంది లోపలికి రాలేకపోయారు. మీకు ఇబ్బంది కలిగించినందుకు దయచేసి మమ్మల్ని క్షమించండి. త్వరలో మరో రూపంలో మిమ్మల్నందరినీ తప్పకుండా కలుసుకుంటామని, మమ్మల్ని పెద్ద మనసుతో ఆశీర్వదించండని కోరుతూ సారీ చెప్పాడు. జరిగిన తప్పుకు నైతిక బాధ్యత వహిస్తూ డాలీ వ్యవహరించిన తీరు అందరినీ మెప్పిస్తుంది.