ఆ నలుగురిలో హిట్టు కొట్టేదెవరు?

ఇలా నాలుగు సినిమాలు జూలై బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వస్తున్నాయి. వీటితో పాటుగా రెండు హిందీ సినిమాలు వస్తున్నాయి.

Update: 2024-07-04 11:18 GMT

జూన్ నెలాఖరున విడుదలైన 'కల్కి 2898 AD' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ తో రికార్డులు తిరగరాస్తోంది. ఇప్పటికే రూ..700 కోట్లకి పైగా వసూళ్లతో ప్రతిష్టాత్మక 1000 కోట్ల క్లబ్ దిశగా దూసుకుపోతోంది. ఇప్పట్లో ఈ సినిమా సందడి తగ్గేలా కనిపించం లేదు. బుకింగ్స్ చూస్తుంటే రెండో వారాంతంలోనూ మంచి వసూళ్లు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక జూలై సెకండ్ వీక్ నుంచి థియేటర్లలోకి మరికొన్ని చిత్రాలు రాబోతున్నాయి.

విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన 'ఇండియన్ 2' సినిమా జులై 12న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కానుంది. ఇది 1996లో సంచలన విజయం సాధించిన 'ఇండియన్' చిత్రానికి సీక్వెల్. తెలుగులో 'భారతీయుడు 2' పేరుతో విడుదల అవుతుంది. ఇప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా నేటి సమాజంలోని అవినీతి, లంచగొండితనాన్ని తెర మీద ఆవిష్కరిస్తున్నారు డైరెక్టర్ శంకర్ షణ్ముగం. సేనాపతిగా కమల్ అదే ఓల్డ్ గెటప్ తో అలరించడానికి వస్తున్నారు. అలానే మొదటి భాగంలో ఉన్న దివంగత నటులు నెడుముడి వేణును టెక్నాలజీ సాయంతో తిరిగి తీసుకొస్తున్నారు.

ఇప్పటికే రిలీజైన 'ఇండియన్ 2' ప్రమోషనల్ మెటీరియల్ కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. పాటలు పెద్దగా ఆకట్టుకోకపోయినా, టీజర్ & ట్రైలర్ మాత్రం జనాల దృష్టిని ఆకర్షించాయి. 28 ఏళ్ల తర్వాత శంకర్ - కమల్ కలిసి ఎలాంటి కంటెంట్ తో రాబోతున్నారో చూడాలనే ఆసక్తిని కలిగించారు. తెలుగులోనూ ఈ పొలిటికల్ యాక్షన్ మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో కమల్ హాసన్ తో పాటుగా సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, ప్రియాభవానీ శంకర్‌, ఎస్.జె సూర్య, సముద్రఖని, బాబీ సింహా తదితరులు కీలక పాత్రలు పోషించారు. లైకా ప్రొడక్షన్స్ & రెడ్ జెయింట్ మూవీస్ ఈ సినిమాని నిర్మించాయి.

Read more!

జూలై 19వ తేదీన 'డార్లింగ్‌' సినిమా రిలీజ్ కాబోతోంది. ప్రియదర్శి పులికొండ, నభా నటేష్‌ జంటగా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ కు 'వై దిస్ కొలవెరి' అనేది ట్యాగ్ లైన్. దీనికి అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. అనన్య నాగేళ్ళ కీలక పాత్రలో కనిపించనుంది. 'హను-మాన్' వంటి ఎపిక్ బ్లాక్ బస్టర్ ను నిర్మించిన ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి.. తన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం సమకూర్చారు. ఈతరం యువతీ యువకులకి కనెక్ట్ అయ్యే పాయింట్ తో ఈ సినిమా రూపొందినట్లు తెలుస్తోంది.

అల్లు శిరీష్ చాలా కాలం తర్వాత హీరోగా నటిస్తున్న సినిమా 'బడ్డీ'. ఇందులో గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్‌ సింగ్‌ హీరోయిన్లుగా నటించగా.. అజ్మల్ అమీర్ కీలక పాత్ర పోషించారు. ఒక టెడ్డీ బేర్‌ కథలో కీలకంగా ఉండబోతోంది. తగ్గేదేలే అంటూ టెడ్డీ బేర్‌ అన్యాయంపై పోరాడటం అనే కొత్త పాయింట్ తో ఈ సినిమా తీశారు. ఇటీవలే విడుదలైన ట్రైలర్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. అల్లు శిరీష్ ఈసారి హిట్ కొట్టేలా ఉన్నాడనే నమ్మకాన్ని కలిగించింది. సామ్ ఆంటోన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిల్మ్స్ పై జ్ఞానవేల్ రాజా నిర్మించారు. జూలై 26న థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.

ఈ నెల 26న 'బడ్డీ'తో పాటుగా 'రాయన్' సినిమా కూడా రిలీజ్ అవుతోంది. తమిళ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సందీప్ కిషన్, కాళిదాసు జయరామ్, వరలక్ష్మి శరత్ కుమార్, దుషార విజయన్, అపర్ణ బాలమురళి, నిత్యా మీనన్, ఎస్.జె. సూర్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇది ధనుష్ కెరీర్ లో 50వ సినిమా కావడంతో అందరిలో మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికైతే సినిమా కథేంటనే హింట్ ఇచ్చే ప్రమోషనల్ కంటెంట్ ఏదీ బయటకి రాలేదు. క్యారక్టర్ పోస్టర్లు, రెండు పాటలు మాత్రం ఆకట్టుకున్నాయి. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇలా నాలుగు సినిమాలు జూలై బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వస్తున్నాయి. వీటితో పాటుగా రెండు హిందీ సినిమాలు వస్తున్నాయి. సుధా కొంగర దర్శకత్వంలో అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటించిన ‘సర్ఫిరా’ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఇది సూర్య నటించిన 'ఆకాశమే నీ హద్దురా' మూవీకి హిందీ రీమేక్. అలానే విక్కీ కౌశల్‌, త్రిప్తి డిమ్రి ప్రధాన పాత్రలు పోషించిన ‘బ్యాడ్‌ న్యూజ్‌’ చిత్రం జులై 19న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. మరి వీటిల్లో ఏయే సినిమాలు పాజిటివ్ టాక్ తో మంచి వసూళ్లు సాధిస్తాయో చూడాలి.

Tags:    

Similar News

eac