'క‌ల్కీ' ఓ స్పెష‌ల్ కాన్సెప్ట్..అదేంట‌న్న‌ది అక్క‌డే!

ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ చిత్రంగా నిలిచిన 'క‌ల్కి 2898' రిలీజ్ కి రంగం సిద్ద‌మైన సంగ‌తి తెలిసిందే

Update: 2024-05-04 06:40 GMT

ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ చిత్రంగా నిలిచిన 'క‌ల్కి 2898' రిలీజ్ కి రంగం సిద్ద‌మైన సంగ‌తి తెలిసిందే. ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం జూన్ 27న సినిమా వ‌ర‌ల్డ్ వైడ్ గా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఇక సినిమాపై ఎలాంటి అంచ‌నాలున్నాయో? చెప్పాల్సిన ప‌నిలేదు. రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలు అంత‌కంత‌కు మంచి బ‌జ్ ని తీసుకొచ్చాయి. సైన్స్ ఫిక్ష‌న్ థ్ర‌ల్ల‌ర్ లో ఏం చెప్ప‌బోతున్నారు? అన్న ఎగ్జైట్ మెంట్ ప్రేక్ష‌కాభిమానుల్లో క‌నిపిస్తోంది.

ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ ఇండియా ప్యూచ‌ర్ ని చూపించ‌బోతున్న‌ట్లు రివీల్ చేసారు. భ‌విష్య‌త్ లో ఇండియా ఎలా ఉండ‌బోతుందో? ముందే సినిమా గా తీసి చూపిస్తున్నామ‌ని సంకేతాలు పాస్ చేసాడు. వ‌ర‌ల్డ్ ప్యూచ‌ర్ లో ఎలా మార‌బోతుందో? కొన్ని కాన్సెప్ట్ వీడియోలు నెట్టింట చాలానే వైర‌ల్ అయ్యాయి? అలా ఇండియా ప్యూచ‌ర్ ని ముందే చూసిన నాగ్ అశ్విన్ త‌న కోణంలో చూపించ‌బోతున్నాడు. దానికోసం బోలెడంత గ్రౌండ్ వ‌ర్క్ చేసాడు.

శతాబ్ధాల క్రింద‌కెళ్లి మ‌రీ చ‌రిత్ర‌ని తిర‌గేసి...నేటి సాంకేతిక‌తను జోడించి..ప్యూచ‌ర్ ఇండియాని చూపించ బోతున్నాడు. ఇటీవ‌లే అమితాబ‌చ్చ‌న్ రోల్ కూడా రివీల్ అయింది. అశ్వత్థామగా అమితాబ్ ని చూపిస్తున్నారు. దీంతో మరోసారి పౌరాణిక - సైన్స్ మిక్స్‌గా ఉంటుందని క్లారిటీ వ‌స్తోంది. తాజాగా 'ఆహా'లో రిలీజ్ అయిన 'మైడియ‌ర్ దొంగ' చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సర్వజ్ఞ కుమార్ కల్కి గురించి ఇంట్రెస్టింగ్ విష‌యాలు కొన్ని పంచుకున్నారు.

'నేను కల్కి 2898 AD కి అదనపు రచయితగా పనిచేశాను. సినిమా గురించి నేను ఇప్పుడే చెప్ప‌లేను కానీ ఇంతకు ముందు ఎవరూ ప్రయత్నించని ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్‌తో ఈ సినిమా ఉంటుందని చెప్పగలను. ఇంత‌వ‌ర‌కూ ఇలాంటి కాన్సెప్ట్ ని ఎవ‌రూ తీసుకోలేదు. క‌నీసం టచ్ చేసే ప్ర‌య‌త్నం కూడా చేసి ఉండ‌రు' అని అన్నారు. దీంతో క‌ల్కి భారీ ప్ర‌యోగాత్మ‌క చిత్ర‌మ‌ని మ‌రోసారి క్లారిటీ దొరికింది. మ‌రి ఈ ప్ర‌యోగం ప్రేక్ష‌కుల‌కు ఎంత‌వ‌ర‌కూ క‌నెక్ట్ అవుతుందో రిలీజ్ వ‌ర‌కూ వెయిట్ చేయాలి. ఇందులో ప్ర‌భాస్ కి జోడీగా దీపికా ప‌దుకోణే న‌టించింది. లెజెండరీ కమల్ హాసన్ అతిధి పాత్రలో నటించారు. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వని దత్ భారీ బ‌డ్జెట్ తో నిర్మించారు.

Tags:    

Similar News