కల్కి 2898 AD: జక్కన్న నెంబర్ వన్ రికార్డ్ బ్రేక్ అయ్యిందిగా

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో, ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రస్తుతం సినీ ప్రపంచంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Update: 2024-06-13 07:32 GMT

కల్కి 2898 AD మూవీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు సృష్టిస్తోంది. అద్భుతమైన ట్రైలర్, సమర్థమైన ప్రమోషనల్ క్యాంపెయిన్ కారణంగా రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఈ సినిమా గురించి ఉత్కంఠ భరితంగా ఎదురుచూస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో, ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రస్తుతం సినీ ప్రపంచంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఎందుకంటే ఈ సినిమాలో దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, పసుపతి, శోభనా, మృణాల్ ఠాకూర్ వంటి ప్రముఖ నటులు నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ నిర్మించిన ఈ భారీ బడ్జెట్, వీఎఫ్ఎక్స్ హేవీ ప్రొడక్షన్ సినిమా, జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కానుంది. ముఖ్యంగా IMAX ఫార్మాట్‌లో విడుదల కావడంతో ఈ సినిమా మరింత ప్రత్యేకతను సంతరించుకుంటుంది.

ఇక ఇటీవల వచ్చిన సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి విదేశాలలో ప్రీ-సేల్స్ ఇప్పటికే మొదలయ్యాయి. చూస్తుంటే సరికొత్త రికార్డులు క్రియేట్ అయ్యేలా ఉన్నట్లు అనిపిస్తోంది. నార్త్ అమెరికాలో కల్కి 2898 AD, బిగ్గెస్ట్ మల్టీస్టారర్ RRR మూవీ సృష్టించిన రికార్డును బద్దలుకొట్టింది. కల్కి 2898 AD, ప్రీ-సేల్స్‌లో అత్యంత వేగంగా 1 మిలియన్ డాలర్ల మార్కును దాటిన తొలి భారతీయ సినిమాగా నిలిచింది. RRR కన్నా తక్కువ రోజుల్లో ఈ ఘనత సాధించింది.

ఈ చిత్రం విడుదలకు ముందు సులభంగా 2 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించవచ్చని అంచనా వేశారు. మరి ఇంకెన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో చూడాలి. కల్కి 2898 AD విడుదలకు ముందే ఎన్నో రికార్డులు బ్రేక్ చేస్తుండటంతో సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రీ-సేల్స్‌లోనే భారీ వసూళ్లు సాధించడం ఈ చిత్రం సృష్టించిన హైప్, ప్రేక్షకుల మధ్య ఉన్న ఆసక్తిని సూచిస్తుంది. ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్, స్టార్ స్టడెడ్ కాస్ట్, విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ కలిపి ఈ సినిమాను విపరీతమైన అంచనాలతో నిలిపాయి.

సినిమా విడుదల తరువాత కల్కి 2898 AD ఇంకెన్ని విజయాలను సాధిస్తుందో, ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. సినిమా ప్రమోషనల్ క్యాంపెయిన్ ఇప్పటికే సక్సెస్ అయింది కాబట్టి, సినిమా థియేటర్లలో కూడా అదే స్థాయి సక్సెస్ అందుకుంటుందని ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఇక ప్రభాస్ కెరీర్ లో మాత్రమే కాకుండా ఇండియన్ సినిమా హిస్టరీలో ఇప్పటివరకు ఇలాంటి సినిమా రాలేదు అని చెప్పవచ్చు. ఇక కల్కి పాన్ వరల్డ్ మార్కెట్ లో ఇంపాక్ట్ చూపగలిగితే భవిష్యత్తులో మన దర్శకులు ఇలాంటి సినిమాలను మరింత ఎక్కువగా తెరపైకి తీసుకు వచ్చే అవకాశం ఉంటుంది.

Tags:    

Similar News