యూఎస్ ప్రేక్షకులకు 'కల్కి' స్పెషల్ వర్షన్
ప్రభాస్ స్టార్ డమ్ ను మరింత పెంచిన కల్కి సినిమా వసూళ్ల విషయంలో సరికొత్త రికార్డులను నమోదు చేస్తూ వెళ్తుంది
ప్రభాస్ స్టార్ డమ్ ను మరింత పెంచిన కల్కి సినిమా వసూళ్ల విషయంలో సరికొత్త రికార్డులను నమోదు చేస్తూ వెళ్తుంది. వారం రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా వసూళ్ల విషయంలో మాత్రం జోరు కంటిన్యూ చేస్తుంది. ఈ శని మరియు ఆదివారాల్లో కల్కి సాధించబోతున్న వసూళ్లపై అందరి దృష్టి ఉంది.
ఇప్పట్లో ఓటీటీ స్ట్రీమింగ్ చేసేది లేదు అంటూ మేకర్స్ ప్రకటించడంతో ప్రేక్షకులు అంతా కూడా థియేటర్ల బాట పడుతున్నారు. ఈ భారీ బడ్జెట్ సినిమా నిడివి మూడు గంటలు అనే విషయం తెల్సిందే. అయితే మొదటి పార్ట్ లో కొన్ని సన్నివేశాలు సాగతీసినట్లుగా, కాస్త బోరింగ్ గా ఉన్నాయి అంటూ రివ్యూవర్స్ మరియు ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఆ కారణంతోనే యూఎస్ లో ఎడిట్ చేసిన వర్షన్ ను స్క్రీనింగ్ చేస్తున్నారు. దాదాపుగా 15 నిమిషాలు కట్ చేసి 2 గంటల 45 నిమిషాలు మాత్రమే అక్కడ స్క్రీనింగ్ చేస్తున్నారు. యూఎస్ లో సినిమా టికెట్ బుక్ చేసుకునేందుకు ఆన్ లైన్ పోర్టల్ ఓపెన్ చేసిన సమయంలో సినిమా నిడివి 2 గంటల 45 నిమిషాలు మాత్రమే అని చూపిస్తుంది.
సాధారణంగా ఓవర్సీస్ లో సినిమాల నిడివి రెండున్నర గంటలు లేదా కాస్త అటు ఇటుగా ఉండాలి. కానీ కల్కి మూడు గంటలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా యూఎస్ ప్రేక్షకులు కల్కి స్పెషల్ ఎడిట్ చేసిన వర్షన్ ను ఎంజాయ్ చేస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ ఎడిట్ చేసిన వర్షన్ ను స్క్రీనింగ్ చేస్తే బాగుంటుంది కదా అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఒక్క సెకను కూడా తొలగించవద్దు అంటూ కోరుకుంటున్నారు. రెండో వారం పూర్తి అయిన తర్వాత ఏమైనా మార్పు లు ఇక్కడ ఉంటాయో చూడాలి.