అల్లు అర్జున్‌లోకి లక్ష వాట్ల పవర్ నింపిన కమల్ హాసన్
ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రఖ్యాత హాలీవుడ్ రిపోర్టర్ మ్యాగజైన్ కవర్ పేజీని అలంకరించగా, ఈ పుస్తకాన్ని ప్రదర్శిస్తూ లెజెండరీ కమల్ హాసన్ ఇచ్చిన ఫోజ్ అంతర్జాలంలో చర్చనీయాంశంగా మారింది.;
లెజెండరీ కమల్ హాసన్ భారతీయ సినీపరిశ్రమలో నటనకు ప్రమాణాలు నేర్పిన ప్రతిభావంతుడు. కెరీర్ లో పలుమార్లు ఉత్తమ నట ప్రదర్శనకుగాను ఆయన జాతీయ అవార్డులు అందుకున్నారు. ఎన్నో అంతర్జాతీయ పురస్కారాలను గెలుచుకున్నారు. అలాంటి ఒక దిగ్గజ నటుడు పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటనను ప్రశంసించిన తీరు సర్వత్రా చర్చనీయాంశమైంది. `పుష్ప - ది రైజ్` ప్రివ్యూని దేవీశ్రీతో పాటు వీక్షించిన కమల్ హాసన్, ప్రివ్యూ అనంతరం మీడియాతో మాట్లాడుతూ అల్లు అర్జున్, సుకుమార్ టీమ్ ప్రయత్నాన్ని ప్రశంసించారు. ముఖ్యంగా బన్ని నటనను అద్భుతం అంటూ ఆయన కీర్తించారు. ఆ తర్వాత అల్లు అర్జున్ ఉత్తమ నటుడుగా జాతీయ పురస్కారాన్ని అందుకోవడం యాధృచ్ఛికం.
ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రఖ్యాత హాలీవుడ్ రిపోర్టర్ మ్యాగజైన్ కవర్ పేజీని అలంకరించగా, ఈ పుస్తకాన్ని ప్రదర్శిస్తూ లెజెండరీ కమల్ హాసన్ ఇచ్చిన ఫోజ్ అంతర్జాలంలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా బన్ని లాంటి యువహీరోకి ఇది ఎంతో ఎనర్జీని నింపుతుందనడంలో సందేహం లేదు. నిజం చెప్పాలంటే లక్ష వాట్ల విద్యుత్ ని బన్ని శరీరంలోకి పంపించారు కమల్. అలాంటి లెజెండరీ నటుడి నుంచి చిన్న కాంప్లిమెంట్ వచ్చినా అది చాలా పెద్ద శక్తిని నింపుతుంది. ఇప్పుడు ఏకంగా మ్యాగజైన్ కవర్ పేజీనే ప్రమోట్ చేసారు కమల్ హాసన్.
ప్రభాస్ నటించిన `కల్కి 2898 ఏడి`లో కమల్ హాసన్ విలన్ పాత్ర సర్వత్రా ఉత్కంఠను పెంచింది. తదుపరి కల్కి సీక్వెల్ లో విశ్వనటుడి విశ్వరూపం వీక్షించేందుకు వీలుంది. ఇలాంటి సమయంలో అల్లు అర్జున్ తోను కమల్ హాసన్ ఓ సినిమాలో నటిస్తే చూడాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ప్రభాస్- కమల్ హాసన్ కలయికలో 1000 కోట్ల క్లబ్ సినిమా సాధ్యమైంది. తదుపరి అల్లు అర్జున్ - కమల్ హాసన్ కలయికలో మరో 1000 కోట్ల క్లబ్ సినిమాని చూడాలని ప్రజలు ఆశపడుతున్నారు. అయితే ఆ ఇద్దరినీ కలిపే పవర్ ఫుల్ స్టోరి ఏ దర్శకుడి వద్ద ఉంది? అన్నది ఇప్పటికి సస్పెన్స్. ఈ ప్రాజెక్ట్ ఎప్పటికి కుదురుతుందో వేచి చూడాలి.