కమల్ హాసన్.. ఒకసారి నాలుగు!
నటనతో ఎప్పుడూ విశ్వరూపం చూపించే ఆయన ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు
విలక్షణ నటుడు కమల్ హాసన్ కు ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉందో అందరికీ తెలిసిందే. తమిళంతో పాటు తెలుగులో కూడా అశేష అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలతో సమానంగా కమల్ ను కూడా ఆదరిస్తారు తెలుగు సినీ ప్రియులు. రెండేళ్ల క్రితం వచ్చిన విక్రమ్ తో అలరించిన కమల్ కొత్త మూవీ కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. నటనతో ఎప్పుడూ విశ్వరూపం చూపించే ఆయన ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి మూవీ తోపాటు ఇండియన్ 2, థగ్ లైఫ్ సినిమాలు చేస్తున్నారు. వరుసగా అన్ని సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. తాను నటిస్తున్న మూవీల గురించి క్రేజీ అప్డేట్స్ షేర్ చేసి.. ఇప్పుడు ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపారు. తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన కమల్ హాసన్.. తన చేతిలో ఉన్న ప్రాజెక్టుల వివరాలను షేర్ చేశారు. ఆ సమయంలో కల్కి మూవీ కోసం మాట్లాడారు.
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఇండియన్-2 మూవీ షూటింగ్ పనులు కంప్లీట్ అయ్యాయని కమల్ హాసన్ తెలిపారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని చెప్పారు. ఇండియన్-3 షూటింగ్ కూడా పూర్తి అయిందని చెప్పి ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. ఇండియన్-2 మూవీ త్వరలోనే విడుదలవుతుందని చెప్పారు. ఆ తర్వాత ఇండియన్-3 పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టనున్నట్లు కమల్ హాసన్ వెల్లడించారు.
ఇక సినిమాలు చేస్తూ.. రాజకీయాల్లో కూడా బిజీగా ఉంటున్న కమల్ హాసన్.. త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల తర్వాత మణిరత్నం దర్శకత్వంలో థగ్ లైఫ్ షూటింగ్ మొదలు పెడతామని చెప్పారు. ఇక కల్కి మూవీలో తాను కేవలం గెస్ట్ రోల్ లో నటించినట్లు కమల్ రివీల్ చేశారు. అందుకు సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ అయినట్లు చెప్పారు. దీంతో సినీ ప్రియులు పాటు ఆయన అభిమానులు షాక్ అయ్యారు.
ఇప్పటి వరకు కమల్.. కల్కి మూవీలో విలన్ రోల్ చేస్తున్నారని అంతా ఊహించారు. కానీ కమల్ మాత్రం గెస్ట్ రోల్ చేస్తున్నట్లు రివీల్ చేశారు. అయితే ఆ సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్ టాలెంట్ ను కొందరు నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు. మూవీలో కమల్ తక్కువ సేపే కనిపించినా.. ఆ రోల్ ఇంపాక్ట్ మూవీపై గట్టిగా ఉండే పాత్ర అయింటుందని అంచనా వేస్తున్నారు. ఇక కమల్.. డైరెక్ట్ తెలుగు మూవీ చేసి 29 ఏళ్లు అవుతోంది. శుభ సంకల్పం తర్వాత మళ్లీ కల్కి లోనే నటిస్తున్నారు. మరి ఈ చిత్రంలో కమల్ రోల్ ఎలా ఉంటుందో చూడాలి.