2024 లోక్ సభ ఎన్నికల బరిలో కంగన?
బాలీవుడ్ కాంట్రవర్శీ క్వీన్ కంగనా రనౌత్ జయాపజయాలతో సంబంధం లేకుండా బాలీవుడ్ లో ఆదరణ పొందుతోంది
బాలీవుడ్ కాంట్రవర్శీ క్వీన్ కంగనా రనౌత్ జయాపజయాలతో సంబంధం లేకుండా బాలీవుడ్ లో ఆదరణ పొందుతోంది. అస్సలు సిగ్గుపడకుండా తన మనసులోని మాటను బహిరంగంగా చెప్పే నైపుణ్యాన్ని కలిగి ఉన్న నటి. రెగ్యులర్ గా తన స్వభావం కారణంగా వివాదాలను ఎదుర్కొంటోంది. కంగనా రనౌత్ దేశ రాజకీయ వ్యవహారాల్లోను చర్చగా మారింది. దేశాన్ని ప్రభావితం చేసే విషయాల గురించి క్వీన్ బహిరంగంగా మాట్లాడుతుంది. దీంతో కంగనా రాజకీయ రంగ ప్రవేశంపై పలు ఊహాగానాలు వెల్లువెత్తాయి. తాజాగా కంగన రాజకీయ రంగ ప్రవేశం గురించి ఓ పోస్ట్ లో వ్యాఖ్యానించింది. కంగనా రనౌత్ లోక్ సభ 2024 ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారా? ఈ పోస్ట్ సారాంశం అదేనా? అంటే వివరాల్లోకి వెళ్లాలి.
2024 లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయనున్నట్టు వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలేనని కంగనా రనౌత్ తాజాగా స్పష్టం చేసింది. కిరోణ్ ఖేర్ స్థానంలో కంగనా రనౌత్ తో రాజకీయ పార్టీ పెట్టి చండీగఢ్ ఎన్నికలలో పోటీ చేయించే ఆలోచనలో ఉన్నారని కథనాలొస్తున్నాయి. దీనిపై కంగన తన ఇన్‌స్టాగ్రామ్ లో వివరణ ఇచ్చింది. కంగనా రనౌత్ స్పందిస్తూ, తన బంధువులు చాలా మంది ఈ కథనాల తాలూకా స్క్రీన్‌షాట్‌ను తనకు పంపుతున్నారని, అయితే ఇది ఊహాజనితమని పేర్కొంది. ఈ శీర్షిక నా కోట్ (నేను చెప్పినది) అని భావించి నా బంధువులు, స్నేహితులు దీన్ని నాకు పంపుతున్నారు. శీర్షిక నా కోట్ కాదు.. అన్నీ ఊహాగానాలే! అని కంగన రాసింది.
దసరా రోజున రావణ్ దహన్ కోసం ఢిల్లీలోని రాంలీలాకు తనను ముఖ్య అతిథిగా పిలవడాన్ని ప్రశ్నించిన రాజకీయ నాయకుడు సుబ్రమణ్యస్వామికి కంగనా రనౌత్ కఠినమైన సమాధానం ఇవ్వడంతో అంతకుముందు హెడ్‌లైన్స్ లోకి వచ్చింది. భవిష్యత్‌లో గొప్ప నాయకురాలిగా ఎదగడానికి తాను అర్హురాలిని అని కంగన ప్రతిస్పందించింది. ''ఒక స్విమ్ సూట్ పిక్చర్ ..నీచమైన కథనంతో రాజకీయాల్లోకి రావడానికి నా మాంసం తప్ప నాకు మరేమీ లేదని సూచిస్తున్నారు.. హ హ హ హ హ హ నేను హిందీ చిత్ర రంగంలో అత్యుత్తమ కళాకారిణిని. రచయిత... దర్శకురాలు, నిర్మాత, విప్లవ రైట్ వింగ్ ఇన్‌ఫ్లుయెన్సర్ ని కూడా. నా బదులు ఒక యువ పురుష మావ్రిక్ ఉన్నట్లయితే, అతడు బహుశా గొప్ప భవిష్యత్ నాయకుడిగా మార్గదర్శకత్వం వహించే వాడిగా ఉండగలడు..'' అని వ్యాఖ్యానించింది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. కంగనా రనౌత్ చివరిగా తేజస్ అనే చిత్రంలో నటించింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ పాత్రలో నటించింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. తర్వాత తన ఆస్తులు అమ్మి భారీ పెట్టుబడితో తెరకెక్కించిన 'ఎమర్జెన్సీ' రిలీజ్ కి రావాల్సి ఉంది. ఇందులో కంగన భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను పోషించింది. ఈ సినిమా నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి.